కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు?
posted on Oct 15, 2022 6:54AM
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా మీడియాలో ఆయన పర్యటన వివరాలు, ఎవరెవరితో భేటీ అయ్యారు. ఎవరెవరు ఆయనను కలిశారు అన్న వివరాలు ప్రముఖంగా వస్తాయి. ముఖ్యంగా తెరాస సామాజిక మాధ్యమంలో ఈ వివరాలను, విషయాలనూ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. గత కొంత కాలంగా ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలతో విరుచుకుపడుతుండటంతో ఆయన ప్రసంగాలూ, ప్రకటనలూ జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా వస్తున్నాయి.
అలాంటిది ఆయన జాతీయ పార్టీని ప్రకటించిన తరువాత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేతగా తొలి సారి హస్తిన పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆయన పర్యటనకు సంబంధించి ఎటువంటి వార్తలూ బయటకు పొక్కడం లేదు. అసలు ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నారు. ఎవరెవరితో భేటీ అవుతున్నారు అన్న విషయాలను కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే ఆయన హస్తినలో బస చేసి నాలుగు రోజులు అయ్యింది. తొలి రెండు రోజులలో ఆయన బీఆర్ఎస్ కోసం కిరాయికి తీసుకున్న భవనాన్ని పరిశీలించారనీ, అలాగే ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న తెరాస భవనాన్ని పరిశీలించి కొన్ని సూచనలు చేశారనీ మాత్రమే వార్తలు వచ్చాయి. అంతే ఆ తరువాత ఆయన హస్తినలో ఏం చేస్తున్నారు అన్న విషయాలపై ఎటువంటి సమాచారం తెలియడం లేదు.
పార్టీ వర్గాలు కూడా ఈ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గోప్యతను పాటిస్తున్నారు. అన్నిటికీ మించి ఈ పర్యటనలో ఆయన వెంట ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమార్తె కల్వకుంట్ల కవిత, మరో బంధువు సంతోష్ ఉన్నారు. దీంతో ఆయన హస్తిన పర్యటనకు కారణాలపై రాజకీయ వర్గాలలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే తాను కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ గురించి ఆయన హస్తినలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిందీ లేదు. అలాగే పార్టీ ప్రకటన తరువాత ఇప్పటి వరకూ ఒక బహిరంగ సభ నిర్వహించిందీ లేదు.
పార్టీ జెండా, అజెండాలపై వివరాలేవీ వెల్లడించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చాలని చేసిన తీర్మానాన్ని పార్టీ ప్రతినిథుల ద్వారా ఈసీకి సమర్పించి ఇక ఆ విషయంపై నోరెత్తడం లేదు. కేసీఆర్ సహజంగా చిన్న విషయానికి కూడా బ్రహ్మాండమైన ప్రచారం ఇస్తారు. బ్రహ్మాండం అన్నది ఆయన ఊతపదంలా వాడుతారు. అయితే బీఆర్ఎస్ విషయంలో మాత్రం ఆయన బ్రహ్మాండమైన మౌనం మాత్రమే పాటిస్తున్నారు. కనీసం తెలంగాణ ప్రజలకు కూడా ఆయన బీఆర్ఎస్ గురించి తన నోటి ద్వారా ఒక్క మాట చెప్పలేదు.
ప్రజలతో సంబంధం లేకుండానే పేరు మార్పు తంతును కానిచ్చేశారు. జాతీయ పార్టీని ప్రకటించిన దసరా రోజున ఆయన మీడియాతో మాట్లాడలేదు. జాతీయ పార్టీ కదా హస్తిన వేదికగా ఆయన మాట్లాడతారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ ఆయన హస్తినలో బస చేసి నాలుగు రోజులైనా ఇప్పటి వరకూ కొత్త పార్టీ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. దీంతో ఆయన హస్తిన పర్యటన వెనుక జాతీయ పార్టీకి మద్దతు కూడగట్టడానికి మించిన స్వకార్యమేదో ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.