ఇప్పుడు షర్మిల ఎవరు వదిలిన బాణం?
వైఈసార్ టీపీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో చాలా మంది చాలా చాలా అనుమానాలు వ్యక్త పరిచారు. పక్క రాష్ట్రం ఏపీలో, సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా,ఆమె రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అనే చర్చ విస్తృతంగా జరిగింది. అప్పట్లోనే ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’. అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది. అయితే,ఇప్పడు అదొక రకంగా ముగిసన అధ్యాయం. అక్కడి నుంచి ఆమె చాలా దూరం ‘నడిచి’ వచ్చారు. వైఎస్సార్ టీపీ పేరిటి పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె బాటలో ఆమె రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ మరోమారు అదే ప్రశ్న, షర్మిల ఎవరు విసిరిన బాణం అనే ప్రశ్న మళ్ళీ తెరమీదకు వచ్చింది. అలాగే, ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? ఆమె రియల్ టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఆమె వెంట ఎవరన్నారు, ఎవరు లేరు అనే విషయాన్ని పక్కన పెడితే, వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు వీకరించినప్పటి నుంచి ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో మహా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు.అంతే కాదు, రాష్ట్రంలో కాలు పెట్టింది మొదలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అయన కుమారుడు కేటీఆర్,కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, మరో ఇంటి చుట్టం సంతోష కుమార్’ ఇలా రాజకీయాల్లో కీలకంగా ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి, ప్రధాన స్రవంతిలోని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ నాయకుల కంటే, షర్మిల తెరాస ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తున్నారు. మంత్రి కేటీఆర్ రేపెప్పుడో, ప్రధాని మోడీ బట్టలు ఊదదీసి నడిబజార్లో నిలబెదతామని అంటున్నారు. కానీ షర్మిల తెరాస ప్రభుత్వం, బట్టలు రోజు విప్పుతూనే ఉన్నారు.
అదలా ఉంటే, మహా ప్రస్థానం పాద యత్ర నుంచి ఆమె ఓ చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఢిల్లీ వెళ్ళారు. రహస్యంగా ఎవరిని కలిశారో ఏమో కానీ, ప్రత్యక్షంగా మాత్రం, సీబీఐ డైరెక్టర్’ ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలపైనే కాకుండా, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డినిపైన అవినీతి పైనా ఆరోపణలు చేశారు .ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఒక లక్ష 20 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిబిఐకి ఫిర్యాదు చేశారు. అలాగే, మిషన్ భగీరథ సహా తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు అన్నిట్లోనూ అవినీతి ప్రవహించిందని, ఆన్నిటి పైనా, సిబిఐ విచారణ కోరినట్లు చెప్పారు.
నిజానికి, ఆమె ఇప్పడు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి కొత్తగా చెప్పిన విషయమంటూ ఏదీ లేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాళేశ్వరం అవినీతి గిరించి ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఇదరినీ మించి మాజీ మంత్రి నాగం జనార్ధన రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి, ఎకంగా ఒక బృహత్ గ్రంధానికి సరిపడినంత సమాచారాన్ని మీడియా ముందుంచారు.అసలు ఎవరి దాకానో ఎందుకు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అంతటివాడు, కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అయినా ఇంతవరకు ఏమీ జరగలేదనుకోండి, అది వేరే విషయం. అలాంటప్పుడు షర్మిల ఇంత హటాత్తుగా సాగుతున్న పాదయాత్రకు బ్రేక్ చెప్పి మరీ ఢిల్లీ ఎందుకెళ్ళారు? సిబిఐకి ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ, ఆమె టార్గెట్ చేసింది ఎవరిని? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
షర్మిల సిబిఐకి ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం పైనే అయినా, ఆమె టార్గెట్ మాత్రం, బ్రదర్ జగన్ రెడ్డి అనే అనుమానాలు ఇటు తెలంగాణ, అటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్’లో కొంచెం గట్టిగానే వినవస్తున్నాయి. అందుకే, జగన్ రెడ్డికి అత్యంత అప్తుడిగా భావించే మేఘా కృష్ణా రెడ్డిని షర్మిల టార్గెట్ చేశారని అంటున్నారు. అలాగే, సమయ సందర్భాలను బట్టి చూస్తే, బీజేపీ పెద్దలు కేసీఆర్’ను ఇరకాటంలోకి నెట్టేందుకు షర్మిలను రంగంలోకి దించారని అంటున్నారు. అయితే గతంలో, కేఎ పాల్’కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రిని కలిసిన తర్వాతనే కాళేశ్వరం సహా తెరాస ప్రభుత్వ అవినీతికి సంబంధించి, సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు షర్మిల అమిత్ షా ను ప్రత్యక్ష్యంగా కలవక పోయినా, ఆయన, ఇతర బీజేపీ పెద్దల సూచనల మేరకే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టార్గెట్’గా ఇద్దరి అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్న మేఘా కృష్ణా రెడ్డిపై ఆరోపణలు చేశారని అంటున్నారు. అందుకే ఇప్పుడు షర్మిల ఎవరు వదిలిన బాణం? షర్మిల టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకక ముందే ఈమె మరో సారి ఈ నెల 21న అంటే శుక్రవారం మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ సారి ఆమె సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదునే ఈడీకి కూడా అందజేస్తారని చెబుతున్నారు.