తెలంగాణ సీఎస్ ఏపీకి వెళ్లాల్సిందే? హై కోర్టు తీర్పు.. కోరినా గడువు ఇవ్వని న్యాయస్థానం..
posted on Jan 10, 2023 @ 11:03AM
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ సీఎస్ గా ఆయన కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది. సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ మంగళవారం (జనవరి 10)న తీర్పు వెలువరించింది.
రాష్ట్ర విభజన జరిగినప్పుడు సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్ కుమార్ తెలంగాణలో సీఎస్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కేంద్రం 2017లో హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్‌ను రద్దు చేస్తూ ఏపీకి వెళ్లాలని తీర్పు వెలువరించింది. తీర్పు అమలుపై సోమేష్ కుమార్ తరఫు న్యాయవాది మూడు వారాలు గడువు కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. ఆయన తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. 2019 డిసెబంర్ నుంచి సోమేశ్ కుమార్ తెలంగాణ సీఎస్‌గా కొనసాగుతున్న సంగతి విదితమే. హై కోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ ఇక ఏపీకి వెళ్లి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన ఏపీకి వెళతారా? లేక ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ ప్రవేశం చేసి బీఆర్ఎస్ లో కొనసాగుతారా అన్న విషయం ఆయనే తేల్చుకోవలసి ఉంటుంది. ఆంధ్రా కేడర్ కి చెందిన సోమేష్ పట్టుబట్టి మరీ ఇంత కాలంగా తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఇందుకు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించి మరీ ఏపీకి వెళ్లకుండా తెలంగాణకే పరిమితమయ్యారు.
ఇక ఇప్పుడు తాజాగా తెలంగాణ హైకోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాగా సోమేష్ కుమార్ ఇటీవలి కాలంలో ఈడీ నజర్ లో ఉన్నారని కూడా అంటున్నారు. ముఖ్యంగా ఫీనిక్స్ కుంభకోణంలో సోమేష్ ప్రమేయంపై ఈడీ కూపీలాగుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు ఆయనను మరిన్ని ఇబ్బందులలోకి నెట్టడం ఖాయమని అంటున్నారు. దీంతో ఆయన కేంద్రం కేటాయింపు ప్రకారం ఏపీకి వెళతారా? లేక రాజీనామా చేసి రాజకీయాలలో అడుగుపెడతారా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. సీఎస్ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా కొనసాగుతున్న అంజనీ కుమార్ కూడా ఏపీ క్యాడర్ కు చెందిన వారే కావడంతో ఆయన భవిష్యత్ ఏమిటన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొని ఉంది.
అంజనీ కుమార్ తెలంగాణ క్యాడర్ అధికారి కాదు. ఆయన కూడా ఏపీ క్యాడర్ కు చెందిన అధికారే. ఇందుకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఆ కేసు తేలిన తరువాత మాత్రమే ప్రస్తుతం తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా నియమించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అంజనీ కుమార్ విషయంలో ఏం జరగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.