ముందస్తు పై మళ్ళీ పిల్లి మొగ్గలు!
posted on Jan 10, 2023 @ 9:55AM
ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి .. ఎటూ పోలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం…కొట్టుమిట్టాడు తోందా అంటే,పబ్లిక్ అవుననే అంటున్నారు. మేథావులు అయితే, మహా కవి, శ్రీ శ్రీ సంధ్యా సమస్యలు,(ఆ సాయంత్రం...ఇటు చూస్తే అప్పులవాళ్లూ..అటు చూస్తే బిడ్డల ఆకలి.. ఉరిపోసుకు చనిపోవడమో..సముద్రమున పడిపోవడమో-..సమస్యగా ఘనీభవించిందొక సంసారికి గీతాన్ని గుర్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కూడా అదిగో అలాంటి సంధ్యా సమస్యలే వెంటాడుతున్నాయి అంటున్నారు. అందుకే పరిస్థితి ఎటూ పాలు పోక గుడుగుడు గుంచం గుండేరాగం .. అన్నట్లు ముందస్తు ఎన్నికల చుట్టూ అక్కడక్కడే గిరగిర తిరుగుతోందని, వైసీపీ నేతలు పిల్లి మొగ్గలు వేస్తున్నారని అంటున్నారు.
నిజానికి, ఓటమి భయం తోనే వైసీపీ నేతలు ఏమి చేయడమో ... ఎటు పోవడమో పాలుపోని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు పోదామంటే, ముందస్తు ఎన్నికలకు పోతే ముందుగానే ఇంటికి పోతామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే హెచ్చరిస్తున్నారు. అలాగని అందాక అగుదామంటే.. అసలుకే మోసం వచ్చేలా వుంది. అందుకే అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల అట్టును, ఒక రోజు ఇటు ఒక రోజు అటు తిరగేస్తున్నారు.
నిజానికి ముందస్తు ఎన్నికలను ముందుగా తెరపైకి తెచ్చిందే అధికార పార్టీ నాయకులు. ఒకసారి కాదు, ఒకటికి పది సార్లు వైసీసీలో, జగన్ రెడ్డి ప్రభుత్వంలో ‘ఆల్ ఇన్ వన్’ గా చెలామణి అవుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి ముందస్తు ఉందనో లేదనో వాక్రుచ్చి, ఎప్పటికప్పుడు ముందస్తు చర్చను సజీవంగా ఉంచుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే, ముందస్తు ముచ్చటను తెర మీదకు తెచ్చారు. నిజానికి ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వ్యూహాత్మక తప్పటడుగులను పట్టించు కోవడం లేదు. ప్రభుత్వం వేస్తున్న పిల్లి మొగ్గలను అయితే అసలే పట్టించుకోవడం లేదు. ఆ ముచ్చటను ఎప్పుడోనే వదిలేశాయి. అలాగే ప్రజలు కూడా ముందస్తా వెనకస్తా అనేది పక్కన పెట్టి, ఎన్నికలు ఎప్పడు వచ్చినా, ఒక్క ఛాన్స్ మోసానికి గట్టిగా బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఇంకా తమను తాము మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేసే విఫల ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు ముందు ఎందుకు వెళుతున్నారు అనేది కానీ, వెళ్లి వచ్చిన తర్వాత ఎందుకు వెళ్లారు, ఏమి చేశారు అనేది కానీ ఓపెన్ గా చెప్పేస్తే ఎవరికీ ఎలాంటి అనుమానం ఉండేది కాదు. కానీ, అలాంటిది ఎమీ లేకుండా ఆయన ఎప్పుడు వెళ్ళినా విడుదల చేసే ‘ఆవు కథ’ వినతి పత్రాన్ని,తేదీలు మార్చి విడుదల చేశారు. అంతేకాదు, ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది ఎందుకనుకుంటున్నారు ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రధాని అనుమతి కోసం అంటూ వైసీపీ నాయకులు, సోషల్ మీడియా చెవి కొరుకుడు ప్రచారం సాగించారు. తమకు మాత్రమే తెలిసిన ఈ ‘రహస్యా’న్ని అడిగిన వారికీ, అడగని వారికీ మాత్రమే చెప్పి, ముందస్తు చర్చను ముందుకు తెచ్చారు. అయినా అప్పుడు సజ్జల సహా పార్టీ పెద్దలు ఎవరూ బయటకు వచ్చి అలాంటిది ఏమే లేదని గట్టిగా చెప్పలేదు. ఏదో అలా ఓ చిన్న ప్రకటనతో సరిపెట్టారు.
కాగా, ఇప్పడు తాజాగా తాజాగా పవన్, చంద్రబాబు భేటీ తర్వాత మరోమారు సజ్జల అసలు ముందస్తు ఎన్నికల ఆలోచనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేయడం లేదని ప్రకటించారు. ప్రజలు మాకు ఐదేళ్లు పరిపాలించేందుకు అవకాశం ఇచ్చారని ఆయన చెబుతున్నారు. పవన్, చంద్రబాబు భేటీ అయ్యారని తెలియగానే సజ్జల రామకృష్ణారెడ్డి హఠాత్తుగా తెర ముందుకు వచ్చి. ముందస్తు ఎన్నికలు ఉండవని సెలవిచ్చారు. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకునేందుకు ఎన్ని అడ్డదారులు అయినా తొక్కేందుకు సిద్ధంగా ఉందని, ఆ వ్యూహంలో భాగంగా, విపక్షాల నడుమ సాగుతున్న పొత్తుల చర్చ ఒక కొలిక్కి రాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన జగన్ మదిలో లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ అనిమనిస్తున్నారు.
అయితే విపక్ష పార్టీలు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజా బలమున్న తెలుగు దేశం, జనసేన జగన్ అంచనాలను తారుమారు చేసి.. వేగంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నందున ఇప్పుడు వెనక్కి తగ్గితే బెటరని వైసీపీ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారని చెపుతున్నారు. అందుకే సజ్జల మరో మారు తెర మీదకు వచ్చి పవన్,చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పడం లేదని వాపోతున్నారు. నిజమే అది రహస్య సమావేశమే కావచ్చు, అయినా ప్రతిపక్ష పార్టీల సమావేశం వివరాలను బయట పెట్టాలి అనుకోవడం ముఖ్యమంత్రి ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించినట్లు చేపుతున్న వివరాలను మాత్రం దాచి ఉంచడం ఏమిటో సజ్జల వారే సెలవివ్వాలని అంటున్నారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో రహస్యం ఏమీ లేదు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ జగన్ రెడ్డి తెచ్చిన అత్యంత ప్రమాదకరమైన జీఓ 1 పైనే వారు చర్చించారు. ఒక విధంగా ఆ ఇద్దరినీ కలిపింది కూడా ఆ దుర్మార్గ జీఓ నే. అంతే కాదు, ఆ ఇద్దరిని పీటల మీదకు చేర్చింది, పౌరోహిత్యం చేసింది కుడా మరెవరో కాదు వైసీపీ పెద్దలే. అయినప్పటికీ వాళ్లు ఓట్లు, సీట్లు గురించి చర్చించుకున్నారని చెప్పలేదని సజ్జల బాధపడిపోతున్నారు.అయితే, రాజకీయ పరిశీలకులు మాత్రం ఒకసారి ప్రజలు నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందస్తు అయినా వెనకస్తు అయినా ఒకటే .. ముందు నుయ్యి వెనుక గొయ్యి ...ఎటు పడిపోవడమో .. తేల్చుకోవల్సింది ..ఆయనే అంటున్నారు.