చంద్రబాబు, పవన్.. తెలంగాణలో ప్రభావం ఎలా ఉంటుందంటే..?
posted on Jan 10, 2023 @ 2:47PM
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఏపీ రాజకీయాలలో పెను సంచలనం సృష్టించిన సంగతి విదితమే. వచ్చే ఎన్నికలలో ఏపీలో రాజకీయ సమీకరణాలేమిటన్నది ఈ భేటీ తేల్చేసిందనే పరిశీలకులు చెబుతున్నారు. వీరి భేటీపై అధికార వైసీపీ నేతల విమర్శలే.. రాజకీయ యవనికపై వీరి కలయిక ఎంతటి ప్రభావం చూపిందన్నది ఇట్టే అవగతమౌతుంది.
జగన్ పాలనను ప్రజా క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా ఇంత కాలం తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ఇక జగన్ ప్రభుత్వ రాజ్యహింస, అణచివేత పతాక స్థాయికి చేరుకోవడంతో ఉమ్మడి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు కదలాలని నిర్ణయానికి వచ్చాయా? ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందా? అంటూ వీరి భేటీ అనంతరం రాజకీయ వర్గాలలో చర్చ ప్రారంభమైంది. ఎన్నికలు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దానికి తోడు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని చెబుతున్నారు. సరే ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే.. వీరి భేటీ ప్రభావం తెలంగాణలో ఎలా ఉంది. ఉంటుంది అన్న విషయానికి వస్తే..
ఒక వేళ తెలుగుదేశం, జనసేనలు ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగితే పరిస్థితి ఏమిటన్న దానిపై కూడా రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉన్నా.. క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అందుకే.. తెలంగాణలో టీడీపీ ఇంకా బ్రతికే ఉందా?.. నాయకులే లేని పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందా? క్యాడర్ మొత్తం ప్రత్యామ్నాయ పార్టీలలో దూరిపోగా ఇంకెక్కడ టీడీపీ!.. అంటూ ఇంత కాలంగా వినవస్తున్న వ్యాఖ్యలన్నీ పూర్వపక్షమై పోయేలా ఇటీవలి చంద్రబాబు ఖమ్మం సభ సక్సెస్ అయ్యింది. తెలంగాణలో లీడర్ లేకపోయినా.. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్న విషయాన్ని తెలుగుదేశం సభ నిర్ద్వంద్వంగా నిరూపించింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా తెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ గట్టి పట్టు ఉంది. ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయనకు ఏపీలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కూడా బలమైన ఫ్యాన్ బేస్ ఉంది.
దీంతో చంద్రబాబు, పవన్ కల్యాన్ భేటీ తెలంగాణలో కూడా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ రణ క్షేత్రంలో అడుగు పెడితే ఇక్కడ అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, జనసేనానికి ఉన్న ఆదరణ కలిసి రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావమే చూపే అవకాశం ఉంది. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 14.7 శాతం ఓట్లతో 15 స్దానాలలో విజయం సాధించింది. అలాగే 2018 ఎన్నికలలో రెండు స్థానాలలో విజయం సాధించింది. ఇప్పటికీ కనీసం పాతిక స్థానాలలో తెలుగుదేశం ప్రభావం గణనీయంగా ఉంటుందని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిపోయిన తరువాత తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగైపోయిందనీ, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం మరింత ప్రభావమంతమైన పాత్ర పోషిస్తుందంటున్నారు.
తెలుగుదేశం, జనసేనలు కలిస్తే ఆ ప్రభావం మరింతగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కలయిక వెనుక ఆర్ఎస్ఎస్ ఉండటంతో తెలంగాణలో వీరి కలయికతో అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అందులోనూ బీజేపీ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ తెలుగుదేశం, జనసేనల కలయిక వెనుక ఉందంటే కచ్చితంగా ఈ రెండు పార్టీల కు బీజేపీ మద్దతు కూడా తోడౌతుందనీ అంటున్నారు. ఉభయ తారకంగా తెలుగుదేశం జనసేనల పొత్తుకు ఏపీలో బీజేపీ సహకారం, అందుకు ప్రతిగా ఈ కూటమి తెలంగాణలో కమలం పార్టీకి అండ అన్న వ్యూహం అమలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.