క్యాడర్ తో లోకేష్ పర్సనల్ టచ్!
posted on Jan 10, 2023 @ 9:36AM
రాజకీయ పార్టీల నాయకులు ఎంతగా ప్రజల్లో మెలగ గలిగితే అంతగా ప్రజలకు దగ్గరవుతారు. అలాగే నాయకులకు పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటే క్యాడర్ అంత గట్టిగా పార్టీ కోసం, నాయకుడి కోసం పనిచేస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీ కార్యకర్తలు నాయకులు అనే కాదు, పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ, వారి వారి పుట్టిన రోజున లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తారు. ప్రధాని సంతకంతో శుభాకాంక్షలు అందడం ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుంది. ఇక పార్టీ కార్యకర్తలకు అయితే కొత్త శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే, కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకులు ఇంకా ఉన్నారు.
ఆ కోవలోకే వస్తారు.. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన దుష్పరిణామాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు త్వరలో, ‘యువగళం’ పేరుతో ప్రారంభించబోతున్న పాదయాత్ర కోసం లోకేష్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో యువగళంలో యువతను ఆకట్టుకునేలా టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. కొంచెం టచ్ లో ఉంటే చెపుతా .. అంటూ కార్యకర్తలను వాట్సప్ ద్వారా పలకరిస్తున్నారు.
పార్టీ కోసం పని చేస్తున్న యువ నాయకులు, కార్యకర్తల గురించి ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నారు. తన పాదయాత్ర సుదీర్ఘంగా సాగుతుంది కాబట్టి ఎవర్నైనా కలవాలంటే ఇబ్బంది అవుతుందని.. సోషల్ మీడియా సైనికుల్ని.. యువ నేతల్ని పిలిచి వరుస సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు.. నేరుగా వారితో నేరుగా టచ్‌లోకి వెళ్తున్నారు. ఈ పరిణామం టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని సంతోషానికి గురి చేస్తోంది.
డియర్ శ్రీనివాస్.. మీరు ప్రభుత్వ నిర్బంధాల్ని ఎదుర్కొని పోరాడుతున్న వైనం అద్భుతంగా ఉంది. నేను మీకు అండగా ఉంటాను అని నారా లోకేష్ పర్సనల్ వాట్సాప్ నెంబర్ నుంచి మెసెజ్ వస్తే.. సగటు టీడీపీ కార్యకర్తలకు ఎలా ఉంటుంది. గాల్లో ఎగురుతున్నట్లే ఉంటుంది. ఇలాంటి అనుభూతి చాలా మంది టీడీపీ కార్యకర్తలకు కలిగింది. ఎందుకంటే నారా లోకేష్ ఇలా వందల మంది టీడీపీ కార్యకర్తలకు మెసెజ్ చేశారు. అంత తీరిక ఆయనకు ఉందా .. ఇదంతా చాట్ బోట్ ద్వారా చేస్తున్నారని కొంత మంది అనుకున్నారు. ఎవరేమనుకున్నా.. తమను గుర్తించారన్న ఓ ఆనందం మాత్రం కార్యకర్తలకు కలిగింది.
ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ కోసం స్వచ్చందంగా పని చేసే కార్యకర్తలను లోకేష్ వ్యక్తిగతంగానూ కలిశారు. ప్రతీ రోజూ పదుల సంఖ్యలో వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందరితో సమావేశం పెట్టి ప్రసంగించి వెళ్లడం లాంటి పనులు చేయకుండా ఒక్కొక్కరితో సమావేశం అయ్యారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా తానున్నానని భరోసా ఇచ్చి పంపించారు. దీంతో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మరితం ఉత్సాహంగా పని చేస్తున్నారు. లోకేష్ పార్టీలోని యువశక్తిని యాక్టివేట్ చేస్తున్నారని .. టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారన్న అభిప్రాయం టీడీపీలో వినిపిస్తోంది.
నిజానికి తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా లోకేష్ పార్టీ కార్యకర్తల మంచి చెడులు చూసుకుంటున్నారు, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇష్తున్నారు. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించే సంప్రదాయాన్ని టీడీపీతోనే ప్రారంభించారు. ఈ ఆలోచన లోకేష్ బ్రెయిన్ చైల్డ్. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి లోకేష్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందివచ్చిన టెక్నాలజీ సాయంతో అందరితో దగ్గర సంబంధాలు పెంచుకుంటున్నారు. లోకేష్ తీరుతో పార్టీలో యువత మరింత చురుకుగా పని చేస్తోందని అంటున్నారు. ఇలాంటి పర్సనల్ టచ్ .. దీర్ఘ కాలంలో పార్టీకి మేలు చేస్తుందని అంటున్నారు.