సెంట్రల్ విస్తాలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు?
posted on Jan 10, 2023 @ 1:48PM
ఫిబ్రవరి 1 నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నూతన పార్లమెంట్ భవనంలోనే జరుగుతాయా అంటే కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఔననే అంటున్నాయి. పార్లమెంటు కొత్త భవనం రెడీ అయ్యిందని, తుదిమెరుగులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయనీ ఆ వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ విస్తా పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పార్లమెంటు కొత్త భవనంలోనే రానున్న బడ్జెట్ సమావేశాలు జరుగుతాయన్న విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ.. ఈ సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త బవనంలో సెంట్రల్ సెక్రటేరియెట్, ప్రధాని నివాసం, కొత్త కార్యాలయం, ఉపరాష్ట్రపతి నిలయం వంటివన్నీ ఉంటాయి. రెండేళ్ల కిందట ఈ నిర్మాణం మొదలైంది. 2020లో భూమి పూజ జరిగింది. టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ నిర్మాణ పనులు చేపట్టింది. దేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని చాటేలా జరుగుతున్న ఈ భవన నిర్మాణం తుదిమెరుగులు పూర్తి చేసుకుని ఈ నెలాఖరుకు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్న పట్టుదలతో కేందం ఉంది.
నిజానికి గతేడాది నవంబర్ లోనే పార్లమెంట్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకుంది. మొత్తం మీద వచ్చే నెలలో జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పార్లమెంటు కొత్త భవనంలో జరుగుతాయా లేదా అన్న విషయంలో ఇప్పటికింకా క్లారిటీ రాకపోయినప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి.