ఇందిరను తాకిన ఎన్టీఆర్ ప్రభం‘జనం’
posted on Jan 9, 2023 @ 4:24PM
రామన్న శకం
రానున్న శకం
చైతన్య రథం
సరి కొత్త పథం
జన చిత్త రథం
నెరవేర్చుటకై
గురువేష పథం
తెలుగు కీర్తి పతాకం విశ్వవ్యాప్తంగా రెపరెపలాడిన రోజు.. రాజభవంతులను వీడి రాజకీయం పేడవాడి పూరిగుడిసెను చేరిన రోజు.. అదే తెలుగుదేశం పార్టీ తొలి సారి ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన రోజు.. అదే జనవరి 9, 1983. మూడున్నర దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏకఛత్రాధిపత్యంగా అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ ను గద్దె దించి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలను చేపట్టిన రోజు జనవరి 9.
ఔను నాలుగు దశాబ్దాల కిందట ఇదే రోజున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత తొలిసారిగా కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ముఖ్యమంత్రిగా నాడు ఎన్టీఆర్ కొత్త చరిత్ర లిఖించారు. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్బావమే ఒక చరిత్ర, ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే అధికార పగ్గాలు చేపట్టడం మరో చరిత్ర. పార్టీ ఆవిర్బావం తరువాత ఆయన చేపట్టిన చైతన్య రథ యాత్ర చరిత్ర ఎన్నటికీ మరువని మహోన్నత చరిత్ర.
19 రోజుల పాటు ఎండ, వాన, రాత్రి, పగలు తేడా లేకుండా ఆయన రాష్ట్రం మొత్తం చుట్టేశారు. జనంతో మమేకమైపోయారు. అయితే అప్పట్లో అధికార మదంతో ఉన్న కాంగ్రెస్ ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తక్కువగా అంచనా వేసింది. అయితే ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంది. ఎన్నికలకు రోజుల ముందు అంటే 1983, జనవరి 3న తిరుపతిలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల ప్రచార సభ జరిగింది. అదే రోజు అదే తిరుపతిలో ఎన్టీఆర్ ఎన్నికల సభ కూడా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాగాంధీ సభ అయితే సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ సభ. తొలుత ఇందిర సభకు జనం భారీగా హాజరయ్యారు. అయితే ఇందిర ప్రసంగిస్తుండగా..ఎన్టీఆర్ తిరుపతి చేరుకున్నారన్న సమాచారం వచ్చింది. అంతే నిముషాల్లో ఇందిర సభ ఖాళీ.. అమె ప్రసంగం అర్ధంతరంగా ఆపేసి వెళ్లిపోయారు. ఆమె వెళుతున్న హెలికాప్టర్ ఎన్టీఆర్ సభ మీదుగానే వెళ్లింది. అప్పుడు కానీ.. ఎన్టీఆర్ ప్రభజనం ఏమిటన్నది ఆమెకు అవగతం కాలేదు. అప్పుడు అర్దమై చేయగలిగిందేమీలేదు.
అప్పటికే తెలుగుదేశం విజయం ఖరారైపోయింది. అదే ఫలితాల్లో తేటతెల్లమైంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికార పగ్గాలు అందుకుని ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. ప్రజా సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార వేదికపైనే రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఫైలుపై సంతకం చేసి పేదవాడి అన్నంగిన్నెగా మన్ననలు అందుకున్నారు.