ఖమ్మం తరువాత నిజామాబాద్.. భారీ సభకు తెలంగాణ తెలుగుదేశం సన్నాహాలు
posted on Jan 10, 2023 @ 1:22PM
తెలంగాణలో తెలుగుదేశం మళ్లీ తనదైన శైలిలో పంజా విసురుతోంది. ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభ... సక్సెస్ కాదు.. సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అదే జోష్‌తో మళ్లీ మరో చోట.. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ తెలుగుదేశం కసరత్తు చేస్తోంది. ఆ క్రమంలో ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా భారీ సభ నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అదీ ఈ జనవరి నెలాఖరులోగా ఉంటుందని తెలుస్తోంది. అందుకు త్వరలో తేదీ కూడా ఖరారు చేయనుందని సమాచారం.
ఆ క్రమంలో ఇప్పటికే టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇతర ముఖ్య నాయకులతో కూడా ఆయన భేటీ కానున్నారని సమాచారం. మరోవైపు అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేసే అంశంపై కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఆ క్రమంలో గడప గడపకు మన టీడీపీ పేరుతో కార్యక్రమాలు సైతం చేపట్టనుందని తెలుస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వ హాయంలో చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తోందని సమాచారం. ఇక గతంలో తెలుగుదేశం నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని సైతం.. తిరిగి ఆహ్వానించి.. అలా వచ్చిన వారికి కీలక పదవులు కట్టబెట్టాలని.. అలాగే పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కష్టపడే వారికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామనే ఓ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతల్లోకి బలంగా వేళ్లేలా పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అలాగే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ పరంగా తరచూ సమీక్షా సమావేశాలు తరచు నిర్వహిస్తూ.. నిత్యం ప్రజల్లో పార్టీ ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని.. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే.. కచ్చితంగా అభివృద్ధి జరుగుతోందనే ఓ విధమైన భరోసా ప్రజల్లో కల్పించాలనే లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.
మరోవైపు ఇప్పటికే ఖమ్మంలో ప్రారంభమైన టీడీపీ బహిరంగ సభల ఏర్పాటు.. నిజామాబాద్ మీదగా.. వరంగల్, మహబూబ్‌నగర్‌తోపాటు అన్ని జిల్లాల మీదుగా సాగి.. చివరకు అంటే.. జస్ట్ ఎన్నికల ముందు హైదరాబాద్ మహానగరంలో అతి పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించాలనే లక్ష్యంతో టీటీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం.
ఇక తెలంగాణ సెంటిమెంట్‌ను పునాదిగా చేసుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని రగిలించిన.. టీఆర్ఎస్ స్థాపకుడు కేసీఆర్ పార్టీని తాజాగా బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. దీంతో గతంలో ఆయన రగలించిన తెలంగాణ సెంటిమెంట్ కాస్తా.. పార్టీ పేరులో కూడా లేకుండా పోయింది. అదీకాక.. తెలంగాణలో కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాంటి నేపథ్యంలో కేసీఆర్‌ని.. ఆయన బీఆర్ఎస్‌ని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? అంటే సందేహమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరోవైపు బీజేపీ సైతం తెలంగాణలో పాగా వేసేందుకు ఎంత చేయాలో అంత చేస్తోంది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోలతో.. ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అన్న సంగతి తెలంగాణ ప్రజలు ఏమో కానీ .. హస్తం పార్టీ నేతలకే పూర్తిగా అర్థమైపోయింది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో.. సైకిల్ పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ఏక తాటిపైకి వచ్చి కొద్దిగా కష్టపడితే.. రానున్న ఎన్నికల్లో పురుటి గడ్డపై తెలుగుదేశం పార్టీ మళ్లీ సత్తా చాటుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం విశ్లేషించి మరీ చెబుతున్నారు.