బల్దియా కోటలో పాగా చంద్రబాబు లక్ష్యం!
posted on Jul 8, 2024 @ 3:08PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవంపై దృష్టి సారించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీ కచ్చితంగా తెలంగాణలో పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఒక బలీయమైన పార్టీ. అందులో సందేహం లేదు. అయితే రాష్ట్ర విభజన తరువాత పార్టీ ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతో తెలంగాణలో ఆ పార్టీ ఒకింత బలహీనపడినట్లుగా కినిపిస్తోందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించేందుకు చెప్పుకోదగ్గ నేత లేడు. ఆ పార్టీ నాయకులంతా వేరే వేరే పార్టీల్లో సర్దుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీకి గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. అయితే ఆ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంలో తెలుగుదేశం పాత్ర కూడా ఉందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. చంద్రబాబునాయుడిని వైసీపీ సర్కార్ స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన సమయంలో, అప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కనీసం స్పందించలేదు. ఆయన కుమారుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎన్టీఆర్ అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు. కావాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలు చేసుకోండి, తెలంగాణ గడ్డపై మాత్రం అనుబతించబోం అని హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఆ కారణంగానే తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్, అభిమానులూ పనిగట్టుకుని మరీ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేశారు. బీఆర్ఎస్ ఓటమిలో తెలుగుదేశం క్యాడర్ ది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. తెలంగాణలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగేంత బలం ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎన్నికల రణక్షేత్రానికి దూరంగా ఉండటం పార్టీ క్యాడర్ కు ఇబ్బందికరమే.
గత అసెంబ్లీ ఎన్నికలలోనే పోటీ చేయాలన్న డిమాండ్ క్యాడర్ నుంచి గట్టిగా వినిపించింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులు, పార్టీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టై జైలులో ఉండటం వంటి కారణాలతో అప్పట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగకుండా తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది. అయితే ఏపీ ఎన్నికలలో విజయం తరువాత చంద్రబాబు ఇక నుంచి తెలంగాణలో పార్టీ పటిష్టతపై దృష్టి పెడతానని ప్రకటించారు. స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీలో ఉంటుందనీ ఉద్ఘాటించారు. ఆ మాటలకు కొనసాగింపు అన్నట్లుగా తాజాగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకువస్తామని ప్రకటించారు. దీంతో రాజకీయ పరిశీలకులు చంద్రబాబు ఏడాది ఏడాదిన్నర లోగా జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో పార్టీ పోటీ చేస్తుందనీ, చంద్రబాబు ఆ దిశగా పార్టీని సమాయత్తం చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారింది. స్వయంగా కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ ఇటీవలి లోక్ సభ ఎన్నికలలో ఖాతా తెరవలేకపోయింది. బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి లోక్ సభలో ప్రాతినిథ్యం లేకపోవడం ఇదే మొదటి సారి అంటే ఆ పార్టీ రాష్ట్ర ప్రజలలో విశ్వాసాన్ని ఎంతగా కోల్పోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం పార్టీలతో పొత్తును తెలంగాణకు కూడా విస్తరించాలని భావిస్తున్నారు. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా రంగంలోకి దిగితే.. పోరు ద్విముఖమే అవుతుందని ఆయన భావిస్తున్నారు. ద్విముఖ పోరులో తెలుగుదేశం కూటమి విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందనీ, బీఆర్ఎస్ సోదిలోకి కూడా రాదన్నది ఆయన భావనగా చెబుతున్నారు. ద్విముఖ పోరులో కాంగ్రెస్ పై పై చేయి సాధించి విజయం సాధించడం ఖాయమని భావిస్తున్న చంద్రబాబు, అదే జరిగితే జీహెచ్ఎంసీ మేయర్ పదవిని తెలుగుశం పార్టీకి దక్కుతుందని, ముందుగా హైదరాబాద్ లో జెండా పాతితే అక్కడ నుంచి రాష్ట్రం మొత్తం పార్టీ విస్తరణ, బలోపేతానికి బాటలు వేయాలని చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.