చంద్రబాబు నివాసం చుట్టూ జగన్ భక్త ఆంజనేయులు ప్రదక్షిణలు!

ఏ ఎండకాగొడుగు పట్టేసి పబ్బం గడిపేసుకోవచ్చని భావిస్తున్న అధికారులకు చంద్రబాబు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. జగన్ హయాంలో ఆయన మెప్పు కోసం నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన అధికారులకు చంద్రబాబు అస్సలు అప్పాయింట్ మెంటే ఇవ్వడం లేదు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు చంద్రబాబును కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు చంద్రబాబు దర్శనం కోసం విఫలయత్నం చేశారు. జగన్ అధికారంలో ఉండగా ఆయన మెప్పు కోసం నిబంధనలే కాదు, విలువలను సైతం తుంగలో తొక్కి వ్యవహరించిన పీఎస్సార్ ఆంజనేయులుకు చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వ అనుకూల అధికారిగా ముద్రపడడం తెలుగుదేశం నేతలు, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడమే ఇంటెలిజెన్స్ చీఫ్ విధులు అన్నట్లుగా పని చేశారు. 
చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, కోడెల శివప్రసాద్, జేసీ ప్రభాకరరెడ్డిలపై అక్రమ కేసులు నమోదు చేయడంలో కీలక పాత్ర వీఎస్సార్ ఆంజనేయులుదేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన తెలుగుదేశం నాయకులు, శ్రేణులనే కాకుండా, జగన్ ప్రభుత్వ విధానాలపై గళమెత్తిన సామాన్యులను కూడా వదల కుండా వేధింపులకు గురి చేసిన ఆరోపణలు ఉన్నాయి.  ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని  ఆరోపణలపై ఎన్నికల సంఘం ఆయనను విధుల నుంచి తప్పించిన తరువాత కూడా అనధికారికంగా ఆయన వైసీపీ కోసం పని చేశారు.  దీంతో పీఎస్సార్  ఆంజనేయులును తెలుగుదేశం కూటమి సర్కార్ దూరం పెట్టింది. అటువంటి పీఎస్సార్ ఆంజనేయులు ఇప్పుడు  ఏదో విధంగా చంద్రబాబును ప్రసన్నం చేసుకోవాలని శతథా ప్రయత్నిస్తున్నారు.  చంద్రబాబు హైదరాబాద్ పర్యటనలో ఉన్న సమయంలో పీఎస్సార్ ఆంజనేయులు జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. చంద్రబాబును కలిసేందుకు ఆయన రిక్వెస్ట్ చేశారు. అయితే అప్పాయింట్ మెంట్ లేదంటూ భద్రతా సిబ్బంది ఆయనను గేటులోకి కూడా అనుమతించలేదు. అంతటి పరాభవం ఎదురైనా  ఆశ చావక అక్కడే పడిగాపులు కాశారు. ఏదో విధంగా ఆయనను కలిసి తాను జగన్ ఒత్తిడి మేరకే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పుకోవడానికి ఒక్క సారి ఆయనను కలిస్తే చాలని ప్రాధేయపడ్డారు. అయినా ఫలితం లేకపోయింది.   ఇప్పుడే కాదు అమరావతిలో కూడా ఆయన సెక్రటేరియెట్ లో చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేశారు.