కృష్ణమ్మ వాకిట్లో గోదారమ్మ సందడి!
posted on Jul 10, 2024 @ 12:53PM
గోదావరి జీవ జలాలు ఉప్పునీటి పాలు కాకుండా పట్టిసీమ ద్వారా కృష్ణలోకి మళ్లించిన చంద్రబాబు దార్శనికత కృష్ణా డెల్టా రైతుల కష్టాలను తీర్చింది. సాగు కష్టాలను పరిష్కరించింది. ఎంతో దార్శనికతో 2014 ఎన్నికలలో విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు సరిగ్గా ఏడాది తిరిగే సరికల్లా పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, కృష్ణా నదిలో నీటి లభ్యత సన్నగిల్లడం వల్ల ఎడారిగా మారుతున్న కృష్ణా డెల్టాను సస్య శ్యామలేం చేయాలన్న లక్ష్యంతో గోదావరి నీటిని మళ్లించి పట్టి సీమ ద్వారా సాగునీటిని అందించారు.
అయితే 2019లో అధకారంలోకి వచ్చిన జగన్ అహంకారం, అవగాహన లేమి, అసమర్థత కారణంగా నాలుగేళ్ల పాటు పట్టిసీమను నిరుపయోగంగా వదిలేసి కృష్ణా డెల్టాను పట్టించుకోలేదు. అయితే 2024 ఎన్నికలలో చరిత్ర ఎరుగని విజయాన్ని తెలుగుదేశం కూటమి సొంతం చేసుకుంది. చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నేల రోజులలోనే పట్టిసీమ మళ్లీ వినియోగంలోకి వచ్చింది. పట్టి సీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణలోకి మళ్లించి ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీటిని బుధవారం (జులై 10) విడుదల చేశారు. గోదావరి జలాలలో కృష్ణా డెల్టా భూములను తడిపారు.
పోలవరంలో అంతర్భాగంగా నిర్మించిన పట్టిసీమ చంద్రబాబు దార్శనికతకు, రైతులు నష్టపోకూడదన్న సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తుంది. పట్టి సీమ ద్వారా కృష్ణా నదిలోకి చేరిన గోదావరి జలాలలో బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం 11.01 అడుగులకు చేరింది. దీంతో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర కృష్ణా డెల్టా భూములకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో సాగునీటి రంగం రెండు దశాబ్దాలు వెనక్కు వెళ్లిందని విమర్శించారు. రైతును, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే తెలుగుదేశం లక్ష్యమని ఉద్ఘాటించారు. పట్టిసీమను వట్టిసీమన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. కృష్ణాడెల్టాకు నీటి విడుదలతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.