ప్రత్యేక హోదాపై అప్పుడు పెగలని నోరు ఇప్పుడు లేస్తోందా?
posted on Jul 2, 2024 @ 9:45AM
ఐదేళ్లు అధకారంలో ఉండి.. రాష్ట్ర విధ్వంసంపై తప్ప మరో అంశంపై దృష్టిపెట్టని జగన్ సర్కార్ కు జనం ఘోర పరాజయాన్ని రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా జగన్ పార్టీకి అర్హత లేదని తమ ఓటు ద్వారా స్పష్టం చేశారు.
అయినా జగన్ కు కానీ, వైసీపీ నేతలకు కానీ బుద్ధి వచ్చినట్లు కనిపించడం లేదు. 2019 ఎన్నికలకు ముందు.. పాతిక ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను అని జగన్ పదే పదే చెప్పడంతో నిజమే కాబోలని భావించిన జనం వైసీపీకి 23 ఎంపీ స్థానాలలో విజయం చేకూర్చారు. అలాగే 151 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఐదేళ్లు అధకారం వెలగబెట్టిన జగన్ రాష్ట్ర ప్రగతిని తిరోగమన బాట పట్టించారు. 23 మంది ఎంపీలు ఉన్నా కేంద్రాన్ని కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి అడగలేదు.
పైపెచ్చు కేంద్రంలో మోడీ సర్కార్ కు సంపూర్ణ బలం ఉంది. మన మాట ఎందుకు వింటుంది అంటూ ఎన్నికల సమయంలో తాను చెప్పిన ప్రత్యేక హోదాను అటకెక్కించేశారు. అప్పులు చేయడం, ప్రత్యర్థులపై కక్ష సాధించడమే పాలన అన్నట్లుగా జగన్ ఐదేళ్ల హయాం సాగింది. దీంతీ జనంలో జగన్ పట్ల, ఆయన పార్టీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఫలితం తాజా ఎన్నికలలో ఆ పార్టీకి ఎదురైన ఘోర పరాజయం. అయితే గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మాటెత్తడానికే వణికిపోయిన వైసీపీ అధినేత, ఆయన పార్టీ నేతలు ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా గురించి గళమెత్తుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో నోరెత్తని వైసీపీ ఎంపీలు, ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు.
ఆ పార్టీ ఎంపీ మెడీ రఘునాథ్ రెడ్డి రాజ్యసభలో విభజన హామీకి కట్టుబడి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తే, ఆ పార్టీకి చెందిన అరకు ఎంపీ తనూజారాణి ఇదే అంశాన్ని లోక్ సభలో లేవనెత్తారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నందున విభజన హామీని నెరవేర్చాలని కోరారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే కొలువుదీరి ఉంది. అయినా అప్పుడు గొంతుపెగలని వైసీపీ ఎంపీలు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం వింతగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.