వామ్మో.. హరీష్‌రావుది పెద్ద ప్లానే!
posted on Jun 27, 2024 @ 8:54PM
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బొంద పెట్టేశారు. ఇప్పుడు ఆ పార్టీకి పెదకర్మ పెట్టడానికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు వున్నారు. ఈ రెండు పార్టీలకు పోటీగా బీఆర్ఎస్‌ని గుటకాయస్వాహా చేయడానికి మరో నాయకులు పథక రచన చేస్తున్నారు. ఆయన ఎవరో ఈ ఆర్టికల్ హెడ్డింగ్ చూస్తేనే మీకు అర్థమైపోయి వుంటుంది. ఎస్. ఆయన ఎవరో కాదు.. కేసీఆర్ ముద్దుల మేనల్లుడు హరీష్ రావు.
బీఆర్ఎస్ పార్టీలో ఎంపీలు ఎవరూ లేరు. అసెంబ్లీ ఎన్నికలలో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్‌లో ఇప్పుడు మిగిలింది కేవలం 33 మందే. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఉప ఎన్నికలో ఆ స్థానం కాంగ్రెస్ సొంతమైంది. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్‌లో మిగిలిన ఎమ్మెల్యేల సంఖ్య 33 మంది. ఈ 33 మందిలో కేసీఆర్ కుటుంబం ముగ్గుర్ని పక్కన పెడితే, మిగిలింది 30 మంది. ఈ 30 మందిని తమ సొంతం చేసుకోవడానికి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో వున్న అధికారాన్ని ఎరగా చూపించి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో వున్న అధికారాన్ని తాయిలంగా చూపించి బీజేపీ ఈ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు చేన్నాయి. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా ఆ పనేదో తానే చేస్తే ఓ పనైపోతుందిగా అనే ఆలోచనలో హరీష్ రావు వున్నట్టు సమాచారం.
హరీష్‌రావు ఎంత గింజుకున్నా బీఆర్ఎస్‌లో ఆయన స్థానం నాలుగు గానో, ఐదుగానో వుంటుందే తప్ప కేసీఆర్ తర్వాతి స్థానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. టైమ్ బ్యాడ్ అయిందిగానీ, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి, లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ దుమ్ముదులిపి వుంటే, కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ ఢిల్లీలో హడావిడి చేసేవారే. తెలంగాణ ప్రజల అదృష్టం బాగుండి అలా జరగలేదు. దీని మీనింగ్ ఏమిటంటే, కేసీఆర్ నీడలో వుంటే హరీష్ రావు ఎన్నటికీ ఎదగరు. అందుకే, మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెసో, బీజేపీనో గద్దల్లాగా ఎగరేసుకు పోకముందే, తానే రంగంలోకి దిగితే మంచిదని హరీష్ రావు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
ఇక కేసీఆర్ని ప్రజలు విశ్వసించే అవకాశం లేదు కాబట్టి, నేను బీఆర్ఎస్‌కి సమర్థమైన నాయకత్వం వహిస్తానని ఎమ్మెల్యేలను ఒప్పించి తన నాయకత్వంలో బీఆర్ఎస్‌ని చీల్చే ఉద్దేశంలో హరీష్ రావు వున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా పార్టీని చీల్చకపోతే తనకు ఫ్యూచర్లో ఇక చాన్సే వుండదనేది హరీష్ రావు ఆలోచనగా పరిశీలకులు చెబుతున్నారు. బీఆర్ఎస్‌ని చీల్చి, తనదే అసలు బీఆర్ఎస్ అని నిరూపించుకుని, పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునే ఉద్దేశంలో హరీష్ రావు వున్నట్టు సమాచారం.