ఎయిమ్స్ మంగళగిరికి జలయోగం!
posted on Jul 8, 2024 @ 5:09PM
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... షార్ట్.కట్‌లో ఎయిమ్స్. పేదలకు ఉత్తమ వైద్యం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మంగళగిరిలో ఏర్పాటు చేసిన వైద్య సంస్థ. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్.ని 1680 కోట్ల రూపాయలతో నిర్మించింది. ఆ ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీ కూడా వుంది. మంగళగిరి ప్రాంతంతోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తూ వుంది ఎయిమ్స్. ఇక్కడ నిపుణులైన వైద్యులు, సిబ్బంది వున్నారు. ఇది పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ సంస్థ. నిర్మాణం, నిర్వహణ బాధ్యత కేంద్రానిదే. 2016లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎయిమ్స్.కి 2019 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిమ్స్.కి నీటి సరఫరా ఆపేశారు. ఎందుకంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించింది కదా.. అందుకని! నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదువుతున్నాయి మహాప్రభో అని ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఎయిమ్స్.కి నీళ్ళు ఇవ్వడం పెద్ద కష్టమైన పని కూడా కాదు. నాలుగైదు కిలోమీటర్ల దగ్గర్లోనే కృష్ణానది కూడా వుంది. అయితే నీరు ఇచ్చే ఉద్దేశమే లేనప్పుడు నది పక్కనే వున్నా నీళ్ళు ఇవ్వరు కదా.. దాంతో చేసేది లేక ఎయిమ్స్ ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తూ నెట్టుకొస్తోంది. అయితే 900 పడకల స్థాయి వున్న ఆ ఆస్పత్రిని నీటి ఎద్దడి కారణంగా 350 పడకల ఆస్పత్రిగా కుదించి సేవలు అందిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడిగా కూడా వున్నారు. ఆయన కూడా నీటి సమస్య గురించి ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఎవరు ఎలాగైనా చావండి.. ఇది చంద్రబాబు హయాంలో కట్టింది కాబట్టి మేం పట్టించుకోం... ఇలా సాగింది జగన్ ప్రభుత్వ వైఖరి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస ప్రభుత్వం తొలగిపోయి, పనిచేసే ప్రభుత్వం రావడంతో ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్‌లో కొత్త ఆశలు చిగురించాయి. ఆరు రోజుల క్రితం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఎయిమ్స్ ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్యని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆరు రోజులు అలా గడిచాయో లేదో.. ఎయిమ్స్.కి కృష్ణానది నుంచి నీటిని సరఫరా చేసే పైపు లైన్ల ఏర్పాటు పనులు ప్రారంభమై, చకచకా జరుగుతున్నాయి. పనికిమాలిన ప్రభుత్వానికి, పనిచేసే ప్రభుత్వానికి మధ్య తేడా ఇదే.