అమరావతి అడ్డంకులన్నీ హుష్ కాకీ!
posted on Jul 8, 2024 6:42AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. గత ఐదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా నవ్వుల పాలు కావడానికి కారణమైన జగన్ పాలన ముగియడంతో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ హుష్ కాకీ అన్నట్లుగా ఎగిరిపోయాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా తలెత్తుకుని ఠీవీగా నిలిచింది. ప్రపంచ స్థాయి రాజధాని ఇన్ మేకింగ్ అన్న విశ్వాసం అందరిలోనూ బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చి గత ఐదోళ్లుగా అన్ని రకాలుగానూ క్షేభను అనుభవించిన రైతుల కష్టాలూ కడతేరిపోయినట్లే.
అయితే జగన్ అధికారంలో ఉండగా మూడు రాజధానుల డ్రామాకు తెరతీసిన కారణంగా అమరావతిపై కోర్టుల్లో పలు కేసులు విచారణ దశలో ఉన్నాయి. సుప్రీం కోర్టు నుంచి స్థానిక కోర్టుల వరకూ వివిధ దశలలో విచారణలో ఉన్న కేసుల ఉపసంహరణే ఇక మిగిలింది. చంద్రబాబు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అని ప్రకటించడంతోనే... వివాదాలన్నీ సమసిపోయినట్లైంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎంత మాత్రం రాజధాని లేని రాష్ట్రం కాదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతివైపే చూస్తోంది. పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. కేంద్ర సంస్థలు తరలిరానున్నాయి. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. అందులో సందేహం లేదు.
అయితే అమరావతిపై వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్న దాదాపు 100 కు పైగా కేసుల ఉపసంహరణే మిగిలింది. వీటిలో రైతులు వేసిన కేసుల ఉపసంహరణకు వారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా ఆర్-5 జోన్ ఏర్పాటు చేయడంపై రైతులు వేసిన కేసును ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం అని ప్రకటించడంతో ఆ కేసు ఉపసంహరణకు రైతులు నిర్ణయం తీసుకున్నారు.
ఇక మూడు రాజధానులపై సుప్రీం కోర్టులో ఉన్న కేసును చంద్రబాబు సర్కార్ వెనక్కు తీసుకోవడం ఖాయం. అలాగే అమరావతి రాజధాని కోసం అలుపెరుగని పోరాటం చేసిన రైతులపై జగన్ ప్రభుత్వం పెట్టిన వందలాది కేసులను చంద్రబాబు సర్కార్ వెనక్కు తీసుకోవడం ఖాయం. మొత్తంగా కేసుల ఉపసంహరణ, పరిష్కారం తదితర అంశాలన్నీ పూర్తి కావడానికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇఫ్పటికే కేంద్రం నుంచి అమరావతి నిర్మాణం కోసం సంపూర్ణ సహకారం ఉంటుందన్న స్పష్టత వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి పురోగతిపై ఆసక్తి, హర్షం వ్యక్తం అవుతున్నాయి.