అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి.. మోడీ పిలుపు!
posted on Jun 30, 2024 @ 3:36PM
ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలి.. ఆ మొక్కను అమ్మను చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి... ఇదీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన కొత్త ప్రచారం ఉద్దేశం. ఈ ప్రచార కార్యక్రమానికి ఆయన హిందీలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం నాడు నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో వెల్లడించారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తూ, రేడియోలో మాట్లాడారు. ‘‘నేను మా అమ్మ పేరుతో మొక్క నాటాను. ప్రతి ఒక్కరూ తమ తల్లులను గౌరవించేలా ఒక మొక్కను నాటండి’’ అని మోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు ‘స్వచ్ఛ భారత్’ అనే ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడోసారి ప్రధాని అయ్యాక ప్రారంభించిన ప్రచార కార్యక్రమం ‘ఏక్ పేడ్ మా కే నామ్’. మరి మీరు కూడా మీ అమ్మ పేరుతో ఒక మొక్కని నాటి, ఆ మొక్కను అమ్మని చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుంటారు కదూ!?