అఖిలపక్ష౦ టార్గెట్ టిడిపి..!!

      రాజకీయ ప్రయోజానాల కోసం రాష్ట్రాన్నివిభజించే ప్రయత్నం చేసి అడ్డంగా ఇరుక్కుపోయిన కాంగ్రెస్ పార్టీ తనతోపాటు రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థి ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగమే రాష్ట్ర విభజన అంశంలో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   అసలు ఈ సమావేశానికి ఏ పార్టీ అయినా హాజరై ఒక్క అంశానికి సమాధానం ఇచ్చినా ఆ పార్టీ రాష్ట్ర విభజనకు అంగీకరించినట్టే అవుతుంది. సీమాంధ్ర ప్రాంతంలో బలంగా వున్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ఈ అఖిలపక్షాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా చేసుకుందని అంటున్నారు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర విభజన జరిగిపోతున్నా చంద్రబాబు ఇప్పటికీ తన రెండు కళ్ళ సిద్దాంతంతో ఎలాగో రోజులు దొర్లించేస్తుంటే..తన దత్త పుత్రుడు మాత్రం పూర్తిగా సమైక్యఫలం పొందలేక బాధపడుతున్నారు. కాబట్టి టిడిపి ఎలాగు సమన్యాయం కోరుతోంది గనుక రాష్ట్ర విభజనకు అవసరమయిన మార్గదర్శకాల పేరిట ఆ మాటేదో తెదేపా నోటనే చెప్పించేస్తే, సమైక్యాంద్రాకి ఆ పార్టీ వ్యతిరేఖమనే ట్యాగ్ తగిలించేసి, వైకాపా సీమాంద్రాలో దూసుకుపోవడానికి మార్గం సుగమం చేసేయవచ్చును. తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఈసారి కూడా స్పష్టమయిన వైఖరి చెప్పకపోవచ్చును. తద్వారా తెలంగాణాలో కూడా తేదేపాకు చీటీ చింపేయవచ్చనే ఆశో అత్యాశో ఈ అఖిలపక్షం ఐడియాలో దాగి ఉండి ఉండవచ్చును.

కిరణ్ మాటల ఆంతర్యం ఇదేనా..!

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య బాణి వినిపించారు. విశాఖపట్నంలో జరిగిన ఇందిరాగాంధీ 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రం ఇప్పటికీ సమైక్యంగా ఉందంటే ఆ ఘనత ఇందిరాగాంధీదేనని చెప్పారు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ, 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమాల తర్వాత రాష్ట్రం కలసి వుండాలని చెప్పి, ఆ మాటమీద నిలబడి వున్న గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. తాను సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుకుంటూ ఇప్పటి వరకూ చెప్పిన మాటలన్నీ తన సొంత మాటలు కాదని.. ఇందిరాగాంధీ చెప్పినమాటలనే చెప్పానని అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజున మరోసారి సమైక్యవాణిని వినిపించడం పరోక్షంగా మరోసారి సోనియాగాంధీకి సమైక్య సందేశం పంపడమేనని సీఎం సన్నిహితులు అంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా అయినా పునస్సమీక్షించుకోవాలని ఆయన పరోక్షంగా సోనియాగాంధీకి సూచిస్తున్నారని అంటున్నారు.

అఖిలంతో పార్టీలలో కలకలం

  తెలుగుదేశం పార్టీలో పయ్యావుల కేశవ్ రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషనుతో, అవసరమయితే చంద్రబాబుని ఒప్పించయినా సరే తెలంగాణాపై పార్టీ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని సమైక్యాంధ్ర కోసం పోరాడుతామని చెప్పిన మాటలతో, పార్టీలో ఆంధ్ర-తెలంగాణా నేతల మధ్య ఇప్పటికే చిన్నపాటి యుద్ధం మొదలయింది.   ఇప్పుడు హోం మంత్రి షిండే దీపావళి సందర్భంగా అఖిలపక్షం బాంబు పేల్చడం కేవలం తమ పార్టీలో విద్వంసం సృష్టించడానికేనని ఆ పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే మొదటి నుండి అఖిలపక్షం కోసం గట్టిగా డిమాండ్ చేసింది కూడా తమ పార్టీయే కావడంతో, ఇప్పడు దానిపై గట్టిగా మాట్లాడేందుకు తెదేపా నేతలు తడబడుతున్నారు. తెరాస,టీ-కాంగ్రెస్ నేతలు దీనిపట్ల తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.   బీజేపీ ఇదీ ఒకందుకు తమ మంచికే జరుగుతోందని భావిస్తోంది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు దీనిని వ్యతిరేఖిస్తుండగా మొదటి నుండి రాష్ట్ర విభజన సమర్దిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాత్రం దీనిని స్వాగతించారు. అయితే ఈసారి అఖిలపక్షానికి ఒక్కో పార్టీ నుండి ఒక్కరినే పిలవాలని ఆయన డిమాండ్ చేసారు.   బహుశః ఆయన కాంగ్రెస్ మనసులోమాటే పలికినట్లుంది. అలా చేస్తే మొట్ట మొదట ఇబ్బంది పడేది తెదేపాయేనని కాంగ్రెస్ కి తెలియకపోదు. అందువల్ల ఈసారి ఒక్కరినే రమ్మని ఆహ్వానించవచ్చును. అయితే తెదేపా కూడా కాంగ్రెస్ జిమ్మికులన్నిటినీ ఔపోసన పట్టిన పార్టీయే గనుక, ఒకవేళ అఖిలపక్షానికి ఒక్కరినే ఆహ్వానిస్తే, ఏదో కారణంతో బాయ్ కాట్ చేసి గండం గట్టె క్కేప్రయత్నం చేయవచ్చును. అయితే సమస్యకు ఇది సరయిన, శాశ్విత పరిష్కారం కాదని ఆ పార్టీకి తెలియకపోదు. అయితే ఇంతకంటే వేరే మార్గం కూడా లేదు.   ఇక సమైక్యాంధ్ర ఉద్యమ గురుతర భాద్యతలని తన భుజస్కందాలకెత్తుకొన్న జగన్మోహన్ రెడ్డి, ఈ సమావేశంలో రాష్ట్ర విభజన చేయడానికి వీలులేదని, కేంద్రమంత్రుల బృందం సూచనలేవీ తమకు ఆమోదయోగ్యం కావని గట్టిగా వాదించి, తన సమైక్య చాంపియన్ బిరుదుని కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును.

జగన్ని ఒడ్డున పడేయడానికే అఖిలపక్షమా

  కాంగ్రెస్ అధిష్టానం అకస్మాత్తుగా నిద్రనుండి మేల్కొన్నట్లు, రాష్ట్ర విభజన ప్రక్రియని చాలా దూరం తీసుకుపోయాక, ఇప్పుడు అఖిలపక్షమని కలవరింతలు మొదలుపెట్టింది. దానికి అనేక కారణాలు ఉండవచ్చును. గానీ దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? అని ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీలకేనని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర విభజన జరిగిపోతున్నా చంద్రబాబు ఇప్పటికీ తన రెండు కళ్ళ సిద్దాంతంతో ఎలాగో రోజులు దొర్లించేస్తుంటే, సమైక్యాంధ్ర సంకల్పం చెప్పుకొన్నజగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా సమైక్యఫలం పొందలేక బాధపడుతున్నారు.   మొన్ననే అతను చాల తెగించి తుఫానుకి ఎదురీదుతూ హైదరాబాదులో సమైక్య శంఖారావం పూరించినప్పటికీ, దానిని కాస్తా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీకి రెండే రెండు లేఖలు వ్రాసి పడేసి హైజాక్ చేసేసారు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒడ్డున పడేయాలంటే ఈ అఖిలపక్షం చాలా అవసరం. ఈరోజు జగన్ ‘బెయిలు బంధనాలు’ తెంచే పని కూడా పూర్తయిపోయింది. ఇక తెదేపా ఎలాగు సమన్యాయం కోరుతోంది గనుక రాష్ట్ర విభజనకు అవసరమయిన మార్గదర్శకాల పేరిట ఆ మాటేదో తెదేపా నోటనే చెప్పించేస్తే, సమైక్యాంద్రాకి ఆ పార్టీ వ్యతిరేఖమనే ట్యాగ్ తగిలించేసి, వైకాపా సీమాంద్రాలో దూసుకుపోవడానికి మార్గం సుగమం చేసేయవచ్చును.   తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఈసారి కూడా స్పష్టమయిన వైఖరి చెప్పకపోవచ్చును. తద్వారా తెలంగాణాలో కూడా తేదేపాకు చీటీ చింపేయవచ్చనే ఆశో అత్యాశో ఈ అఖిలపక్షం ఐడియాలో దాగి ఉండి ఉండవచ్చును.

రాష్ట్ర విభజనపై మళ్ళీ అఖిలపక్షం త్వరలో

  అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడిలో చచ్చిందన్నట్లు, “రాష్ట్ర విభజనలో చాలా లోతుగా అధ్యయనం చేసి, అందరినీ సంప్రదించి, అందరి ఆమోదంతో, అందరికీ ఆమోద యోగ్యంగా, చాలా రాజ్యంగబద్దంగా, ఎంతో నీతి నిజాయితీలతో, పూర్తి పారదర్శకతతో రాష్ట్ర విభజన చేస్తున్నామే తప్ప, ఇందులో మా రాజకీయ ప్రయోజనాల గురించి ఏమాత్రం చూసుకోలేదని” ఇంతకాలం గొప్పగా కబుర్లు చెపుతూ వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్ర విభజనపై మళ్ళీ అఖిలపక్షం అంటూ కొత్త రాగం అందుకొంది. వచ్చేనెల 7న మంత్రుల బృందం సమావేశం జరిగిన తరువాత, 9న ఈ సమావేశం ఉంటుందని హోం మంత్రి షిండే ప్రకటించారు.   సీమాంద్రాలో అన్ని లక్షలమంది ప్రజలు, ఉద్యోగులు రోడ్లమీధకు వచ్చి రెండు నెలల పాటు ఏకధాటిగా తమ నిరసనలను తెలియజేసినా వారి ఆందోళనలని పట్టించుకోకుండా, వారి అభిప్రాయాలకు వీసమెత్తు విలువీయకుండా మొండిగా ముందుకు సాగిన కాంగ్రెస్ అధిష్టానం, మళ్ళీ అఖిలపక్ష రాగం ఆలపించడం ఎలా ఉందంటే, శవాన్ని శ్మశానానికి తీసుకు వెళ్ళేటప్పుడు మధ్యలో ‘నారాయణ నారాయణ గోవింద గోవింద’ అంటూ మూడు సార్లు క్రిందకు దించి లేపుతారు, పోయిన మనిషి తిరిగొస్తాడనే చిన్న ఆశతో కావచ్చు లేదా వేరే కారణం వల్ల కావచ్చును, ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాష్ట్ర విభజన విషయంలో అలాగే చేస్తోంది.   ఒకవైపు కేంద్రంలో రాష్ట్ర విభజనతో సంబంధం ఉన్నఅన్నిమంత్రిత్వ శాఖలు పంపకాల ప్రక్రియ పూర్తి చేస్తుంటే, మరో వైపు హోంశాఖ నియమించిన టాస్క్ ఫోర్సు రెండు రాష్ట్రాలలో శాంతి భద్రతల కోసం చకచకా ఏర్పాట్లు చేస్తుంటే, వచ్చే నెల 5ని డెడ్ లైన్ గా పెట్టుకొని అన్ని పనులు పూర్తి చేస్తూ, 7న మంత్రుల బృందం సమావేశం కూడా పూర్తయిన తరువాత, అప్పుడు తీరికగా అఖిలపక్షం అనడం కేవలం వెటకారమే. ఏనుగు నమిలి తినే తన దంతాలను దాచిపెట్టి, పైకి అందమయిన పెద్ద దంతాలు చూపుతునట్లే, కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్ర విభజన విషయంలో వ్యవహరిస్తోంది.   అఖిలపక్షం ఐడియాతో రాష్ట్ర విభజనను జాప్యం చేయాలనుకొంటోందని తెలంగాణా వాదులు భావిస్తే, తమను మరో మారు మభ్యపెట్టేందుకే ఈ కొత్త నాటకమని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ రెండు ప్రాంతాలలో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయే అవకాశం ఉంది. అసలు మొదటి నుండి తన రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే చూసుకొంటూ మొండిగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అదే మొండి తనంతో ముందుకు సాగి ఉంటే, కనీసం తెలంగాణాలో అయినా ఆ పార్టీకి నాలుగు ఓట్లు రాలేవేమో!   కానీ ఇప్పుడు అఖిలపక్షం అనడం వలన మేమే తెలంగాణా సాధించామని భుజాలు చరుచుకొంటూ జైత్రయాత్రలు చేస్తున్న టీ-కాంగ్రెస్ నేతలు కూడా మళ్ళీ మారోమారు ఆ సాహసం చేయలేరు. అసలు ముందు చేయవలసిన పనిని ఆఖరున, ఆఖరున చేయవలసిన పనిని ముందు చేస్తూ, కాంగ్రెస్ అభాసుపాలవుతోంది. దీనినే వ్రతం చెడ్డా ఫలం దక్కక పోవడం అంటారేమో.

వైకాపా అభిమానులకి శుభవార్త

      వైకాపా అభిమానులకు శుభవార్త...ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై విధించిన షరతులను సీబీఐ కోర్టు సడలించింది. ఇకా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అంతేకాదు.. ఢిల్లీకి కూడా వెళ్లేందుకు అవకాశమిచ్చింది. తాను ఒక రాజకీయ పార్టీకి అద్యక్షుడనని, ఎమ్.పిని అని ,ప్రజలకు సంబంధించిన అంశాలపై ఆయా ప్రాంతాలలో పర్యటించవలసి ఉంటుందని , కనుక తనపై పెట్టిన ఆంక్షలను సడలించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తరఫున న్యాయవాది కోర్టులో అదే వాదనను వినిపించారు. ఈ వాదనను సిబిఐ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ఢిల్లీ వెళ్ళడానికి, రాష్ట్రంలో పర్యటించడానికి అనుమతినిస్తే కేసుపై తీవ్ర ప్రభావం పడుతుందని వాదించారు. చివరికి జగన్ తరుపు న్యాయవాది వాదనకు ఏకీభవించి కోర్ట్ అనుమతి మంజూరు చేసింది.    

జగన్మోహన్ రెడ్డి ఇక పూర్తి స్వేచ్చాజీవి

    వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకొని అర్దరాత్రి పూట రేపల్లెకు బయలుదేరినప్పుడు, భగవంతుని మాయ వల్ల అయన చేతికీ, కాళ్ళకూ వేసిన సంకెళ్ళు, అయన బందింపబడ్డ ఖారాగారం తాళాలు ఒకటొకటిగా వాటంతటవే విడిపోగా, కాపలా ఉన్న భటులు నిద్రలోకి జారిపోగా, యమునా నది మధ్యకు విడిపోయి ఆయనకు ఏవిధంగా దారి ఇచ్చిందో, ఇప్పుడు అదేవిధంగా ఆ పైవాడి కృప వలన కొందరు దుష్టులయిన సీబీఐ అధికారులు క్రమంగా జగన్మోహన్ రెడ్డి దారి నుండి అడ్డు తొలగిపోవడం, ఆయనపై వారు మోపిన ‘క్విడ్ ప్రో కేసులు’ కూడా వాటంతటవే విడిపోవడం, ఆయనకు క్లీన్ చిట్ రావడం, జైలు నుండి బయటపడటం అన్నీ ఏదో మాయలాగ చకచకా జరిగిపోయాయి. పైవాడి కృపని అర్ధం చేసుకోలేని కొన్ని 'తెలుగు జీవులు' వేరేవరి కృపవల్లనే ఇదంతా జరిగిపోతోందని అజ్ఞానంతో ఏమేమో మాట్లాడాయి.   అయితే సీమాంద్రాలో ఉండిపోయిన తన పార్టీని చేరుకోవాలంటే మధ్యలో కృష్ణా, గోదావరి వగైరా నదులు అడ్డుపడుతున్నట్లు “హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళకూడదనే బెయిలు షరతు” ఒకటి మిగిలిపోయుంది. అయితే ఆ పైవాడి కృప మన మీద ఉండాలే గానీ ఈ నదులేమిటి సముద్రాలు కూడా దాటేయవచ్చునని అలనాడు హనుమంతులవారే నిరూపించారు. ఇక ఈ చిన్న పాటి నదులొక లెక్కా?   తను రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడినని, అంతే గాక బాధ్యతగల యంపీనని (ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉండవచ్చుగాక, అది వేరే సంగతి) అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కష్టాలలో ఉన్న ప్రజలను ఓదార్చి వారి కన్నీళ్లు తుడవవలసిన అవసరం ఎంతయినా ఉన్నందున, తన బెయిలు షరతులను సడలించి తనను రాష్ట్రమంతటా పర్యటించేందుకు అనుమతించాలని ఆయన కోర్టుకు చేసుకొన్న విన్నపాన్ని కోర్టువారు సహృదయంతో అర్ధంచేసుకొని ఆయనకు రాష్ట్రమంతటా పర్యటించేందుకు అనుమతి మంజూరు చేసారీ రోజు.   అందువల్ల అలనాడు వసుదేవుడిలా జోరువానలో నడుస్తూ శ్రమపడినట్లుగా, జగన్ కూడా పాదయాత్రలు చేసుకొంటూనో లేకపోతే అంత టైం మనకి లేదని భావిస్తే ఎంచక్కా ఏ విమానమో లేక తన లోటస్ పాండు నుండి నేరుగా హెలికాఫ్టర్ లోనో ఎగురుకొంటూ కృష్ణా, గోదావరి, శారద, నాగావళి, వగైరా నదులన్నిటినీ చిటికలో దాటేసి సీమాంద్రాలో ఎక్కడ కావాలంటే అక్కడ వాలిపోవచ్చునిపుడు.   అందువల్ల తెదేపా నేతలు మళ్ళీ ఇది కూడా 'కుమ్మక్కు... కుమ్మక్కు' అంటూ ఆక్రోశించే అవకాశం ఉంది. అంతే గాక ‘పోరాడితే పోయేదేమీ లేదు విభజన చిచ్చు తప్ప(సంకెళ్ళు తప్ప) అనే నినాదంతో మొన్న హైదరాబాద్ లో సమైఖ్యసభ పెట్టి, తనకు సీమాంధ్రలో మంచి బలం ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి గట్టిగా నమ్మకం కలిగించిన తరువాతనే కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఆఖరి గేటు కూడా ఎత్తేసిందని తెదేపా ఆరోపిస్తే దాని అజ్ఞానికి అయ్యో పాపం! అనుకోక తప్పదు. అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి, లగడపాటి వంటి వారు కూడా మళ్ళీ దీనిని అపార్ధం చేసుకొనే ప్రమాదం ఉంది.

ప్రమాదం జరిగిన బస్సు జబ్బార్ దా? జేసీదా?

      మహబూబ్ నగర్ వద్ద జరిగినరోడ్డు ప్రమాదానికి సంబంధించి జేసీ ట్రావెల్స్ పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు జబ్బార్ ట్రావెల్స్ కు చెందినదని భావిస్తుండగా వోల్వో బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం.   AP 02 TA 0963 నెంబర్ గల బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో అనంతపురంలో రిజిస్టర్ అయ్యింది. అయితే ఆర్టీఏ రికార్డుల్లో బస్సు స్టేటస్ ఇనాక్టివ్గా ఉంది. జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రర్ అయిన బస్సు….జబ్బర్ ట్రావెల్స్ పేరుతో ఎందుకు నడుస్తుందనేది అంతుబట్టనిదిగా మారింది. అయితే ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. తాము రెండేళ్ల క్రితమే బస్సును అమ్మివేసినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జబ్బర్ ట్రావెల్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని… అయితే టైటిల్ మార్చకపోవటం వల్లే తమ ట్రావెల్స్ పేరు ఉందన్నారు. ఈ బస్సును 2010 అక్టోబర్లో విక్రయించినట్టుగా ఆర్టీఏ రికార్టులు చెబుతున్నాయి. అయితే ఈ విషాదంలో ఎక్కడ లోపం జరిగిందన్నదానిపై పూర్తి స్థాయి విచారణ జరగవలసి ఉంటుందంటున్నారు.

ఈ సామాజిక తెలంగాణా వాదనల అంతర్యమేమిటి

  ఒకవైపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతోందనే సంతోషం ఉన్నపటికీ, కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎలా అవ్వగలమనే ప్రశ్నటీ-కాంగ్రెస్ నేతలందరి మనసులని పురుగులా ఒకటే దొలిచేస్తోంది. ఇంతకాలం రెడ్డి, కమ్మ కులస్థుల చేతిలోనే ఉండిపోయిన అధికారాన్ని, కనీసం ఇప్పుడయినా వారి చేతిలో నుండి గుంజుకోకపోతే ఇక ఎప్పటికీ సాధారణ మంత్రులుగానే మిగిలిపోవలసి వస్తుందనే భయం కొందరిని పీడిస్తుంటే, రాష్ట్రం విడిపోయిన తరువాత తమ బలం గణనీయంగా తగ్గిపోవడంతో, సదరు కులాలకి చెందిన నేతలు ఇప్పుడు ఈ ‘సామాజిక తెలంగాణా వాదులను’ అందరినీ తట్టుకొని మళ్ళీ అధికారం ఏవిధంగా చేబట్టాలాఅని మధనపడుతున్నారు.   మొన్న మెహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో జరిగిన టీ-కాంగ్రెస్ నేతల జైత్రయాత్రలో ఓం ప్రధమంగా సోనియా రాహుల్ భజన కార్యక్రమం పూర్తయిన తరువాత, ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత, ఆత్మగౌరవం, ఆర్థిక సమానత్వం లాంటి ప్రత్యేకతలు ఉన్న తెలంగాణ రాష్ట్రం రావాలని తాము కోరుకొంటున్నామని అన్నారు.   అంటే దానర్ధం ప్రజలకి అవన్నీ దక్కాలని కాదు. ఈ కొలమానాలు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న తనవంటి వారిపట్ల అమలుచేయాలని ఆయన ఉద్దేశ్యం. అనేక ఏళ్లుగా అనేక మంది ప్రజల పోరాటాల వలన, బలిదానాల వలన తెలంగాణా ఏర్పడుతోందని చెపుతున్న ఆయన ముందుగా తనకు అధికారం రావాలనే బలమయిన కోరికతోనే ఈ సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత వంటి మాటలు ప్రతీ వేదికపై పదేపదే వినిపిస్తుంటారు. ఆయన వాదనను సమర్దించేవారు కూడా మొదట తమకే ముఖ్యమంత్రి పదవి రావాలని కోరుకొంటున్నారు గనుక, ఒకవేళ వారిలో ఎవరికీ దక్కినా మిగిలినవారి ఆత్మగౌరవం దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నమాట.   టీ-కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవికోసం ఈ కులసమీకరణాల లెక్కలు ఎలా ఉన్నపటికీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్ట మొదట తామే అధికారం చేపడతామని తెరాస నేతలు కారు మీద ఒట్టేసి మరీ చెపుతున్నారు. అదే జరిగితే టీ-కాంగ్రెస్ నేతల రూల్ నెంబర్.1,2,3 అంటే 1.సామాజిక తెలంగాణ, 2.రాజకీయ సాధికారికత, 3.ఆత్మగౌరవం మూడు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రి ఒక దళితుడే అవుతాడని ఎంత భరోసాలు ఇస్తున్నపటికీ, మిగిలిన వారు అందరూ ఆయన కుటుంబానికి చెందిన వెలమ దొరలే అయ్యి ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే వెలమదొరల చేతిలో దళిత ముఖ్యమంత్రి ఉంటారన్న మాట. అందువల్ల అప్పుడు సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత, ఆత్మగౌరవం దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంటుంది.   ఒకవేళ తెరాస కాంగ్రెస్ హస్తం అందుకొంటే ఆ ప్రమాదం రెట్టింపవుతుంది. కేసీఆర్ తన తెరాసను తీసుకువచ్చి ఏకంగా కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తే ఆ ప్రమాదం మూడింతలయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానానికి కావలసింది ‘సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత, ఆత్మగౌరవం’ కాదు. కేంద్రంలో అధికారం చెప్పటేందుకు అవసరమయిన 15 యంపీ సీట్లు మాత్రమే. అది టీ-కాంగ్రెస్ నేతలివ్వలేరని కాంగ్రెస్ అధిష్టానం గనుక గట్టిగా నమ్మినట్లయితే అప్పుడు వారిని కూడా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను పక్కన బెట్టినట్లే పక్కన పడేసి, కేసీఆర్ హ్యాండ్ పట్టుకోవచ్చును.   అందువల్ల ప్రస్తుతం వారు తమ భజన కార్యక్రమం కంటిన్యూ చేసుకొంటూనే, కావాలనుకొంటే రూల్ నెంబర్.1,2,3ల గురించి ఎంతయినా గట్టిగా మాట్లడుకోవచ్చును. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పారు కూడా. కానీ, అవేవి కాంగ్రెస్ అధిష్టానానికి అర్ధం అయ్యే పదాలు కాదు గనుక తనకు బాగా అర్ధం అయ్యే యంపీ సీట్లకే ప్రాధాన్యం ఇచ్చి అందుకు తగినవారికే ‘కుర్చీ’ అప్పగించవచ్చును. అందులో కూర్చోవడానికి ఈ మూడు రూల్స్ పరిగణనలోకి తీసుకోబడకపోవచ్చును.

నవంబర్ 9న తెలంగాణా ముసాయిదా అసెంబ్లీకి

  సీమాంద్రాలో ఊహించిన దాని కంటే త్వరగానే పరిస్థితులు చక్కబడటంతో కాంగ్రెస్ అధిష్టానం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలని రాష్ట్ర విభజనపై జోరు పెంచి దూసుకు వెళ్తోంది. ఈ రోజు ప్రధాని డా.మన్మోహన్ సింగ్ నివాసంలో తెలంగాణా ఏర్పాటు ప్రక్రియపై చర్చిచేందుకు కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఇందులో ప్రధాని డా.మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, అహ్మద్ పటేల్, చిదంబరం పాల్గొనట్లు తెలుస్తోంది.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖల నేపధ్యంలో రాష్ట్ర శాసనసభకు తెలంగాణా బిల్లు పంపితే ఎదురయ్యే పరిణామాలు,వాటికి నివారణోపాయాలు, బిల్లు పంపేందుకు ముహూర్తం గురించి చర్చిoచినట్లు సమాచారం. ఆ సమాచారం ప్రకారం వచ్చే నెల 9న ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హోం మంత్రి షిండే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి మాట్లాడి వచ్చారు. బహుశః ఆయనకి తాము పెట్టిన ముహూర్తం గురించి తెలియజేసి ఉండవచ్చును.   ఇక మరో వైపు హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం కూడా హైదరాబాదులో తనపని చకచకా పూర్తి చేస్తోంది. రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్, తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో శాంతి భద్రతల పరిస్థితిని ఈ బృందం అధ్యయనం చేయడంతో బాటు, రాష్ట్ర హోం శాఖకు ఉన్న ఆస్తులు, అప్పులను రెండు రాష్ట్రాలకు ఏవిధంగా పంచాలనే అంశంపై వారు చర్చిస్తున్నారు. వీరు వచ్చేనెల 5లోగా తమ నివేదికను హోం శాఖకు అందజేయవలసి ఉంటుంది.   వచ్చే రాష్ట్ర విభజన వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్రమంత్రుల బృందం నెల 7న ఆఖరి సమావేశం నిర్వహించి, తన నివేదికను మంత్రి మండలికి సమర్పిస్తుంది. అప్పుడు క్యాబినెట్ దానిపై ఒక ముసాయిదా లేదా తీర్మానం తయారుచేసి రాష్ట్రపతికి పంపితే, దానిని ఆయన రాష్ట్ర శాసనసభకు పంపుతారు. అది మళ్ళీ తనకు చేరగానే దానిని ఆయన క్యాబినెట్ కు పంపుతారు. అప్పుడు క్యాబినెట్ తెలంగాణాపై తుది బిల్లు తయారు చేసి పార్లమెంటులో ఆమోదం కోసం ప్రవేశపెడుతుంది.   ఈ ప్రకారం చూస్తే తెలంగాణా ముసాయిదా లేదా వేరొకటి ముందు ఊహించినట్లు నవంబర్ నెలాఖరుకి కాక 9వ తేదీనే పంపే అవకాశం ఉందని అనుకోవచ్చును. ఏ కారణంగానయినా మరో రెండు మూడు రోజులు ఆలస్యమయితే అవవచ్చును. అదే నిజమయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రచ్చబండను పక్కనబెట్టి క్లైమాక్స్ సీన్ కోసం సిద్దం కాక తప్పదు.

పిల్లికి ఎలుక సాక్ష్యం!

      సమైక్యాంధ్ర ఉద్యమకారుల ధాటికి నిన్న మొన్నటి వరకు సైలెంటైపోయిన పీసీసీ చీఫ్ బొత్స ఇప్పడు మళ్ళీ తనమార్కు రాజకీయాలు చేస్తూ మళ్ళీ రంగంలోకి దిగాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జేసీ దివాకరరెడ్డితో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చకపోతే పార్టీ వదిలి వెళ్ళిపో అని నిర్మొహమాటంగా చెప్పేశాడట.   జేసీ లాంటి నేతని పార్టీ వదిలి వెళ్ళిపో అనేంత సీన్ బొత్సకి లేదని జేసీ అభిమానులు బొత్సమీద మండిపడుతున్నాడు. బొత్స తన ప్రతాపం సీమాంధ్ర ప్రజల మీద, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల మీదే చూపిస్తున్నాడని, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద బొత్సకి ఎక్కడలేని ప్రేమ అని అంటున్నారు. ప్రస్తుతం తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న విభజన సమస్యకి బొత్స కూడా కారకుడని విమర్శిస్తున్నారు. ఈ ఇష్యూ ఇలా వుంటే, అధిష్ఠానం దృష్టిలో ముఖ్యమంత్రి కిరణ్‌ ఇమేజ్ దెబ్బ తినేలా చేసి ఆ స్థానంలోకి తాను వచ్చేయాలని బొత్స కలలు కన్నాడు. దానికోసం తన వంతు ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు కొత్తగా ఏ ప్లాను వేశాడోగానీ సీఎంకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల వరకూ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడట. కిరణ్ పక్కా సమైక్యవాదట, కిరణ్ కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ విడిచిపెట్టడట. కిరణ్ సొంత పార్టీ పెట్టడట. జేసీ దివాకరరెడ్డిని పార్టీలోంచి వెళ్ళపొమ్మనడానికి, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వదిలి పోడని చెప్పడానికి మధ్యలో బొత్స ఎవరంట? కిరణ్ కుమార్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టడని బొత్స సర్టిఫికెట్ ఇవ్వడం పిల్లికి ఎలుక సాక్ష్యం చెప్పినట్టుందని విమర్శకులు అంటున్నారు.

బలపడుతున్న కేవీపీ, జగన్ బంధం!

      కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేవీపీ రామచంద్రరావు వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ఆత్మబంధువు. వైఎస్సార్ బతికి వుండగా రాష్ట్రంలో ఆయన వైభవం చూడటానికి రెండు కళ్ళూ చాలేవి కావు. వైఎస్సార్ మరణించాక కేవీపీ జగన్‌కి అండగా వుంటాడని అందరూ అనుకున్నారు. అయితే జగన్ వ్యవహార శైలి నచ్చకపోవడం వల్ల కేవీపీ ఆయనకి దూరమయ్యాడని అంటారు.   మొదట్లో జగన్ కేవీపీ చెప్పిన మాట వినకుండా స్వతంత్రంగా వ్యవహరించాడు. సొంత పార్టీ పెట్టిన తర్వాత నాలుగు ఎదుర్రాళ్ళు తగలడంతో జగన్ మళ్ళీ కేవీపీకి స్నేహహస్తం అందించాడని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో వున్న కేవీపీ జగన్‌తో తనకున్న అనుబంధాన్ని బాహాటంగా బయటపెట్టరు. ఈమధ్యకాలంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, జగన్‌కి మధ్య సయోధ్య కుదిర్చి జగన్‌కి బెయిల్ వచ్చేలా చేయడంలో కేవీపీ పాత్ర ఎంతో ఉందనేది బహిరంగ రహస్యం. కేవీపీ, జగన్ మధ్య మరింత బలపడుతున్న బంధానికి మరో నిదర్శనం తాజాగా వెలుగు చూసింది. రాబోయే ఎన్నికలలో నరసాపురం పార్లమెంట్ స్థానానికి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడికి ఆల్రెడీ రిజర్వ్ చేశారట. ఆ టిక్కెట్ కోసం ఎవరు ప్రయత్నించినా జగన్ నో వేకెన్సీ బోర్డు చూపించేస్తున్నాడట. అమ్మ దయ తనమీద ప్రసరించేలా చేసిన కేవీపీ మీద జగన్‌కి అంత అభిమానం ఉండటం న్యాయమే!

మోడీపై కాంగ్రెస్ నేతల విమర్శలు

  మొన్న ప్రధాని డా.మన్మోహన్ సింగ్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీల మధ్య అహ్మదాబాద్లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పై మొదలయిన చర్చకి కాంగ్రెస్ నేతలు కొసర్లు వేయడం మొదలుపెట్టారు. వరుస కుంభకోణాలతో, ఉగ్రవాదుల దాడుల వల్ల మసకబారిన తమ కాంగ్రెస్ ప్రతిష్టని కప్పిపుచ్చుకొంటూ, ప్రజలని పక్కదారి పట్టించే ప్రయత్నంలో మోడీపై దాడి మొదలుపెట్టారు.   "బీజేపీ వల్లభ్ భాయ్ పటేల్ వారసత్వం స్వంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ లౌకిక వాది అయిన పటేల్ అసలు సిసలు కాంగ్రెస్ వాది కూడా అని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. అసలు గాంధీ మహాత్ముడిని చంపిన ఆర్ఎస్ఎస్ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందని పటేలే ఆర్ఎస్ఎస్ ను నిషేదించారు. మరి మోడీ దీనికి ఏమని జావాబు చెబుతారని ఆయన ప్రశ్నించారు.   “అసలు మోడీ ఏవిధంగా తనను తాను వల్లభ్ భాయ్ వారసుడిగా ఆవిష్కరించుకోవాలని చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన వారసుడిగా మోడీ తనను తాను అవిష్కరించుకోవాలని ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు,” అని కేంద్ర మంత్రి మనీశ్‌తివారీ స్పష్టం చేశారు.   మోడీని విమర్శించడంలో ఎప్పుడు ముందుండే దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, “గతంలో వాళ్ళు (బీజేపీ) అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని సేకరించిన ఇటుకలను అమ్మేసుకొన్నారు కానీ ఐదేళ్ళు దేశాన్ని పాలించినా వాళ్ళు ఆలయం మాత్రం నిర్మించలేదు. ఇప్పుడు పటేల్ విగ్రహ స్థాపన కోసం ఇనుము సేకరిస్తున్నారుట! రేపు దానిని కూడా అమ్మేసుకొంటారేమో?” అని వ్యంగంగా ఎత్తిపొడిచారు.   ఒకవైపు మహానీయుల పేరుప్రతిష్టలను,వారి వారసత్వాన్ని స్వంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్న ఈ నేతలు వారి ఆలోచనలను, ఆశయాలను, వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని గానీ ఏమాత్రం ఆచరించలేక కనీసం అనుకరించలేక ఇలా చాలా లేకిగా వారి వారసత్వం కోసం వాదులాడుకొంటూ, ఆ మహానీయులతో తామెన్నడు సరితూగలేమని స్వయంగా వారే వారి మాటలతో, ప్రవర్తనతో చాటి చెప్పుకొంటున్నారు.

"బెంగాల్ విభజన'' గుర్తుంటే...?

  -డా.ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు] భారతదేశంలో తొలి పెద్ద భాషాప్రయుక్త రాష్ట్రంగా, అనేక త్యాగాల ఫలితంగా తెలుగుజాతి కన్నకలల పంటగా 1956లో అవతరించిన "ఆంధ్రప్రదేశ్'' (విశాలాంధ్ర) రాష్ట్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకు కుట్రలకు నేడు బలైపోతున్నారు; ఈ కుట్రలో భాగాస్వాములయిన సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాలలోని కాంగ్రెస్ నాయకులు, తమ కుటుంబ పాలనకోసం కొన్నేళ్ళుగా తహతహలాడుతూ సీమాంధ్రనుంచి తెలంగాణాకు వలసవచ్చి తెలుగు ప్రజలమంధ్య 'విభజన' చిచ్చు పెట్టడానికి ఉద్యమించిన రాజకీయ నిరుద్యోగి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో తెలంగాణా ప్రజల్ని దశాబ్దాలుగా పీడించుతూ వచ్చిన 'దొర'ల, ఇతర భూస్వామ్య, జాగిర్దారీ శక్తులూ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. ఇలాంటి 'విభజన' సిద్ధాంత కుట్రలకు నిదర్శనం కోసం విదేశాలలో వెతకనక్కరలేదు. భారతదేశ చరిత్రలో దేశీయ, పరదేశీయ శక్తులతో లాలూచీపడి భారత సామాన్యప్రజల, ప్రాంతాల మూల్గుల్ని పీల్చివేసి బలిసిన జాతి విద్రోహులు లేకపోలేదు. మనదేశాన్ని ఏలిన బ్రిటీష్ సామ్రాజ్యవాద పాలకులకు ఊడిగం చేసిన దేశీయుల్ని మనం మరవలేము. లార్డ్ క్లయివు, లార్డ్ కర్జన్ లు స్థానీయ విద్రోహులు లేకుండా బెంగాల్ ను 1905లో నిట్టనిలువునా, కోట్లాదిమంది బెంగాలీయులు వద్దు వద్దని మొత్తుకున్నా బ్రిటన్ స్వీయ ప్రయోజనాల కోసం చీల్చినవాడు లార్డ్ కర్జన్ అన్న సంగతి అదే బెంగాల్ అనుభవాలనుంచి పుట్టుకొచ్చిన నేటి మన గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరవలేరు! ఎప్పటికప్పుడు భావి భారతదేశ ప్రగతిని ముందుకు నెట్టే కార్యక్రమానికి ముందస్తు ఉద్దీపనశక్తిగా ఆలోచనా ధారను అందించిన బెంగాల్ గడ్డనుంచి వచ్చినవాడు మన ప్రణబ్ ముఖర్జీ ... లార్డ్ కర్జన్ ఎలాంటి కుట్రల ద్వారా బెంగాల్ ను విభజించాడో ఆయనకు తెలియంది కాదు! "ప్లాసీ'' యుద్ధంలో బెంగాల్ నవాబ్ ను బ్రిటిష్ వాళ్ళు మోసపూరితంగా ఎలా "విభజించి-పాలించే'' సిద్ధాంతం ఆయుధంగా వోడించారో, ఆ నవాబుకు అంతవరకూ సేవలందిస్తున్న సేనాపతి అయిన మీర్జాఫర్ ను ఎలా ప్రలోభపెట్టి నవాబును ఓడించింది వెన్నుపోటు పొడిచారో ప్రణబ్ కు తెలుసు. బెంగాల్ లో తమకు కీలుబొమ్మలుగా ఉండే దేశీయ విద్యోహులను బెంగాల్ పాలకులుగా వాళ్ళెలా నియమిస్తూ లబ్దిపొందారో, తద్వారా బెంగాల్ సంపదను ఎలా లూటీ చేస్తూ వచ్చిందీ ప్రణబ్ కు తెలుసు!   అలా భారతదేశంలో దోపిడీ ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యస్థాపనకు ఫ్లాసీ పరిణామం ఎలా తొలిమెట్టుగా తోడ్పడిందో కూడా ప్రణబ్ కు తెలుసు! బెంగాల్ గద్దెపైన బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి తప్పుడు ఒప్పందాల ద్వారా అమీర్ చంద్ ను, వారనే హేస్టింగ్స్ అవినీతిపైన తీవ్ర అభియోగాలు మోపిన రాజా నందకుమార్ ను ఎలా కొరతవేసిందీ ఆయనకు తెలుసు! బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి న్యాయంకోసం నిలిచినా సిరాఉజ్జిద్ దౌలాను ఎలా ఏడిపించిందీ తెలుసు! తమ అడుగులకు మడుగులొత్తిన నవక్రిష్ణనూ లంచాలతో కొన్నారు; అలా లొంగిపోయిన నలుగురు నవాబుల్ని, దేశీయ సంపన్నుల్ని అందలం ఎక్కించిన సంగతి ప్రణబ్ ముఖర్జీకి పూర్తిగా తెలుసు! దేశీయ విద్యోహుల సహకారంతో ఎదిగిన పాలకులు ఆనాటి బ్రిటిష్ వాళ్ళు కాగా, అదే "విభజించి-పాలించ''మనే సూత్రాన్ని వారినుంచి అప్పనంగా అందుకున్న కాంగ్రెస్ నాయకులు "బిడ్డపుట్టినా పురిటికంపు'' పోనట్టుగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినాగాని పదవులకోసం పెనుగులాటలో ఆ బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన కోసం సంతకాలు పెట్ట్టమన్న చోటల్లా పెట్టారు. ఆ "విభజన'' సూత్రాన్నే నేడు దేశంలో స్థిరపడిన రాష్ట్రాలను, ముఖ్యంగా జాతీయ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ఫలితంగా తానే పలు తీర్మానాల ద్వారా ఆశీర్వదించి ఏర్పరచిన భాషాప్రయుక్త రాష్ట్రాల్ని చీల్చడానికి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి వెనుకాడటం లేదు.   దేశ మాజీప్రధాని ఇందిరాగాంధి పాలనా రంగంలో కొన్ని తప్పులు చేసినా, భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను రాజకీయ నిరుద్యోగులైన 'గుప్పిడు' స్థానిక నాయకుల గొంతెమ్మ కోరికలను ఈడేర్చడానికి ఈరోజునా "విభజన'' మంత్రాన్ని చేపట్టలేదు; చివరికి తనపై కట్టికట్టిన సొంతపార్టీలోని "సిండికేట్''వర్గంలో కొందరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు చేరినప్పటికీ ఆ కక్షతో ఇందిర రాష్ట్రం సమైక్యతకు ఏనాడూ చిచ్చుపెట్టలేదు. సరిగ్గా ఇందుకు భిన్నంగా కోడలమ్మ సోనియా ఇటలీనుంచి దేశంలోకి ప్రవేశించిన దరిమిలా పుత్రప్రేమతో రాష్ట్రప్రజల మధ్య మిత్రబేధం పెట్టడానికి రాజకీయ నిరుద్యోగుల వేర్పాటు ఉద్యమాలను ఆశీర్వదించుతూ వచ్చింది; చివరికి మాజీప్రధాని ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ నాయకుల్లో ఒకరైన పి.వి.నరసింహారావు ఢిల్లీలొ దివంగతులైనప్పుడు ఆయని భౌతికకాయానికి ప్రభుత్వ గౌరవ లాంచనాలతో దహనసంస్కారాలు నిర్వహించేటట్లు చూడ్డంలో కూడా సోనియా స్వార్థపూరిత రాజకీయాన్నే ఆశ్రయించింది.   అలాగే స్వార్థం లేకపోతే, తెలంగాణా ప్రాంతంలో రాజకీయ పైరవీలతో అభాసుపాలైన ఓ స్థానిక రాజకీయ నిరుద్యోగిగా పదవులవేతలో మునిగితేలుతూ రాష్ట్ర 'విభజన' సూత్రం ద్వారా ప్రజలలో పాపులారిటీ కోసం పాకులాడుతూ ఉద్యమం నిర్మించుకున్న చంద్రశేఖరరావు అనే సీమాంధ్ర వలస 'దొర'తో ఢిల్లీలొ నెలరోజుల పాటు మంతనాలకు సోనియా ఏర్పాట్లు చేయడాన్ని తెలుగుజాతి ఎలా సహించగల్గుతుంది? తన నాయకత్వంలో సాగుతున్న కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిపాదనను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో, అన్ని పక్షాల ప్రజాప్రతినిధులందరినీ ఒక్కచోట సమావేశపరిచి లేదా విస్తృత స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని లేదా రిఫరెండం ఆధారంగా ప్రజల ఆకాక్షను తెలుసుకొనేందుకు ఆమె ప్రయత్నించాల్సింది. కాని ఆ పంధా విడిచిపెట్టి ఆకస్మికంగా రాష్ట్ర్ర విభజనకు సమ్మతిని అధిష్ఠానం వర్కింగ్ కమిటీ ప్రకటింపజేయడాన్ని ఆమెను ప్రజలు మరోలా ఎలా అర్థం చేసుకోగలరు? పచ్చి అబద్ధాలతో, విష ప్రచారంతో తెలుగుప్రజల మధ్య విద్వేషాలకు కారకులై యువకుల ఆత్మహత్యలకు దారిచూపిన గుప్పెడు నాయకులను రాజ్యాంగ నిబంధనల ప్రకారం కఠినంగా శిక్షించడానికి బదులు జాతి విచ్చిన్నకులతో మంతనాలు జరపడం హానికరమేకాదు, హాస్యాస్పదం కూడా.   ఇప్పుడు రాష్ట్రపతికి చేరిన రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ లేఖను రాష్ట్రపతి ప్రణబ్ చదువుకున్న వెంటనే అందలి తీవ్రతను గమనించి, ఒక రాజనీతిజ్ఞునిగా ఆ లేఖను సరాసరి "మన్నుతిన్న పింజేరులు''గా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి సహా క్యాబినెట్ నాయకులకు కాకుండా ఎకాయకిని కేంద్ర హోంశాఖ కార్యదర్శికే [మంత్రి షిండేకి కూడా కాకుండా] తక్షణ అభిప్రాయం కోసం పంపించారు. ఇది సవ్యమైన పద్ధతీ, మంచి సంప్రదాయం కూడా. ముఖ్యమంత్రి తనకు పంపిన లేఖ ఒక ఎత్తు కాగా, అంతకుముందు కొన్ని రోజుల క్రితమే ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదన గురించి, పరిణామాల గురించి ప్రస్తావిస్తూ విభజన ప్రతిపాదన గురించి సోనియాను హెచ్చరించినట్లు కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించడం గమనార్హం. అలాగే రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం, రాజ్యాంగ నిబద్ధతా ప్రక్రియ ప్రకారం ఏదైనా కాబినెట్ ప్రతిపాదననుగానీ, లేదా పార్లమెంటులో పెట్టాలని భావించిన బిల్లు ముసాయిదానుగానీ లోక సభను ఎన్నుకున్న ప్రజలే ఇటు రాష్ట్ర శాసనసభను కూడా ఎన్నుకుంటున్నందున భారత రాజ్యాంగానికి రెండు ముఖాలుగా ఉన్న యూనిటరీ, ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థల మధ్య సమన్యాయం పాటించాలి.   కేవలం "అభిప్రాయం'' కోసం మాత్రమే రాష్ట్ర లెజిస్లేచర్ కు పంపడం న్యాయ విరుద్ధం; సభ్యుల వోటింగ్ తీసుకోకుండా కేవలం అభిప్రాయాల సేకరణకు ఉండే వులువ ఎంత? రాష్ట్రాల శాసనసభలు ఫెడరల్ వ్యవస్థలో కేవలం వాడగొండులకు, కబుర్లరాయుళ్ళకు వేదికలుగా మాత్రమే ఉండాలా? ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు ముఖ్యంగా వాటి ఉనికినే విభజన సూత్రం ద్వారా ప్రశ్నించడానికి బ్రూట్ మెజారిటీతో కొన్నాళ్ళు, మైనారిటీలో కేంద్రప్రభుత్వం ఈదులాడుతున్నప్పటికీ మొండిగానో, స్వార్థ ప్రయోజనాల కోసం ముందుకు దూకడాన్ని రాష్ట్రపతి ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. అది తన రాజ్యాంగ నిబద్ధతకు, దాని నియమ సంప్రదాయాలకే పెద్ద సవాలుగా ఆయన భావించాలి; దేశంలో కనీసం అరడజను రాష్ట్రాలలో రాజకీయ నిరుద్యోగులవల్ల ప్రబలుతున్న వేర్పాటు ఉద్యమాలు [మహారాష్ట్రలొ విదర్భ, బెంగాల్ లొ గూర్ఖాలాండ్, అస్సాంలో బోడోలాండ్, కర్ణాటకలో కూర్గ్, తమిళనాడులో మదురై రాజధానిగా దక్షిణ తమిళనాడు రాష్ట్రంకోసం వగైరా వేర్పాటు ఉద్యమాలు] ఉండగా ఏకభాషా సంస్కృతులు ఆధారంగా తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన అఖండ తెలుగుజాతిని ఎందుకు సోనియా చీల్చదలచిందో ప్రణబ్ ఆలోచించాలి.   బెంగాల్ విభజన పాఠం పూర్వరంగంలో నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆలోచించి, కేంద్రానికి ఆచరణాత్మక సలహా యివ్వాలని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 'మొక్కట్లు' చెదరకుండా, తెలుగుజాతి సమైక్యతకు చెరుపురాకుండా చూడాలని సుమారు తొమ్మిది కోట్లమంది తెలుగువారూ బాధ్యతగల దేశ ప్రథమపౌరుడిని కోరుతున్నారు. తాను కూడా ఇప్పటికీ అన్ని ప్రధాన పదవుల్ని అనుభవించి, దేశ సర్వోన్నతస్థానాన్ని (ప్రెసిడెంట్ గా) కూడా అందుకోగల్గిన ప్రణబ్ ముఖర్జీ యింక చేరుకోవలసిన పరసీమలు లేవు కాబట్టి, పదవీ లాలస ఆయనకు ఉండదు; పదవీ విరమణానంతర పోస్టులపై ఆసక్తీ ఉండదు; కుటుంబ సభ్యులూ వివిధ వృత్తులలో కుదురుకుని పోయారు కాబట్టి, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపడమే మిగిలిన దినచర్య అవుతుంది. అందువల్ల బెంగాలీ సాహిత్య సంస్కృతుల ప్రభావంలో కూడా తెలుగుజాతి ఈదులాడుకుంది; రవీంద్రుడి "జనగణమన'' గీత రచనకు స్వరకల్పన జరిగిన స్వర్ణభూమి ఈ తెలుగునేల! శరత్ రచనలు తెలుగువాడి సాహిత్యంగానే చదువుకొని దశాబ్దాలుగా ప్రభావితమైన భూమి ఈ తెలుగునాడు, అదే మరోమాటలో ఈ తెలంగాణం! ఉత్పలదత్ కల్లోల్ నాటకానికీ ప్రభావితమయిన సంస్కృతి తెలుగువారిది; అలాంటి ఆదానప్రధానాల చరిత్ర ఆంధ్రుల-బెంగాలీల బంధమూ, అనుభంధమూ! బెంగాల్ విభజన సృష్టించిన కల్లోల వాతావరణం ఆంధ్రప్రదేశ్ లొ ఏర్పడకుండా తప్పించే, నిరోధించే విజ్ఞతను విన్నాణాన్ని ప్రణబ్ నుంచి యావత్తు తెలుగుజాతీ ఆశించడం దురాశ కాదని గౌరవ రాష్ట్రపతి గుర్తించగలరనే విశ్వసిస్తున్నాం!

బస్సు ప్రమాదం: రాష్ట్రానికి చెందిన మృతులు వీరే

      మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తపేట మండలంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు ఫరూఖ్ అలీ - నాచారం(హైదరాబాద్), అక్షయ్‌సింగ్ - ఆర్టీసీ క్రాస్‌రోడ్(హైదరాబాద్), సురేష్‌బాబు-శ్రీనగర్ కాలనీ(హైదరాబాద్), చంద్రశేఖర్- కేపీహెచ్‌బీ కాలనీ(హైదరాబాద్), టి.సురేష్- మచిలీపట్నం(కృష్ణా జిల్లా), అడారి రవి - నర్సీపట్నం(విశాఖ జిల్లా), వేదవతి - కామారెడ్డి మండలం దేవునిపల్లి ( నిజామాబాద్ జిల్లా), గాలి బాల సుందర్‌రాజు, గాలి మేరి, గాలి విజయకుమారి - నర్సారావుపేట(గుంటూరు జిల్లా).   మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బుధవారం ఉదయం ప్రైవేట్ వోల్వో బస్సు మంటల్లో కాలిపోయిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రమాదం సంభవించింది. మృతుల కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 110 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది

వోల్వో బస్సు అగ్ని ప్రమాదం: 40 మంది సజీవదహనం!

      ఈ రోజు ఉదయం తెల్లవారు జామున మహబూబ్‌నగర్ జిల్లా కొత్తపేట మండలం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. బెంగుళూరునుంచి హైదరాబాదు వస్తున్న ఒక వోల్వో బస్సు మహబూబ్‌నగర్‌ సమీపంలో బుధవారం తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో వంతెనను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరింగింది. ప్రమాద సమయంలో బస్సుల 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో తెలుసుకునే లోగానే..డిజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు దహనం అయినట్టు సమాచారం. మెలకువగా ఉన్న డ్రైవర్‌తో సహ ఆరుగురు ప్రమాదం నుంచి బయట పడినట్టు సమాచారం.   ఇది జబ్బార్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు. కొందరు వనపర్తి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవరు, క్లీనరు పోలీసులో అదుపులో ఉన్నట్లు సమాచారం. జబ్బార్‌ ట్రావెల్స్‌ సంస్థ ప్రతినిధులు వస్తే తప్ప అసలు బస్సులో ఉన్న ప్రయాణికులకు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడి కాకపోవచ్చునని తెలుస్తోంది. 

రాష్ట్ర విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే కారణమా

  కేంద్రమంత్రి పదవి కోసం కావూరి సాంబశివరావు అలకలు గురించి అందరికీ తెలిసిన విషయమే. మంత్రి ఇవ్వలేదనే కోపంతో ఆయన సమైక్యాంధ్ర కోసం అవసరమయితే పార్టీ పెట్టి మరీ పోరాటం మొదలు పెడతానని కాంగ్రెస్ హస్తాన్ని మెలితిప్పి మరీ కేంద్ర మంత్రి పదవి సంపాదించుకొన్నారు. కేంద్రమంత్రి పదవి రాగానే రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు కూడా. కానీ తాను సమైక్యవాదినేనని నేటికీ అయన చెప్పుకొంటూనే ఉంటారు.   తను కేంద్ర మంత్రి అయిననాటి నుండి తను ప్రతీ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర విభజన చేయవద్దని, దానివల్ల అనేక సమస్యలు వస్తాయని కేంద్రానికి హితవు చెపుతూనే ఉన్నానని, కానీ ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన కొందరు సీనియర్లు రాష్ట్ర విభజన చేయమని అధిష్టానాన్ని ప్రోత్సహించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. వారి కారణంగానే నేడు రాష్ట్రం విడిపోతోందని ఆయన ఆరోపించారు.   ఆయన తాజా ఆరోపణలతో రాష్ట్ర విభజనకు కొందరు స్వార్ధపరులయిన సీమాంద్ర కాంగ్రెస్ నేతలే ప్రధాన కారకులని అర్ధం అవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి డిల్లీ వరకు ఒక్కో నేత ఒక్కో కారణమెందుకు చెపుతున్నట్లు? రాష్ట్ర విభజన ప్రతిపక్షాలిచ్చిన లేఖలే కారణమంటూ ఎందుకు నిందిస్తున్నట్లు? ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రోత్సహించింది ఎవరు? ఈ సంగతి తెలిసి ఉండి కూడా ఇంతకాలం కావూరి ఎందుకు దాచిపెట్టినట్లు? ఇప్పుడే ఎందుకు బయటపెడుతున్నట్లు?   కాంగ్రెస్ నేతలకు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్రం ముఖ్యం కాదని కావూరి మాటలు నిర్దారిస్తున్నాయి. వారి రాజీనామాల డ్రామాలలాగే, వారి సమైక్యాంధ్ర డ్రామాలు కూడా సాగుతున్నాయి నేటికీ.

లేచింది విద్యార్థి లోకం!

      రాష్ట్ర విభజన కోసం కేంద్రం పడుతున్న తహతహని సీమాంధ్రలోని విద్యార్థిలోకం ఇంతకాలం శాంతియుతంగా గమనించింది. ఇప్పుడు పరిస్థితులు చెయ్యిదాటిపోయేలా వుండటంతో సీమాంధ్ర విద్యార్థిలోకి రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. సీమాంధ్ర జిల్లాల్లో వున్న విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీల నాయకులు మంగళవారం నాడు నాగార్జున యూనివర్సిటీలో సమావేశమయ్యారు.   సమావేశం ముగిసిన తర్వాత విద్యార్థులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, సీమాంధ్ర విద్యార్థులు నష్టపోకుండా చూడటం కోసం ఆత్మాహుతి దాడులకైనా సిద్ధమేనని విద్యార్థులు ప్రకటించడం విభజన విషయంలో సీమాంధ్ర విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనకు అద్దం పడుతోంది. సీమాంధ్రలో ఎవరి ఆందోళనలనూ పట్టించుకోకుండా రాష్ట్ర విభజనకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ సత్తా చూపించాలని సీమాంధ్ర విద్యార్థులు భావిస్తున్నారు. నవంబర్ 1 నుంచి తమ పోరును తీవ్రం చేయబోతున్నారు. రాష్ట్ర విభజన అగ్నికి ఆజ్యం పోసిన సీపీఐ, బీజేపీల మీద సీమాంధ్ర విద్యార్థులు మండిపడుతున్నారు. నవంబర్ 1న సీమాంధ్రలోని సీపీఐ, బీజేపీ కార్యాలయాలకు తాళాలు వేయాలని విద్యార్థులు నిర్ణయించారు. అయితే సీమాంధ్రలో సీపీఐ, బీజేపీ కార్యాలయాలకు తాళాలు వేసినా, వేయకపోయినా ఒక్కటే..  ఆ విషయం ఆ రెండు పార్టీలకి బాగా తెలుసు.

చిరుపై రాళ్ళ దాడి

      మాజీ మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవికి వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ మధ్య కురిసిన వర్షాలు, వరదల బారిన పడి తీవ్రంగా నష్టపోయిన సీమాంధ్ర వాసులను పరామర్శించడం ద్వారా అక్కడి ప్రజల మనసులలో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో శుభమా అని పరామర్శలు ప్రారంభించిన చిరంజీవికి ఆదిలోనే అపశకునం ఎదురైంది. పడవ ఎక్కబోయిన చిరంజీవి నీళ్ళలో జారిపడిపోయారు. తాజాగా, ఈ రోజు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళిన చిరంజీవిని సమైక్య నినాదాలు చేస్తూ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చిరంజీవిపైకి రాళ్ళు విసిరారు. అదృష్టవశాత్తూ చిరంజీవికి రాళ్ళు తగల్లేదు. భద్రతా సిబ్బంది సమైక్యవాదుల్ని నిలువరించారు. అనంతరం చిరంజీవిని జాగ్రత్తగా అక్కడినుంచి తరలించారు. చిరంజీవి లాంటి స్టార్ ఇమేజ్ వున్న వ్యక్తికి ఇలాంటి అనుభవాలు చాలా ఇబ్బందికరంగా వుంటాయి.