ఈ సామాజిక తెలంగాణా వాదనల అంతర్యమేమిటి
posted on Oct 30, 2013 @ 4:00PM
ఒకవైపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతోందనే సంతోషం ఉన్నపటికీ, కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎలా అవ్వగలమనే ప్రశ్నటీ-కాంగ్రెస్ నేతలందరి మనసులని పురుగులా ఒకటే దొలిచేస్తోంది. ఇంతకాలం రెడ్డి, కమ్మ కులస్థుల చేతిలోనే ఉండిపోయిన అధికారాన్ని, కనీసం ఇప్పుడయినా వారి చేతిలో నుండి గుంజుకోకపోతే ఇక ఎప్పటికీ సాధారణ మంత్రులుగానే మిగిలిపోవలసి వస్తుందనే భయం కొందరిని పీడిస్తుంటే, రాష్ట్రం విడిపోయిన తరువాత తమ బలం గణనీయంగా తగ్గిపోవడంతో, సదరు కులాలకి చెందిన నేతలు ఇప్పుడు ఈ ‘సామాజిక తెలంగాణా వాదులను’ అందరినీ తట్టుకొని మళ్ళీ అధికారం ఏవిధంగా చేబట్టాలాఅని మధనపడుతున్నారు.
మొన్న మెహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో జరిగిన టీ-కాంగ్రెస్ నేతల జైత్రయాత్రలో ఓం ప్రధమంగా సోనియా రాహుల్ భజన కార్యక్రమం పూర్తయిన తరువాత, ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత, ఆత్మగౌరవం, ఆర్థిక సమానత్వం లాంటి ప్రత్యేకతలు ఉన్న తెలంగాణ రాష్ట్రం రావాలని తాము కోరుకొంటున్నామని అన్నారు.
అంటే దానర్ధం ప్రజలకి అవన్నీ దక్కాలని కాదు. ఈ కొలమానాలు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న తనవంటి వారిపట్ల అమలుచేయాలని ఆయన ఉద్దేశ్యం. అనేక ఏళ్లుగా అనేక మంది ప్రజల పోరాటాల వలన, బలిదానాల వలన తెలంగాణా ఏర్పడుతోందని చెపుతున్న ఆయన ముందుగా తనకు అధికారం రావాలనే బలమయిన కోరికతోనే ఈ సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత వంటి మాటలు ప్రతీ వేదికపై పదేపదే వినిపిస్తుంటారు. ఆయన వాదనను సమర్దించేవారు కూడా మొదట తమకే ముఖ్యమంత్రి పదవి రావాలని కోరుకొంటున్నారు గనుక, ఒకవేళ వారిలో ఎవరికీ దక్కినా మిగిలినవారి ఆత్మగౌరవం దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నమాట.
టీ-కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవికోసం ఈ కులసమీకరణాల లెక్కలు ఎలా ఉన్నపటికీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్ట మొదట తామే అధికారం చేపడతామని తెరాస నేతలు కారు మీద ఒట్టేసి మరీ చెపుతున్నారు. అదే జరిగితే టీ-కాంగ్రెస్ నేతల రూల్ నెంబర్.1,2,3 అంటే 1.సామాజిక తెలంగాణ, 2.రాజకీయ సాధికారికత, 3.ఆత్మగౌరవం మూడు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రి ఒక దళితుడే అవుతాడని ఎంత భరోసాలు ఇస్తున్నపటికీ, మిగిలిన వారు అందరూ ఆయన కుటుంబానికి చెందిన వెలమ దొరలే అయ్యి ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే వెలమదొరల చేతిలో దళిత ముఖ్యమంత్రి ఉంటారన్న మాట. అందువల్ల అప్పుడు సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత, ఆత్మగౌరవం దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంటుంది.
ఒకవేళ తెరాస కాంగ్రెస్ హస్తం అందుకొంటే ఆ ప్రమాదం రెట్టింపవుతుంది. కేసీఆర్ తన తెరాసను తీసుకువచ్చి ఏకంగా కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తే ఆ ప్రమాదం మూడింతలయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానానికి కావలసింది ‘సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత, ఆత్మగౌరవం’ కాదు. కేంద్రంలో అధికారం చెప్పటేందుకు అవసరమయిన 15 యంపీ సీట్లు మాత్రమే. అది టీ-కాంగ్రెస్ నేతలివ్వలేరని కాంగ్రెస్ అధిష్టానం గనుక గట్టిగా నమ్మినట్లయితే అప్పుడు వారిని కూడా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను పక్కన బెట్టినట్లే పక్కన పడేసి, కేసీఆర్ హ్యాండ్ పట్టుకోవచ్చును.
అందువల్ల ప్రస్తుతం వారు తమ భజన కార్యక్రమం కంటిన్యూ చేసుకొంటూనే, కావాలనుకొంటే రూల్ నెంబర్.1,2,3ల గురించి ఎంతయినా గట్టిగా మాట్లడుకోవచ్చును. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పారు కూడా. కానీ, అవేవి కాంగ్రెస్ అధిష్టానానికి అర్ధం అయ్యే పదాలు కాదు గనుక తనకు బాగా అర్ధం అయ్యే యంపీ సీట్లకే ప్రాధాన్యం ఇచ్చి అందుకు తగినవారికే ‘కుర్చీ’ అప్పగించవచ్చును. అందులో కూర్చోవడానికి ఈ మూడు రూల్స్ పరిగణనలోకి తీసుకోబడకపోవచ్చును.