లేచింది విద్యార్థి లోకం!
posted on Oct 29, 2013 @ 5:15PM
రాష్ట్ర విభజన కోసం కేంద్రం పడుతున్న తహతహని సీమాంధ్రలోని విద్యార్థిలోకం ఇంతకాలం శాంతియుతంగా గమనించింది. ఇప్పుడు పరిస్థితులు చెయ్యిదాటిపోయేలా వుండటంతో సీమాంధ్ర విద్యార్థిలోకి రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. సీమాంధ్ర జిల్లాల్లో వున్న విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీల నాయకులు మంగళవారం నాడు నాగార్జున యూనివర్సిటీలో సమావేశమయ్యారు.
సమావేశం ముగిసిన తర్వాత విద్యార్థులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, సీమాంధ్ర విద్యార్థులు నష్టపోకుండా చూడటం కోసం ఆత్మాహుతి దాడులకైనా సిద్ధమేనని విద్యార్థులు ప్రకటించడం విభజన విషయంలో సీమాంధ్ర విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనకు అద్దం పడుతోంది. సీమాంధ్రలో ఎవరి ఆందోళనలనూ పట్టించుకోకుండా రాష్ట్ర విభజనకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ సత్తా చూపించాలని సీమాంధ్ర విద్యార్థులు భావిస్తున్నారు.
నవంబర్ 1 నుంచి తమ పోరును తీవ్రం చేయబోతున్నారు. రాష్ట్ర విభజన అగ్నికి ఆజ్యం పోసిన సీపీఐ, బీజేపీల మీద సీమాంధ్ర విద్యార్థులు మండిపడుతున్నారు. నవంబర్ 1న సీమాంధ్రలోని సీపీఐ, బీజేపీ కార్యాలయాలకు తాళాలు వేయాలని విద్యార్థులు నిర్ణయించారు. అయితే సీమాంధ్రలో సీపీఐ, బీజేపీ కార్యాలయాలకు తాళాలు వేసినా, వేయకపోయినా ఒక్కటే.. ఆ విషయం ఆ రెండు పార్టీలకి బాగా తెలుసు.