పిల్లికి ఎలుక సాక్ష్యం!
posted on Oct 30, 2013 @ 2:43PM
సమైక్యాంధ్ర ఉద్యమకారుల ధాటికి నిన్న మొన్నటి వరకు సైలెంటైపోయిన పీసీసీ చీఫ్ బొత్స ఇప్పడు మళ్ళీ తనమార్కు రాజకీయాలు చేస్తూ మళ్ళీ రంగంలోకి దిగాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జేసీ దివాకరరెడ్డితో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చకపోతే పార్టీ వదిలి వెళ్ళిపో అని నిర్మొహమాటంగా చెప్పేశాడట.
జేసీ లాంటి నేతని పార్టీ వదిలి వెళ్ళిపో అనేంత సీన్ బొత్సకి లేదని జేసీ అభిమానులు బొత్సమీద మండిపడుతున్నాడు. బొత్స తన ప్రతాపం సీమాంధ్ర ప్రజల మీద, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల మీదే చూపిస్తున్నాడని, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద బొత్సకి ఎక్కడలేని ప్రేమ అని అంటున్నారు.
ప్రస్తుతం తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న విభజన సమస్యకి బొత్స కూడా కారకుడని విమర్శిస్తున్నారు. ఈ ఇష్యూ ఇలా వుంటే, అధిష్ఠానం దృష్టిలో ముఖ్యమంత్రి కిరణ్ ఇమేజ్ దెబ్బ తినేలా చేసి ఆ స్థానంలోకి తాను వచ్చేయాలని బొత్స కలలు కన్నాడు. దానికోసం తన వంతు ప్రయత్నాలు చేశాడు.
ఇప్పుడు కొత్తగా ఏ ప్లాను వేశాడోగానీ సీఎంకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల వరకూ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడట. కిరణ్ పక్కా సమైక్యవాదట, కిరణ్ కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ విడిచిపెట్టడట. కిరణ్ సొంత పార్టీ పెట్టడట. జేసీ దివాకరరెడ్డిని పార్టీలోంచి వెళ్ళపొమ్మనడానికి, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వదిలి పోడని చెప్పడానికి మధ్యలో బొత్స ఎవరంట? కిరణ్ కుమార్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టడని బొత్స సర్టిఫికెట్ ఇవ్వడం పిల్లికి ఎలుక సాక్ష్యం చెప్పినట్టుందని విమర్శకులు అంటున్నారు.