అఖిలపక్ష౦ టార్గెట్ టిడిపి..!!
posted on Oct 31, 2013 @ 1:52PM
రాజకీయ ప్రయోజానాల కోసం రాష్ట్రాన్నివిభజించే ప్రయత్నం చేసి అడ్డంగా ఇరుక్కుపోయిన కాంగ్రెస్ పార్టీ తనతోపాటు రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థి ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగమే రాష్ట్ర విభజన అంశంలో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అసలు ఈ సమావేశానికి ఏ పార్టీ అయినా హాజరై ఒక్క అంశానికి సమాధానం ఇచ్చినా ఆ పార్టీ రాష్ట్ర విభజనకు అంగీకరించినట్టే అవుతుంది. సీమాంధ్ర ప్రాంతంలో బలంగా వున్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ఈ అఖిలపక్షాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా చేసుకుందని అంటున్నారు.
ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర విభజన జరిగిపోతున్నా చంద్రబాబు ఇప్పటికీ తన రెండు కళ్ళ సిద్దాంతంతో ఎలాగో రోజులు దొర్లించేస్తుంటే..తన దత్త పుత్రుడు మాత్రం పూర్తిగా సమైక్యఫలం పొందలేక బాధపడుతున్నారు. కాబట్టి టిడిపి ఎలాగు సమన్యాయం కోరుతోంది గనుక రాష్ట్ర విభజనకు అవసరమయిన మార్గదర్శకాల పేరిట ఆ మాటేదో తెదేపా నోటనే చెప్పించేస్తే, సమైక్యాంద్రాకి ఆ పార్టీ వ్యతిరేఖమనే ట్యాగ్ తగిలించేసి, వైకాపా సీమాంద్రాలో దూసుకుపోవడానికి మార్గం సుగమం చేసేయవచ్చును.
తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఈసారి కూడా స్పష్టమయిన వైఖరి చెప్పకపోవచ్చును. తద్వారా తెలంగాణాలో కూడా తేదేపాకు చీటీ చింపేయవచ్చనే ఆశో అత్యాశో ఈ అఖిలపక్షం ఐడియాలో దాగి ఉండి ఉండవచ్చును.