కిరణ్ మాటల ఆంతర్యం ఇదేనా..!
posted on Oct 31, 2013 @ 11:43AM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య బాణి వినిపించారు. విశాఖపట్నంలో జరిగిన ఇందిరాగాంధీ 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రం ఇప్పటికీ సమైక్యంగా ఉందంటే ఆ ఘనత ఇందిరాగాంధీదేనని చెప్పారు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ, 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమాల తర్వాత రాష్ట్రం కలసి వుండాలని చెప్పి, ఆ మాటమీద నిలబడి వున్న గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు.
తాను సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుకుంటూ ఇప్పటి వరకూ చెప్పిన మాటలన్నీ తన సొంత మాటలు కాదని.. ఇందిరాగాంధీ చెప్పినమాటలనే చెప్పానని అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజున మరోసారి సమైక్యవాణిని వినిపించడం పరోక్షంగా మరోసారి సోనియాగాంధీకి సమైక్య సందేశం పంపడమేనని సీఎం సన్నిహితులు అంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా అయినా పునస్సమీక్షించుకోవాలని ఆయన పరోక్షంగా సోనియాగాంధీకి సూచిస్తున్నారని అంటున్నారు.