"బెంగాల్ విభజన'' గుర్తుంటే...?
posted on Oct 30, 2013 @ 12:05PM
-డా.ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]
భారతదేశంలో తొలి పెద్ద భాషాప్రయుక్త రాష్ట్రంగా, అనేక త్యాగాల ఫలితంగా తెలుగుజాతి కన్నకలల పంటగా 1956లో అవతరించిన "ఆంధ్రప్రదేశ్'' (విశాలాంధ్ర) రాష్ట్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకు కుట్రలకు నేడు బలైపోతున్నారు; ఈ కుట్రలో భాగాస్వాములయిన సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాలలోని కాంగ్రెస్ నాయకులు, తమ కుటుంబ పాలనకోసం కొన్నేళ్ళుగా తహతహలాడుతూ సీమాంధ్రనుంచి తెలంగాణాకు వలసవచ్చి తెలుగు ప్రజలమంధ్య 'విభజన' చిచ్చు పెట్టడానికి ఉద్యమించిన రాజకీయ నిరుద్యోగి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో తెలంగాణా ప్రజల్ని దశాబ్దాలుగా పీడించుతూ వచ్చిన 'దొర'ల, ఇతర భూస్వామ్య, జాగిర్దారీ శక్తులూ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. ఇలాంటి 'విభజన' సిద్ధాంత కుట్రలకు నిదర్శనం కోసం విదేశాలలో వెతకనక్కరలేదు. భారతదేశ చరిత్రలో దేశీయ, పరదేశీయ శక్తులతో లాలూచీపడి భారత సామాన్యప్రజల, ప్రాంతాల మూల్గుల్ని పీల్చివేసి బలిసిన జాతి విద్రోహులు లేకపోలేదు. మనదేశాన్ని ఏలిన బ్రిటీష్ సామ్రాజ్యవాద పాలకులకు ఊడిగం చేసిన దేశీయుల్ని మనం మరవలేము.
లార్డ్ క్లయివు, లార్డ్ కర్జన్ లు స్థానీయ విద్రోహులు లేకుండా బెంగాల్ ను 1905లో నిట్టనిలువునా, కోట్లాదిమంది బెంగాలీయులు వద్దు వద్దని మొత్తుకున్నా బ్రిటన్ స్వీయ ప్రయోజనాల కోసం చీల్చినవాడు లార్డ్ కర్జన్ అన్న సంగతి అదే బెంగాల్ అనుభవాలనుంచి పుట్టుకొచ్చిన నేటి మన గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరవలేరు! ఎప్పటికప్పుడు భావి భారతదేశ ప్రగతిని ముందుకు నెట్టే కార్యక్రమానికి ముందస్తు ఉద్దీపనశక్తిగా ఆలోచనా ధారను అందించిన బెంగాల్ గడ్డనుంచి వచ్చినవాడు మన ప్రణబ్ ముఖర్జీ ... లార్డ్ కర్జన్ ఎలాంటి కుట్రల ద్వారా బెంగాల్ ను విభజించాడో ఆయనకు తెలియంది కాదు! "ప్లాసీ'' యుద్ధంలో బెంగాల్ నవాబ్ ను బ్రిటిష్ వాళ్ళు మోసపూరితంగా ఎలా "విభజించి-పాలించే'' సిద్ధాంతం ఆయుధంగా వోడించారో, ఆ నవాబుకు అంతవరకూ సేవలందిస్తున్న సేనాపతి అయిన మీర్జాఫర్ ను ఎలా ప్రలోభపెట్టి నవాబును ఓడించింది వెన్నుపోటు పొడిచారో ప్రణబ్ కు తెలుసు. బెంగాల్ లో తమకు కీలుబొమ్మలుగా ఉండే దేశీయ విద్యోహులను బెంగాల్ పాలకులుగా వాళ్ళెలా నియమిస్తూ లబ్దిపొందారో, తద్వారా బెంగాల్ సంపదను ఎలా లూటీ చేస్తూ వచ్చిందీ ప్రణబ్ కు తెలుసు!
అలా భారతదేశంలో దోపిడీ ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యస్థాపనకు ఫ్లాసీ పరిణామం ఎలా తొలిమెట్టుగా తోడ్పడిందో కూడా ప్రణబ్ కు తెలుసు! బెంగాల్ గద్దెపైన బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి తప్పుడు ఒప్పందాల ద్వారా అమీర్ చంద్ ను, వారనే హేస్టింగ్స్ అవినీతిపైన తీవ్ర అభియోగాలు మోపిన రాజా నందకుమార్ ను ఎలా కొరతవేసిందీ ఆయనకు తెలుసు! బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి న్యాయంకోసం నిలిచినా సిరాఉజ్జిద్ దౌలాను ఎలా ఏడిపించిందీ తెలుసు! తమ అడుగులకు మడుగులొత్తిన నవక్రిష్ణనూ లంచాలతో కొన్నారు; అలా లొంగిపోయిన నలుగురు నవాబుల్ని, దేశీయ సంపన్నుల్ని అందలం ఎక్కించిన సంగతి ప్రణబ్ ముఖర్జీకి పూర్తిగా తెలుసు! దేశీయ విద్యోహుల సహకారంతో ఎదిగిన పాలకులు ఆనాటి బ్రిటిష్ వాళ్ళు కాగా, అదే "విభజించి-పాలించ''మనే సూత్రాన్ని వారినుంచి అప్పనంగా అందుకున్న కాంగ్రెస్ నాయకులు "బిడ్డపుట్టినా పురిటికంపు'' పోనట్టుగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినాగాని పదవులకోసం పెనుగులాటలో ఆ బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన కోసం సంతకాలు పెట్ట్టమన్న చోటల్లా పెట్టారు. ఆ "విభజన'' సూత్రాన్నే నేడు దేశంలో స్థిరపడిన రాష్ట్రాలను, ముఖ్యంగా జాతీయ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ఫలితంగా తానే పలు తీర్మానాల ద్వారా ఆశీర్వదించి ఏర్పరచిన భాషాప్రయుక్త రాష్ట్రాల్ని చీల్చడానికి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి వెనుకాడటం లేదు.
దేశ మాజీప్రధాని ఇందిరాగాంధి పాలనా రంగంలో కొన్ని తప్పులు చేసినా, భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను రాజకీయ నిరుద్యోగులైన 'గుప్పిడు' స్థానిక నాయకుల గొంతెమ్మ కోరికలను ఈడేర్చడానికి ఈరోజునా "విభజన'' మంత్రాన్ని చేపట్టలేదు; చివరికి తనపై కట్టికట్టిన సొంతపార్టీలోని "సిండికేట్''వర్గంలో కొందరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు చేరినప్పటికీ ఆ కక్షతో ఇందిర రాష్ట్రం సమైక్యతకు ఏనాడూ చిచ్చుపెట్టలేదు. సరిగ్గా ఇందుకు భిన్నంగా కోడలమ్మ సోనియా ఇటలీనుంచి దేశంలోకి ప్రవేశించిన దరిమిలా పుత్రప్రేమతో రాష్ట్రప్రజల మధ్య మిత్రబేధం పెట్టడానికి రాజకీయ నిరుద్యోగుల వేర్పాటు ఉద్యమాలను ఆశీర్వదించుతూ వచ్చింది; చివరికి మాజీప్రధాని ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ నాయకుల్లో ఒకరైన పి.వి.నరసింహారావు ఢిల్లీలొ దివంగతులైనప్పుడు ఆయని భౌతికకాయానికి ప్రభుత్వ గౌరవ లాంచనాలతో దహనసంస్కారాలు నిర్వహించేటట్లు చూడ్డంలో కూడా సోనియా స్వార్థపూరిత రాజకీయాన్నే ఆశ్రయించింది.
అలాగే స్వార్థం లేకపోతే, తెలంగాణా ప్రాంతంలో రాజకీయ పైరవీలతో అభాసుపాలైన ఓ స్థానిక రాజకీయ నిరుద్యోగిగా పదవులవేతలో మునిగితేలుతూ రాష్ట్ర 'విభజన' సూత్రం ద్వారా ప్రజలలో పాపులారిటీ కోసం పాకులాడుతూ ఉద్యమం నిర్మించుకున్న చంద్రశేఖరరావు అనే సీమాంధ్ర వలస 'దొర'తో ఢిల్లీలొ నెలరోజుల పాటు మంతనాలకు సోనియా ఏర్పాట్లు చేయడాన్ని తెలుగుజాతి ఎలా సహించగల్గుతుంది? తన నాయకత్వంలో సాగుతున్న కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిపాదనను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో, అన్ని పక్షాల ప్రజాప్రతినిధులందరినీ ఒక్కచోట సమావేశపరిచి లేదా విస్తృత స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని లేదా రిఫరెండం ఆధారంగా ప్రజల ఆకాక్షను తెలుసుకొనేందుకు ఆమె ప్రయత్నించాల్సింది. కాని ఆ పంధా విడిచిపెట్టి ఆకస్మికంగా రాష్ట్ర్ర విభజనకు సమ్మతిని అధిష్ఠానం వర్కింగ్ కమిటీ ప్రకటింపజేయడాన్ని ఆమెను ప్రజలు మరోలా ఎలా అర్థం చేసుకోగలరు? పచ్చి అబద్ధాలతో, విష ప్రచారంతో తెలుగుప్రజల మధ్య విద్వేషాలకు కారకులై యువకుల ఆత్మహత్యలకు దారిచూపిన గుప్పెడు నాయకులను రాజ్యాంగ నిబంధనల ప్రకారం కఠినంగా శిక్షించడానికి బదులు జాతి విచ్చిన్నకులతో మంతనాలు జరపడం హానికరమేకాదు, హాస్యాస్పదం కూడా.
ఇప్పుడు రాష్ట్రపతికి చేరిన రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ లేఖను రాష్ట్రపతి ప్రణబ్ చదువుకున్న వెంటనే అందలి తీవ్రతను గమనించి, ఒక రాజనీతిజ్ఞునిగా ఆ లేఖను సరాసరి "మన్నుతిన్న పింజేరులు''గా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి సహా క్యాబినెట్ నాయకులకు కాకుండా ఎకాయకిని కేంద్ర హోంశాఖ కార్యదర్శికే [మంత్రి షిండేకి కూడా కాకుండా] తక్షణ అభిప్రాయం కోసం పంపించారు. ఇది సవ్యమైన పద్ధతీ, మంచి సంప్రదాయం కూడా. ముఖ్యమంత్రి తనకు పంపిన లేఖ ఒక ఎత్తు కాగా, అంతకుముందు కొన్ని రోజుల క్రితమే ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదన గురించి, పరిణామాల గురించి ప్రస్తావిస్తూ విభజన ప్రతిపాదన గురించి సోనియాను హెచ్చరించినట్లు కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించడం గమనార్హం. అలాగే రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం, రాజ్యాంగ నిబద్ధతా ప్రక్రియ ప్రకారం ఏదైనా కాబినెట్ ప్రతిపాదననుగానీ, లేదా పార్లమెంటులో పెట్టాలని భావించిన బిల్లు ముసాయిదానుగానీ లోక సభను ఎన్నుకున్న ప్రజలే ఇటు రాష్ట్ర శాసనసభను కూడా ఎన్నుకుంటున్నందున భారత రాజ్యాంగానికి రెండు ముఖాలుగా ఉన్న యూనిటరీ, ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థల మధ్య సమన్యాయం పాటించాలి.
కేవలం "అభిప్రాయం'' కోసం మాత్రమే రాష్ట్ర లెజిస్లేచర్ కు పంపడం న్యాయ విరుద్ధం; సభ్యుల వోటింగ్ తీసుకోకుండా కేవలం అభిప్రాయాల సేకరణకు ఉండే వులువ ఎంత? రాష్ట్రాల శాసనసభలు ఫెడరల్ వ్యవస్థలో కేవలం వాడగొండులకు, కబుర్లరాయుళ్ళకు వేదికలుగా మాత్రమే ఉండాలా? ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు ముఖ్యంగా వాటి ఉనికినే విభజన సూత్రం ద్వారా ప్రశ్నించడానికి బ్రూట్ మెజారిటీతో కొన్నాళ్ళు, మైనారిటీలో కేంద్రప్రభుత్వం ఈదులాడుతున్నప్పటికీ మొండిగానో, స్వార్థ ప్రయోజనాల కోసం ముందుకు దూకడాన్ని రాష్ట్రపతి ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. అది తన రాజ్యాంగ నిబద్ధతకు, దాని నియమ సంప్రదాయాలకే పెద్ద సవాలుగా ఆయన భావించాలి; దేశంలో కనీసం అరడజను రాష్ట్రాలలో రాజకీయ నిరుద్యోగులవల్ల ప్రబలుతున్న వేర్పాటు ఉద్యమాలు [మహారాష్ట్రలొ విదర్భ, బెంగాల్ లొ గూర్ఖాలాండ్, అస్సాంలో బోడోలాండ్, కర్ణాటకలో కూర్గ్, తమిళనాడులో మదురై రాజధానిగా దక్షిణ తమిళనాడు రాష్ట్రంకోసం వగైరా వేర్పాటు ఉద్యమాలు] ఉండగా ఏకభాషా సంస్కృతులు ఆధారంగా తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన అఖండ తెలుగుజాతిని ఎందుకు సోనియా చీల్చదలచిందో ప్రణబ్ ఆలోచించాలి.
బెంగాల్ విభజన పాఠం పూర్వరంగంలో నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆలోచించి, కేంద్రానికి ఆచరణాత్మక సలహా యివ్వాలని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 'మొక్కట్లు' చెదరకుండా, తెలుగుజాతి సమైక్యతకు చెరుపురాకుండా చూడాలని సుమారు తొమ్మిది కోట్లమంది తెలుగువారూ బాధ్యతగల దేశ ప్రథమపౌరుడిని కోరుతున్నారు. తాను కూడా ఇప్పటికీ అన్ని ప్రధాన పదవుల్ని అనుభవించి, దేశ సర్వోన్నతస్థానాన్ని (ప్రెసిడెంట్ గా) కూడా అందుకోగల్గిన ప్రణబ్ ముఖర్జీ యింక చేరుకోవలసిన పరసీమలు లేవు కాబట్టి, పదవీ లాలస ఆయనకు ఉండదు; పదవీ విరమణానంతర పోస్టులపై ఆసక్తీ ఉండదు; కుటుంబ సభ్యులూ వివిధ వృత్తులలో కుదురుకుని పోయారు కాబట్టి, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపడమే మిగిలిన దినచర్య అవుతుంది. అందువల్ల బెంగాలీ సాహిత్య సంస్కృతుల ప్రభావంలో కూడా తెలుగుజాతి ఈదులాడుకుంది; రవీంద్రుడి "జనగణమన'' గీత రచనకు స్వరకల్పన జరిగిన స్వర్ణభూమి ఈ తెలుగునేల! శరత్ రచనలు తెలుగువాడి సాహిత్యంగానే చదువుకొని దశాబ్దాలుగా ప్రభావితమైన భూమి ఈ తెలుగునాడు, అదే మరోమాటలో ఈ తెలంగాణం! ఉత్పలదత్ కల్లోల్ నాటకానికీ ప్రభావితమయిన సంస్కృతి తెలుగువారిది; అలాంటి ఆదానప్రధానాల చరిత్ర ఆంధ్రుల-బెంగాలీల బంధమూ, అనుభంధమూ! బెంగాల్ విభజన సృష్టించిన కల్లోల వాతావరణం ఆంధ్రప్రదేశ్ లొ ఏర్పడకుండా తప్పించే, నిరోధించే విజ్ఞతను విన్నాణాన్ని ప్రణబ్ నుంచి యావత్తు తెలుగుజాతీ ఆశించడం దురాశ కాదని గౌరవ రాష్ట్రపతి గుర్తించగలరనే విశ్వసిస్తున్నాం!