నవంబర్ 9న తెలంగాణా ముసాయిదా అసెంబ్లీకి

 

సీమాంద్రాలో ఊహించిన దాని కంటే త్వరగానే పరిస్థితులు చక్కబడటంతో కాంగ్రెస్ అధిష్టానం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలని రాష్ట్ర విభజనపై జోరు పెంచి దూసుకు వెళ్తోంది. ఈ రోజు ప్రధాని డా.మన్మోహన్ సింగ్ నివాసంలో తెలంగాణా ఏర్పాటు ప్రక్రియపై చర్చిచేందుకు కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఇందులో ప్రధాని డా.మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, అహ్మద్ పటేల్, చిదంబరం పాల్గొనట్లు తెలుస్తోంది.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖల నేపధ్యంలో రాష్ట్ర శాసనసభకు తెలంగాణా బిల్లు పంపితే ఎదురయ్యే పరిణామాలు,వాటికి నివారణోపాయాలు, బిల్లు పంపేందుకు ముహూర్తం గురించి చర్చిoచినట్లు సమాచారం. ఆ సమాచారం ప్రకారం వచ్చే నెల 9న ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హోం మంత్రి షిండే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి మాట్లాడి వచ్చారు. బహుశః ఆయనకి తాము పెట్టిన ముహూర్తం గురించి తెలియజేసి ఉండవచ్చును.

 

ఇక మరో వైపు హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం కూడా హైదరాబాదులో తనపని చకచకా పూర్తి చేస్తోంది. రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్, తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో శాంతి భద్రతల పరిస్థితిని ఈ బృందం అధ్యయనం చేయడంతో బాటు, రాష్ట్ర హోం శాఖకు ఉన్న ఆస్తులు, అప్పులను రెండు రాష్ట్రాలకు ఏవిధంగా పంచాలనే అంశంపై వారు చర్చిస్తున్నారు. వీరు వచ్చేనెల 5లోగా తమ నివేదికను హోం శాఖకు అందజేయవలసి ఉంటుంది.

 

వచ్చే రాష్ట్ర విభజన వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్రమంత్రుల బృందం నెల 7న ఆఖరి సమావేశం నిర్వహించి, తన నివేదికను మంత్రి మండలికి సమర్పిస్తుంది. అప్పుడు క్యాబినెట్ దానిపై ఒక ముసాయిదా లేదా తీర్మానం తయారుచేసి రాష్ట్రపతికి పంపితే, దానిని ఆయన రాష్ట్ర శాసనసభకు పంపుతారు. అది మళ్ళీ తనకు చేరగానే దానిని ఆయన క్యాబినెట్ కు పంపుతారు. అప్పుడు క్యాబినెట్ తెలంగాణాపై తుది బిల్లు తయారు చేసి పార్లమెంటులో ఆమోదం కోసం ప్రవేశపెడుతుంది.

 

ఈ ప్రకారం చూస్తే తెలంగాణా ముసాయిదా లేదా వేరొకటి ముందు ఊహించినట్లు నవంబర్ నెలాఖరుకి కాక 9వ తేదీనే పంపే అవకాశం ఉందని అనుకోవచ్చును. ఏ కారణంగానయినా మరో రెండు మూడు రోజులు ఆలస్యమయితే అవవచ్చును. అదే నిజమయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రచ్చబండను పక్కనబెట్టి క్లైమాక్స్ సీన్ కోసం సిద్దం కాక తప్పదు.