ఇంకా తేలని కాంగ్రెస్ ప్రతినిధులు !

        తెలంగాణాఫై ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశానికి ఇంకా సరిగ్గా ఒక్క రోజు మాత్రమే ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ నుండి హాజరయ్యే ప్రతినిధుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. బిజెపి, టిఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం లు ఇప్పటికే తమ ప్రతినిధుల పేర్లను ఖరారు చేసాయి.   కాంగ్రెస్ పార్టీ నుండి ఉండవల్లి అరుణ్ కుమార్, సురేష్ షెట్కార్ వెళ్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం ఆరుగురు పేర్లను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సీమాంధ్ర నుండి మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి, శాసన మండలి సభ్యుడు చెంగల్రాయుడు, పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణా ప్రాంతం నుండి మాజీ అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవిల పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.   తమ ప్రతినిధులుగా ఎవరిని పంపాలనే విషయాన్ని చర్చించడానికి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో మూడు ప్రాంతాలకు చెందిన నేతలతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ, పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం వర్గాలు ఈ నేతలందరికీ ఫోన్లు చేసి ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అందుబాటులో ఉండాలని సూచించినట్లు సమాచారం.

సమైఖ్యాంధ్ర కోసం ఆత్మహత్యలు వద్దు : కావూరి

        సమైఖ్యాంధ్ర కోసం తెలంగాణా విద్యార్దుల్లాగా ఆత్మహత్యలు వద్దని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు ఆంధ్ర ప్రాంత విద్యార్దులకు సూచించారు. తెలంగాణా వాదంతో తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు వ్యాపారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.   కెసిఆర్ ఉద్యోగులు, విద్యార్దుల ఆత్మహత్యలను పెట్టుబడిగా పెట్టి ఈ వ్యాపారం చేస్తున్నారని సమైఖ్యాంధ్ర ఉద్యమంలో ఈ మధ్య చురుగ్గా పాల్గొంటున్న కావూరి అన్నారు. ఈ రెండు తరహాల వ్యక్తులు లేకపోతే అసలు తెలంగాణా ఉద్యమం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న నెల్లూరులో జరిగిన సమైఖ్యాంధ్ర విద్యార్ది జెఎసి సమావేశంలో మాట్లాడుతూ కావూరి ఈ వ్యాఖ్యలు చేశారు.   పనిలో పనిగా ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై కూడా విమర్శలు చేశారు. కేంద్రంలో సమర్ధవంతమైన ప్రభుత్వం లేక పోవడంవల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని కావూరి అన్నారు. రేపు జరిగే అఖిల పక్ష సమావేశం కేవలం కాలయాపన కోసమేనని, ఈ సమావేశం ఆధారంగా ఎలాంటి నిర్ణయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు.   తెలంగాణా కు అనుకూలంగా కేంద్రం ఎలాంటి ప్రకటన చేసే అవకాశం లేదని, అందువల్ల విద్యార్దులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన వారికి సూచించారు. ఒకవేళ తెలంగాణా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయిస్తే, సమైఖ్యాంధ్ర నేతలు ప్రాణ త్యాగాలకు కూడా సిద్దంగా ఉన్నారని, విద్యార్దులు మాత్రం సంయమనం పాటించాలని కావూరి వారితో అన్నారు.

ఇంకెన్నాళ్ళీ జైలు బ్రతుకు?

  అంతవరకూ భోగభాగ్యాలనే తప్ప జైలు జీవితం కలలోకూడా ఊహించుకొని వై.యస్.జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడా జైల్లో మొట్టమొదటిసారి అడుగుపెడుతున్నపుడు, అతని లాయర్లూ, శ్రేయోభిలాషులూ కూడా ‘మాహా అయితే ఒకట్రొండు నెలలలో మీరు బయటకి వచ్చేస్తారంటూ’ దైర్యం చెప్పి ఆయనని లోపలి సాగనంపక తప్పలేదు. జగన్ కూడా అలాగే అనుకొన్నపటికీ ఆరునెలలు గడిచిపోయినా, ఇంతవరకూ బెయిలు రాలేదు. పైగా వరుసపెట్టి పంపిస్తున్న తన బెయిలు దరఖాస్తులన్నిటినీ క్రింద నుండి పై వరకూ అన్నికోర్టులూ కూడా ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నాయి. తాజాగా హైకోర్టు ఆయన బెయిలు వినతిని వచ్చేనెల నాలుగో తేదీకి వాయిదా వేసింది.   ఇది సరిపోనట్లు, మరో వైపు ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ జగన్ పై దూసేందుకు తమ కత్తులు పదును పెట్టుకొంటున్నట్లు సమాచారం. ఒకవేళ సి.బి.ఐ. కేసుల్లోంచి జగన్ ఎప్పటికయినా బయటపడగలిగినా, ఆ తరువాత తమ విచారణ కార్యక్రమం మొదలుపెట్టే ఆలోచనతో ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ ఉన్నట్లు సమాచారం. అంటే, జగన్కి ఇప్పట్లో జైలు జీవితం నుండి విముక్తికి అవకాశం లేనట్లే కనిపిస్తోంది. జగన్కి తన పరిస్తితి దాదాపు అర్దమయినందున, నిరాశా నిస్పృహలలో మునిగిపోతున్నట్లు తెలుస్తోంది. అది అసహనంగామారి, తనను కలువవస్తున్న తన ఆత్మీయులపైన, పార్టీ నేతలపైన ఆ కోపం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, గత కొంత కాలంగా అతని కుటుంబ సభ్యులు తప్ప, అతని పార్టీ నేతలెవరూ జైలుకి రావడానికి భయపడుతున్నారని తెలుస్తోంది.   ఈ నేపద్యంలో జగన్ తమ లాయర్లను మార్చితే ఏమయినా ప్రయోజనం ఉంటుందా అని అడిగినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా, కేంద్రాన్ని ఒప్పించేందుకు ఏమయినా అవకాశాలు ఉన్నాయా అని కూడా అడిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడగకపోయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్ది ప్రణబ్ ముఖర్జీగారికే ఓటువేసి కాంగ్రెస్ పార్టీని ప్రసన్నం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు ఏమి ఫలితాన్ని ఈయలేకపోయాయి. పైగా, చాలా స్ట్రిక్టు ఆఫీసరు అని పేరుమోసిన కృష్ణం రాజుని జైళ్ళశాఖ ఐ.జి.గా నియమించి, జైల్లోపల అన్ని చోట్లా సిసి కెమెరాలు పెట్టిన్చినట్లు సమాచారం. తద్వారా, జగన్ని కలవడానికి ఎవరెవరు, ఎన్నిసార్లు వస్తున్నారు, వారేమి మాట్లాడుకొంటున్నారు వంటి ప్రతి చిన్న విషయం కూడా సిసి కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘావర్గాలకి తెలుస్తుండటంతో, ఆ భయంతో పార్టీ వారు జగన్ని కలిసేందుకు వెనకడుగు వేస్తున్నారని ‘ములఖాత్’ రిజిస్టర్ర్ లో నానాటికీ తగ్గుతున్న ఎంట్రీల ద్వారా తెలుస్తోంది.   ఇక, నయాన్న విననప్పుడు భయాన్నైన లొంగదీసే ప్రయత్నంలోకొన్ని నెలలక్రితం తన సాక్షి మీడియా ద్వారా సిబి.ఐ. జే.డి. లక్ష్మి నారాయణ యొక్క ఫోన్ కాల్స్ లిస్టు ప్రచురించి లొంగ దీయాలని చూస్తె, అది కాస్తా వికటించి, అయనను మరింత రెచ్చగొట్టినట్లయ్యి, తమ ఉచ్చును తామే బిగించుకొన్నట్లయింది. కోర్టులు కూడా సి.బి.ఐ. అన్ని కేసుల విచారణ ముగించేవరకూ బెయిలుకోసం రాకుండా ఉంటె మంచిది అన్నట్లు సలహా కూడా ఇవ్వడంతో జగన్ ఇప్పడు మరో మూడు, నాలుగు నెలలు చంచల్ గూడా జైల్లో గడిపేందుకు మానసికంగా సిద్దమయినట్లు తెలుస్తోంది.

తెలంగాణా నేతల చెవుల్లో బొత్స పూలు పెడుతున్నడా?

  పిసిసి అధ్యక్షులవారు బొత్ససత్యనారాయణగారు ఈమద్యన ఎందుకో మాటిమాటికీ నాలిక్కరుచుకోవలసివస్తోంది. మొన్న “అలాగా ఆడోల్లు అర్దారాతిరి, అపరాతిరీ అని సూడకుండా రోడ్డేకేస్తే అలా కాక మరేటవుద్దీ?” అని మహిళలకు హితబోదచేయబోతే, వాళ్లతోబాటు ప్రజలందరూ కూడా కోర్రుగాల్చి వాతపెట్టినంత పనిచేసాక “నా ఉద్దేశ్యం అది కాదూ...” అంటూ మళ్ళీ ఏదో సంజాయిషీ చెప్పుకోక తప్పలేదు వాళ్ళందరికీ.   ఆయన నిన్నమొన్నటి వరకు కూడా “హిందీ మాట్లాడే వాళ్ళకి పదిరాష్ట్రాలుంటే తప్పు లేనిది మనకి రెండుంటే తప్పేలా అవుతుంది?” అని అడిగినవారిని, అడగనివారినీ కూడా ప్రశ్నిస్తూ ‘ఓల్ సీమంధ్ర’ మొత్తానికి తానొక్కడే తెలంగాణా మద్దతుదారునని డప్పేసుకొని మరీచాటించుకొంటూ, తెల్లరిలేస్తే కాంగ్రెస్ ని బండబూతులు తిట్టే కేసిర్ వంటి శత్రువుల చేతకూడా సాహ్బాష్! అనిపించుకొంటూ పిసిసి అద్యక్షపదవిలో నల్లేరు మీద నావలా ఎవరివల్లా ఇబ్బంది పడకుండా ఇంతకాలం హాయిగా కాలక్షేపం చేసేసారు.   అయితే, మరో రెండు రోజుల్లో అఖిలపక్ష సమావేశం ఉండగా ఆకస్మాతుగా జ్ఞానోదయం అయినట్లుగా, “అసలు రాష్ట్రం విడిపోవడం కన్నా కలిసి ఉండటమే మంచిదని నా అభిప్రాయం,” అని పత్రికలవారికి పిలిచి మరీ శలవిచ్చేరు. అది తెలిసిన తోటి తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు తదితరులు ఆయన మీద కలిసికట్టుగా దండెత్తేసరికి మళ్ళీ మాటమారుస్తూ “అది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే తప్ప మరోటి కాదు. మా అమ్మ సోనియమ్మా ఎలాచెపితే అలానే నడుచుకొంటాము. నాకేమీ అభ్యoతరాలు ఉండవు.”అని అన్నారు.   అది సరే, నిన్నమొన్నటి వరకు తెలంగాణా ఇస్తే తప్పేమిటీ? అన్న మనిషి ఇప్పుడు ‘కలిసి ఉంటె కలదు సుఖమూ’ అని కొత్తపల్లవి ఎందుకు అందుకొన్నట్లో? అంటే, ఇంతకాలం తానూ పిసిసి అద్యక్షపదవిలో ఉండగా తన తెలంగాణానేతల వల్ల ఏఇబ్బందీ రాకూడదనే దురాలోచనతో అలా వాళ్ళ చెవుల్లో పూలు పెట్టుకొంటూ పోయారా? లేక అధిష్టానం మనసులో మాటని తన నోటితో పలుకుతున్నారా? ఆయనే చెప్పాలి మరి.

మిస్టరీ విప్పిన పోస్ట్ మార్టం రిపోర్ట్

  మొన్న సోమవారంనాడు డిల్లీలో ఇండియాగేట్ వద్ద జరిగిన అల్లర్లలో పోలీసు కానిస్టేబుల్ సుబాస్ చoద్ తోమార్ (47) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో జేర్చబడి మృతి చెందిన విషయం తెలిసినదే. అతను అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్మ్ఆద్మీపార్టీ కార్యకర్తల దాడిలోనే మరణించాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపించడమే కాకుండా ఆ పార్టీ తన కార్యకర్తలని డిల్లీలో అరాచక పరిస్తితులు సృష్టించేందుకు ప్రేరేపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. డిల్లీ పోలీసులు ఎనిమిది మంది యువకులను తమ అదుపులోకి తీసుకొని విచారణ కూడా ప్రారంబించారు. అందులో ఒకరు ఆమ్మ్ఆద్మీపార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పేర్కొంటోంది. అతనిని విడిపించేందుకు ఆ పార్టీ నేతలు డిల్లీ పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి కూడా తెస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలన్నిటినీ అరవింద్ కేజ్రీవాల్ వెంటనే ఖండించారు.   ఇదిలాఉండగా, అల్లర్లలో అశువులు భాసిన అమరవీరుడిగా డిల్లీ పోలీసుశాఖ అతనికి అదికార లాంచనాలతో అత్యక్రియలు నిర్వహించడమే గాకుండా, అతని కుటుంబములో ఒకరికి పోలీసు శాఖలో ఉద్యోగం, అతని కుటుంబానికి భారీనష్ట పరిహారం కూడా ప్రకటించింది.   అయితే, కొద్ది గంటలక్రితం వెలువడిన పోస్ట్ మార్టంలో అతని శరీరంపై తీవ్రగాయాలున్న గుర్తులున్నపటికీ, వాటివల్ల మాత్రం అతను మరణించలేదని పోస్ట్ మార్టం నివేదిక బయటపెట్టింది. అతనికి ఆసుపత్రిలో ఉండగా, గుండె పోటు వచ్చినందువల్లనే మరణించాడని డాక్టర్లు తమ రిపోర్టులో తెలిపారు.

జూ.యన్టీర్, లోకేష్ లకి క్లాసు పీకిన రామోజీ?

  తెలుగుదేశంపార్టీలో రెండువర్గాలుగా చీలిన హరికృష్ణ, బాలకృష్ణలకు వారి శ్రేయోభిలాషి అయిన రామోజీరావు ఇటీవలే తన రామోజీఫిల్మ్ సిటీలో రాజీకుదిర్చినట్లు వార్తలొచ్చాయి. వారికేగాకుండా తెలుగుదేశంపార్టీ తరువాతతరం ప్రతినిదులయిన జూ.యన్టీర్, లోకేష్ లనికూడా కూర్చోబెట్టుకొని రామోజీరావు వాళ్ళకి పార్టీపరిస్థితిని సవివరంగా అర్ధమయ్యేలచెప్పి వారిమద్యన కూడా రాజీ కుదిర్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.   నందమూరి వంశానికి చెందిన తమ కుటుంబానికి తెలుగుదేశంపార్టీలో ఏ ఒక్కరికీ చంద్రబాబు పదవి ఈయకపోవడంపై హరికృష్ణ అతని కుమారుడు జూ.యన్టీర్, రామోజీరావు ముందు అసంతృప్తి వెలువరించినప్పుడు, ఆయన వారికి చంద్రబాబు తరపున కొన్ని హామీలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం పార్టీకోసం అందరు కలిసి కట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి వచ్చేలా గెలిపించుకొంటే, ఆ తరువాత పార్టీకోసం పనిచేసిన వారికి తప్పక సముచిత గౌరవం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చేరు. అందువల్ల, బాలకృష్ణ హరికృష్ణలు ఒకవైపు, జూ.యన్టీర్, లోకేష్ మరో వైపు చేతులు కలిపి పార్టీకోసం పనిచేయాలని రామోజీరావు వారని ఒప్పించినట్లు సమాచారం.   ముఖ్యంగా జూ.యన్టీర్, లోకేష్ లకు ఉత్తరప్రదేశ్ లో సైకిల్ పై రాష్ట్రమంతా పర్యటించి ముఖ్యమంత్రి అయిన సమాజ్ వాది పార్టీ యువనాయకుడు అఖిలేష్ సింగ్ యాదవ్ విజయగాధని ఆడియో, వీడియో క్లిప్పింగులతో సహా రామోజీరావు జూ.యన్టీర్, లోకేష్ లకు చూపించి వారికి పార్టీ విజయం కోసం ఏవిదంగా కష్టపడాల్సి ఉంటుందో వివరించినట్లు సమాచారం. అందువల్లే, వారిరువురూ లేదా లోకేష్ ఒక్కడే గానీ నూతన సంవత్సరంలో సైకిల్ యాత్ర మొదలు పెట్టవచ్చును అని తెలిసింది. అయితే సినిమా షూటింగ్ లతో నిత్యం తీరికుండని జూ.యన్టీర్ మాత్రం వెంటనే సైకిల్ యాత్ర మొదలు పెట్టకపోయినా, ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలియగానే, తన సినిమాలను, షూటింగులను కొన్నిరోజులు పక్కన పెట్టయినసరే వచ్చి తెలుగుదేశంపార్టీ ప్రచారంలో పాల్గొనవచ్చును అని తెలిసింది. ఈ లోపున లోకేష్ మాత్రం తన పార్టీకి అచ్చొచిన శ్రీకాకుళం జిల్లానుండి త్వరలో సైకిల్ యాత్ర మొదలు పెట్టవచ్చునని సమాచారం.   నూతన సంవత్సరం, సంక్రాంతి (అమావాస్య) హడావుడి ముగియగానే, బాలకృష్ణ, హరికృష్ణలు కూడా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గోనవచ్చునని తెలుస్తోంది. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనే లోకేష్ కోసం యన్టీర్ భవనంలో ఒక గదినికూడా సిద్దం చేయబోతున్నారని నేడు వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికలలో పార్టీని ఎలాగయినా గెలిపించాలని నిజంగా నందమూరివారు, నారవారు కలిసి నడుం బిగిస్తే ఫలితాలు అనుకూలంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, అది వారు ఎంత ఐక్యతగా ఉండగలరనేదానిపైనే ఆధార పడిఉంటుంది.

డిల్లీ కేసును కమ్ముకొంటున్న (నీచ) రాజకీయాలు

  మన రాజకీయ నేతలు ఎటువంటి సున్నితమయిన అంశానయినా తమ రాజకీయకోణం నుంచే చూస్తారు తప్ప వేరేగా చూడలేరు. తమ రాజకీయలబ్దికి ప్రతీ అంశం ఏవిదంగా ఉపయోగపడుతుందా అని చూస్తారు తప్ప, డిల్లీ అత్యాచార సంఘటనలపట్ల స్పందించవలసిన విదంగా స్పందించరు. ఒక సమస్య ఏర్పడినప్పుడు దాని పరిష్కారానికి ప్రయత్నించకపోగా, దానిని ఉపయోగించుకొని తమ విరోధి పార్టీలను ఏవిదంగా అభాసుపాలు చేవచ్చునో అని మాత్రమే ఆలోచిస్తారు.   డిల్లీ సంఘటనపై క్రమంగా వేడి చల్లారుతున్న సమయంలో డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, డిల్లీ పోలీసులపై ఆరోపణలు మొదలుపెట్టేరు. భాదితురాలి మొదటి వాంగ్మూలము తీసుకోనేందుకు వెళ్ళిన డిల్లీ సబ్ డివిసినల్ మాజిస్ట్రేట్ ఉషచతుర్వేదిని కొందరు డిల్లీపోలీసు అధికారులు ఆమె బాధితురాలిని ఏమి ప్రశ్నించాలో తెలియజేస్తూ వారే ఆమెచేతికి ఒక ప్రశ్నాపత్రం ఇచ్చినందువల్ల, ఆమె బాదితురాలి వాంగ్మూలము తీసుకోకుండానే వెనుదిరిగిందని, ఇటువంటి సున్నిత విషయాలలో పోలీసుల ‘అతి’ని అదుపు చేయవలసిన పోలీసు కమీషనరు బాధ్యతా రహితంగా వ్యహరించాడని, కనుక, వెంటనే ఈ విషయం పై హోంశాఖ విచారణ జరపాలని కోరుతూ షీలాదిక్షిత్ హోంమంత్రి సుషీల్ కుమార్ షిండేకు ఒక లేఖ వ్రాసారు. ఆమె తన లేఖలో హోంశాఖ అదీనంలో ఉన్న డిల్లీ పోలీసులను డిల్లీ ప్రభుత్వానికి అప్పజెప్పాలని కూడా కోరారు. ఆమె డిల్లీ పోలీసులు హోంశాఖ అదీనంలో ఉనందుకు బాధపడుతున్నారా లేక వారు మాజిస్ట్రేట్ ని వాంగ్మూలము తీసుకోకుండా అడ్డుపడినందుకు ఆమె ఈ రకమయిన ఆరోపణలు మొదలు పెట్టారానేది ఆలోచించవలసిన విషయం.   డిల్లీ పోలీసులు మాత్రం, బాదితురాలి తల్లితండ్రులు అభ్యర్దన మేరకే తాము ఆవిధంగా చేయవలసి వచ్చిందని చెపుతూ, మళ్ళీ మరోసారి బాదితురాలి వాంగ్మూలము నమోదు చేసారు. అయితే, షీలా దీక్షిత్ హోంమంత్రికి వ్రాసినలేఖ ఎలా బహిర్గతం అయిందో కనిపెట్టేందుకు ఒక విచారణ కమిటీని హోంశాఖ నియమించాలని వారు కోరారు.   మరో వైపు ఈ డిల్లీ సంఘటనను చర్చిందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని భారతీయ జనత పార్టీ రాష్ట్రపతిని కోరింది.   కాంగ్రెస్ పార్టీ మొన్న డిల్లీలో ఇండియా గెట్ వద్ద జరిగిన అల్లర్లలో అరవింద్ కేజ్రివాల్ కొత్తగా పెట్టిన ‘ఆమ్మ్ ఆద్మీ పార్టీ’ కార్యకర్తల దాడిలో ఒక పోలీసు చనిపోయాడని , తమ కార్యకర్తలని రక్షించునేందుకు ఆ పార్టీ పోలీసుల మీద రాజకీయ ఒత్తిడి తెస్తోందని ఆరోపించింది.   కాంగ్రెస్ ఆరోపణలకు ప్రతిస్పందించిన అరవింద్ కేజ్రివాల్ ఇండియా గెట్ వద్ద జరిఇన అల్లర్లలో తమ పార్టీ వారెవరూ లేరని, ఒకవేళ ఉన్నట్లయితే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చునని ప్రకటన విడుదల చేసారు.   ఇంతవరకు, ఈ దుర్ఘటనపై స్పందిచని రాజకీయపార్టీలు కూడా, మరికొద్దిరోజుల్లో తమ పాత్ర పోషించేందుకు ముందుకువచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు.

తెదేపా అడుగుజాడలలో నడుస్తున్న వై.యస్సార్.సి.

  యుద్దరంగంలోకి ప్రవేశించిన తరువాత తమను ముందుకు నడిపించే నాయకుడు కనబడకపోతే సైనికుల పరిస్తితి ఏవిదంగా ఉంటుందో, ప్రస్తుతం వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ పరిస్తితి కూడా అలాగనే ఉందని చెప్పవచ్చును. ఒక వైపు తనపై శతృవులు చేస్తున్న దాడిని ఎదుర్కొంటూనే, మరోవైపు అదే శత్రువ్యుహాలని అమలుచేస్తూ ఎలాగో నెట్టుకొస్తోంది వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు.   చంద్రబాబు వెనుకే పాదయాత్రలు మొదలుపెట్టిన షర్మిల ఈమద్యనే మోకాలిగాయం వల్ల తన పాద యాత్రను విరమించుకోక తప్పలేదు. గానీ, చంద్రబాబు మాత్రం ఇంకా తన పాదయాత్రని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే, షర్మిల మద్యలో ఆపిన పాదయాత్రని కొనసాగించే నాయకుడు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి కరువవడం చాలా దురదృష్టకరం అని చెప్పవచ్చును. పార్టీ అధినేత జగన్ జైలులో ఉండిపోవలసి రావడం, విజయమ్మ ఆరోగ్యం మరియు ఆమె వయసు రీత్యా పాద యాత్రలను చేయలేని పరిస్తితి.    వీరికి సముజ్జీగా నిలిచే మరోనేత పార్టీలో లేకపోవడం అన్నీ కలగలిసి, వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీని తన శత్రుపార్టీలముందు బలహీనంగా మిగిల్చింది. అయితే, ఆ పార్టీ అందుకు తరుణోపాయంగా తన శత్రువయిన తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తున్న రాజకీయ కార్యక్రమాలను తాత్కాలికంగానయినా అనుసరించడమే ఉత్తమం అని నిర్ణయించుకొనట్లు కనిపిస్తోంది. అందుకే, చంద్రబాబు నిన్న పత్తి రైతులకు మద్దతుగా తాను ఎనుమురులో ధర్నా చేయబోతునట్లు ప్రకటించగానే, వెంటనే వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ కూడా తానుకూడా మహబూబ్ నగర్ లో పత్తి రైతులకి మద్దతుగా ధర్నా చేయబోతునట్లు ప్రకటించింది. బహుశః, మరే ఇతర రాజకీయపార్టీ ఇంత ధైన్యస్తితిని చూసి ఉండకపోవచ్చును.   ఇప్పటికయినా వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ వెంటనే మేల్కొని తన రాజకీయ కార్యక్రమాలను ముందుండి నడిపించగల సమర్డుడయిన నాయకుడిని తప్పనిసరిగా కనుక్కోవలసిన అవసరం ఉంది. నాయకుడు లేని పార్టీ గుర్రాలులేని రధం వంటిది.   కేవలం, పార్టీలో ఉన్న ఉపనాయకులతో పార్టీని నడిపించాలని చూస్తే, అటువంటి వారు నిరుడు ప్రజారాజ్యం పార్టీకి పట్టించిన గతే వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి పట్టించి తమదారి తాము చూసుకొనే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి సానుభూతి చూపుతున్న వై.యస్.వివేకానంద రెడ్డి గానీ, అందరూ ఊహిస్తునట్లుగా జగన్ అర్దాంగి శ్రీమతి భారతిగారు గానీ త్వరలో పార్టీ పగ్గాలు చెప్పట్టవచ్చునని రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు. ఏది ఏమయినపటికీ వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ మాత్రం వెంటనే మేలుకొని తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

అఖిల పక్ష సమావేశానికి ప్రతినిధుల ఖరారు

      ఈ నెల 28 న తెలంగాణా ఫై ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశానికి వెళ్ళే నేతల జాబితాను టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బిజెపి లు ప్రకటించాయి.   తెలంగాణా రాష్ట్ర సమితి నుండి ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్ర శేఖర రావు, నాయని నరసింహా రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. జగన్ పార్టీ నుండి మైసూరా రెడ్డి, మహేందర్ రెడ్డి లు హాజరవనున్నారు. భారతీయ జనతా పార్టీ నుండి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కంబంపాటి హరిబాబు లు ఈ సమావేశానికి హాజరవుతారు.   ఎంఐఎం నుండి ఒవైసీ సోదరులు హాజరవుతారు. సిపిఎం నుండి రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, ఎంఎల్ఏ జూలకంటి రంగా రెడ్డి లు ఆ పార్టీ ప్రతినిధులుగా హాజరవుతారు. ఇక సిపిఐ తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, ఎంఎల్ఏ గుండా మల్లేష్ లు హాజరవుతారు.   ఈ సమావేశంలో బిజెపి, సిపిఐ పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా తమ అభిప్రాయాలను చెప్పనున్నాయి. ఇక సిపిఎం, ఎంఐఎంలు మాత్రం తెలంగాణా వ్యతిరేక వైఖరి అవలంభించనున్నాయి.

జగ్గా రెడ్డి సమైఖ్య వాది !

          కాంగ్రెస్ నేత, శాసనసభ్యుడు జగ్గా రెడ్డి తాను సమైఖ్య వాదినంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, సమైఖ్య ఆంధ్ర తోనే తెలంగాణా అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.   ఎంఐఎం పార్టీ కూడా ఇదే అభిప్రాయంతో ఉందని ఆయన అన్నారు. దమ్ముంటే, ఒవైసీ సోదరులను ముట్టడించాలని జగ్గా రెడ్డి తెలంగాణా లాయర్లను సవాల్ చేశారు. తెలంగాణా లాయర్లు కొందరు కెసిఆర్ కు తొత్తులుగా మారారని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్రం వద్దని తాను కేంద్రానికి, తమ పార్టీ అధిష్టానికి లేఖ రాస్తానని ఆయన ప్రకటించారు.   గతంలో, ప్రత్యెక తెలంగాణా రాష్ట్ర డిమాండ్ తో టిఆర్ఎస్ నుండి సంగా రెడ్డి శాసనసభ్యునిగా ఎన్నికైన జగ్గా రెడ్డి ఇప్పుడు తెలంగాణా కు వ్యతిరేకంగా మారడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆయన ఈ ప్రకటన సమైఖ్య ఆంధ్రులకు మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది.

టిడిపి లో ‘మోడి’ కలవరం !

        సినీ నటుడు బాలకృష్ణ తన గుజరాత్ పర్యటనను విరమించుకొని ఉండవచ్చు. అయితే, నరేంద్ర మోడి తన ప్రమాణ స్వీకారోత్సవానికి బాలకృష్ణను ఆహ్వానించిన సంఘటన మాత్రం తెలుగు దేశం పార్టీలో చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీలోను, బయటా కూడా కాస్త అలజడి చెలరేగడంతో బాలకృష్ణ తన పర్యటనను విరమించుకొన్నారు.   ఈ ఆహ్వానంపై తెలుగు దేశం పార్టీలో పెద్ద చర్చే జరిగింది. బాలకృష్ణ గుజరాత్ వెళ్ళినట్లయితే అది పార్టీ అధినేత చంద్ర బాబును ఇబ్బందిల్లోకి నెట్టినట్లే అవుతుందని పార్టీ నేతలు భావించారు. అయితే, బాలకృష్ణ గుజరాత్ పర్యటనకు వెళ్తే నష్టమేమీలేదని కొంత మంది నేతలు అన్నట్లు తెలిసింది. అందరి అభిప్రాయాలు తెలుసుకొన్న తర్వాత గుజరాత్ పర్యటనకు వెళ్ళవద్దని చంద్ర బాబు, బాలయ్యకు చెప్పినట్లు తెలిసింది.   బాలయ్య ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నందున ఓ బిజెపి ముఖ్య మంత్రి ఆహ్వానానికి వెళ్లడం సరికాదని పార్టీ నేతలు తమ అభిప్రాయంగా బాబుకు చెప్పినట్లు తెలిసింది. దీనితో, బాలకృష్ణ చంద్ర బాబు నిర్ణయానికి కట్టుబడి తన గుజరాత్ పర్యటనను విరమించుకున్నారు. ఈ పర్యటనకు బాలయ్య వెళ్తే, అది చంద్ర బాబుకు మచ్చేనని సిపిఐ కార్యదర్శి నారాయణ కూడా అభిప్రాయపడ్డారు.   అయితే, ఎన్టిఆర్ కుటుంబం అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. ఎన్టిఆర్ ఫై ఉన్న అభిమానంతో మోడి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపితే, దీనిని తిరస్కరించడం ఎన్టిఆర్ ను కించపరచడమే అవుతుందని వారంటున్నారు.

యువతను మేల్కొల్పిన డిల్లీ సంఘటన

  డిల్లీలో జోరుగా సాగుతున్న యువత ఆందోళనలు క్రమంగా అదుపుతప్పి రాజకీయరంగు పులుము కొంటుంటే, గోడమీదకూర్చొని తమవంతు వచ్చేవరకు ఒప్పిగ్గా ఎదురు చూసిన రాజకీయపార్టీలు ఒకటొకటిగా రంగంలోకి దూకుతున్నాయి. ఇక మరో వైపు, భాదితురాలి ఆరోగ్యం గంటకో రకంగా ఉంటూ ఆందోళనకరంగా ఉంటోంది. ప్రభుత్వం డిల్లీ వీదులను ఎక్కడికక్కడ పూర్తిగా దిగ్బందిoచి వేయడంతో విద్యార్దుల ఆందోళనల పరిది మెల్లగా కుచించుకుపోయి ప్రస్తుతం జంతర్ మంతర్ ప్రాంతానికే పరిమితమయిపోయాయి.   అయితే, శరీరం గడ్డకట్టుకుపోయే చలిలోకూడా వారు కనబరుస్తున్న పట్టుదల అందరినీ అబ్బురపరుస్తుంటే, మరోవైపు ప్రభుత్వం ఎన్నిహామీలు ఇస్తున్నా, ఎన్నిచర్యలు చేపట్టినాకూడా విద్యార్దులు తమపట్టువీడకుండా అర్ధంలేని మొండితనం ప్రదర్శిస్తూ విమర్శలకి గురవుతున్నారు. యువతలో ఆవేశం ఉండటం సహజమే గానీ, చట్టాన్ని అమలు చేయాల్సిన బాద్యతగల ప్రభుత్వాలకి కూడా కొన్ని పరిమితులు ఆంక్షలు, విధి విధానాలు ఉంటాయని వారు గుర్తెరుగకపోవడం విచారకరం.   అంతకంటే విచారకరమయిన మరో విషయం ఏమిటంటే డిల్లీలో ఉవ్వెతున ఎగిసిపడుతున్న విద్యార్దుల ఆందోళనలకి మిగిలిన ఇతరరాష్ట్రాలతోబాటు మన రాష్ట్రయువత నుండి కూడా కనీస స్పందన కరువవడం. అక్కడక్కడ మొక్కుబడిగా నిరసన ర్యాలీలు జరిపి మమ అనిపించేసిన మన యువతలో స్పందించే గుణం తగ్గిపోయిందా లేక ఇటువంటి వాటికి తమ అమూల్యమయిన సమయం వెచ్చించడం అనవసరమని భావిస్తున్నారో తెలియదు, గానీ మొత్తం మీద పెద్దగాస్పందన లేదు. ఫేస్ బుక్, ట్వీటర్ లనే తమ జీవితపరమావదిగా భావిస్తూ రోజంతా వాటిమద్యనే కాలం గడిపే మన యువత ఈ ఘోర సంఘటనని తమ సోషల్ నెట్ వర్క్స్ ద్వారా తమ స్నేహితులతో పంచుకొని, ఎందుకు నిరసన తెలుపలేదో మరి తెలియదు.   ఒక వైపు డిల్లీలో నిరసనలు కొనసాగుతుండగానే, మరో వైపు దేశం నలుమూలలా ఉన్న మగమృగాలు తమ పైశాచిక మధనకాండ నిర్భయంగా, నిర్లజ్జగా కొనసాగించడం వారి తెంపరితనానికి, వ్యవస్థ పట్ల వారి నిర్లక్ష్యానికి ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు, ఈ చట్టాలు తమని ఏమి చేయలేవననే ధీమా అయినా అయిఉండాలి, లేదా యదావిదిగా ఈ నేరాలుకూడా ఎవరికంటాపడకుండా కప్పెయవచ్చును అనే దురాలోచన అయినా అయిఉండాలి. మన యువతలో సామజిక స్పృహ కరువవడం కూడా ఇటువంటి నేరస్తులకి దైర్యం ఇచ్చేదిగా ఉంది. మొత్తం మీద మహిళల మీదా, అభం శుభం ఎరుగని పసిపిల్లలమీడా అత్యాచారాలు మాత్రం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.   ఇక ప్రభుత్వం కూడా విద్యార్దుల మొండితనంతో రోజు రోజుకి తన సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. “ఈరోజు విద్యార్దులు మమ్మలిని ఇండియా గేట్ వద్దకి చర్చలకి రమ్మని పిలిచేరు. రేపు మరో రాజకీయ పార్టీయో లేక మావోయిస్ట్ పార్టీయో కూడా అక్కడికి రమ్మంటే మేము వెళ్ళాలా?” అని కోపంగా ప్రశ్నించేరు హోం మంత్రి షిండేగారు. ఆయన మాటలు విద్యార్దులను రెచ్చగొట్టవచ్చును, గానీ, ఆయన మాటల్లో సహేతుకతకూడా ఉంది. ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. దానిని నడిరోడ్డు మీదకు లాగాలనుకోవడం అంటే దానిని అవహేళన చేస్తునట్లే భావించాల్సి ఉంటుంది. అటువంటి చర్యలద్వారా మన వ్యవస్థ ఎంత బలహీనమయినదో తెలియని వారికి సైతం పిలిచిచెప్పినట్లే అవుతుంది. అది భారతీయులమయిన మనకి అవమానకరం. ఇతర దేశాల, వ్యవస్థల దృష్టిలో మన దేశాన్ని, మన ప్రభుత్వాన్ని మనమే పలుచన చేసుకొన్నట్లవుతుంది. యువత దేశానికి బలమయిన ఆలంబనగా నిలవాలే తప్ప దానికి గొడ్డలిపెట్టుగా మారకూడదు. యువత సామాజిక, రాజకీయ స్పృహ చూపడం ఎంత అవసరమో, దానిని దేశప్రయోజనాలకి అనుకూలంగా ఉపయోగించడం కూడా అంతకంటే ముఖ్యం.   తమ చైతన్యాన్ని తగిన సమయంలో తగిన విదంగా, తగిన మోతాదులో ఉపయోగించినప్పుడే వారి శక్తియుక్తులు బయటపడి ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఉదాహరణకి, 76 సం.ల కురు వృద్దుడు అన్నాహజారే కూడా లోక్పాల్ బిల్లు కోసం పోరాటం చేసారు. అయితే దానిని ఎంతవరకు కొనసాగించాలో అంతవరకే చేసి విరమించేరు. అలాగని ఆయన తన లోక్పాల్ ఉద్యమాన్నిపక్కన పెట్టేయలేదు. ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ ఆయన “నేను లోక్పాల్ బిల్లు పేరుతొ జనసమీకరణ చేసి నా బాల ప్రదర్శన చేయాలనుకోవట్లేదు. దాని ద్వారా జనాలను చైతన్యపరచాలనే అనుకొంటున్నాను,” అని చెప్పడం ద్వారా ఆయన ఏదయినా ఒక ప్రయోజనం ఆశించి మొదలుపెట్టిన ఉద్యమాన్ని ఏవిదంగా నడిపించాలో తెలియజేసారు. డిల్లీ యువత కూడా ఇది గ్రహించాలి.   ముందు శాంతియుతంగా మొదలయిన తమ ఆందోళనలు నేడు ఆహింసాత్మకంగా ఎందుకు మారాయి? ఎవరి రాకతో మారాయి? అని వారినివారే ప్రశ్నించుకోవలసిన అవసరం వచ్చిందిప్పుడు. తమ ఉద్యమాల వల్ల ఒక పోలీసు ఉద్యోగి ప్రాణాలు కోల్పోయేడంటే ఎంత అవాంచనీయ పరిస్తితులు తాము సృష్టించేరో వారు తెలుసుకోవాలి. తమ ఉద్యమాలు పక్కదారి పట్టి తమకే చెడ్డపేరు తెస్తున్నాయని గ్రహించగలిగితే, తాత్కాలికంగానయినా వాటిని విరమించి మళ్ళీ ప్రభుత్వంలో చొరవకకొరవడిననాడు ఉద్యమించి దాని బాద్యతలు గుర్తు చేయవచ్చును. అదే విదంగా దేశవ్యాప్తంగా ఉన్నయువత కూడా ఇటువంటి దురాగతాలు మళ్ళీ పునారావృతం కాకుండా తామేమి చేయగలమో ఆలోచించాలి.

జైల్లో జగన్ తో ఖాకీల భేటీ !

    అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి, చంచల్ గూడా జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ని ఇద్దరు పోలీస్ అధికారులు కలవడం వివాదాస్పదం అవుతోంది.   డబీర్ పురా ఇన్స్ పెక్టర్ రంగా రెడ్డి, సబ్ ఇన్స్ పెక్టర్ నరసింహా రావు లు నిన్న జైలులో జగన్ తో భేటీ అయినట్లు సమాచారం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వై వి సుబ్బారెడ్డి జైలులో జగన్ ను కలిసారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే ఈ ఇద్దరు ఖాకీలు జగన్ తో ములాఖత్ అయినట్లు సమాచారం.   ఓ పోలీస్ అధికారి జైలులో ఉన్న ఓ విఐపి ఖైదీని కలవడం సాధారణ విషయం కాదు. దీనితో, ఈ సంఘటన వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తోంది. అందుకే, ఎవరికీ అనుమానం రాకుండా సుబ్బారెడ్డి అక్కడ ఉన్న సమయంలోనే ఈ ఇద్దరూ జగన్ ను కలిసినట్లు తెలుస్తోంది.   అయితే, ఈ కధనాన్ని జైలు సూపరింటెండెంట్ కొట్టిపారేశారు. ఖైదీల రక్షణ కోసమే వారు వచ్చారని ఆయన వివరించారు.

కేంద్రం మాటే తన మాటగా కాంగ్రెస్ ?

        తెలంగాణాఫై ఇంకో మూడు రోజుల్లో ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశంలో ‘తెలంగాణాఫై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా దానికి కట్టుబడి ఉంటాం’ అనే ఏక వాక్య ప్రకటనను కాంగ్రెస్ వినిపిస్తుందని సమాచారం. దీనితో తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ నాన్చివేత ధోరణి అవలంబిస్తుందనే విషయం దాదాపు తెలిసిపోయింది.   ఈ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై గత శనివారం ఢిల్లీలో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ అధిష్టానంతో చర్చించి ఈ వ్యూహాన్ని సిద్దం చేసినట్లు సమాచారం. అయితే, ఈ తాజా వ్యూహం అసలు తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలకే మింగుడు పడడంలేదని తెలుస్తోంది.   ఈ వైఖరి అనుసరించే పరిస్థితి ఉంటే, అసలు హోం శాఖ ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వారికి ఢిల్లీ నుండి ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా రానందున తమ స్పందన చెప్పడానికి వెనుకాడుతున్నారు.   మరోవైపు ఈ సమావేశం గురించి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రతినిధుల పేర్లను ముందు రోజు మాత్రమే ప్రకటిస్తామని అన్నారు. తమ అభిప్రాయాన్ని సమావేశంలో మాత్రమే చెబుతామని ఆయన స్పష్టం చేశారు.

ఇక పార్టీలో లోకేష్ క్రియాశీలకం ?

    తెలుగు దేశం పార్టీ అధినేత తనయుడు నారా లోకేష్ ఇక పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల సమయంలో పార్టీ మానిఫెస్టో రూపకల్పనలోనూ, ప్రచార కార్యక్రమాల వెనుక ఆయన పాత్ర ఉంది.   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ నేత జగన్ మోహన్ రెడ్డి కి బెయిల్ వస్తుందని అంటున్నారే తప్ప, ఆయన నిర్దోషిగా వస్తాడని మాత్రం ఎందుకు అనడం లేదంటూ లోకేష్ ట్విట్టర్ లో ప్రశ్నించారు కూడా. జగన్ అవినీతిని విభిన్నంగా చెప్పాలని, వంద నోట్లను వెయ్యి లారీల నిండా నింపితే ఎంత మొత్తం అవుతుందో అంత మొత్తాన్ని జగన్ దోచుకున్నాడని చెప్పాలంటూ పార్టీ నేతలకు ప్రత్యేకంగా చెప్పారు.   క్రమంగా పార్టీ నేతలతో సంభందాలు పెంచుకోవడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల తన తండ్రి వెంట పాద యాత్రలో కొన్ని రోజుల పాటు నడిచారు కూడా. ఇవన్నీ పార్టీలో లోకేష్ క్రియా శీలక పాత్రకు నాందిగా భావిస్తున్నారు. అంతే కాకుండా, తన తండ్రి పాద యాత్ర ముగిసిన వెంటనే, రాష్ట్రమంతా సైకిల్ యాత్ర చేయాలని ఆయన పధక రచన చేస్తున్నట్లు సమాచారం.

ప్రమాణానికి బాలకృష్ణ ను ఆహ్వానించిన మోడీ

      గుజరాత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రేపు ముఖ్య మంత్రి పదవిని చేపట్టబోతున్న నరేంద్ర మోడి తన ప్రమాణ స్వీకారోత్సవానికి సినీ నటుడు బాలకృష్ణ ను కూడా ఆహ్వానించారు. ఎన్.టి. రామారావును అమితంగా అభిమానించే మోడి, ఆయన కుమారుడు బాలకృష్ణ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.   ఎన్టీఆర్ కుమారుడిగా మాత్రమే బాలయ్యను మోడి ఆహ్వానించారని, దీని వెనుక రాజకీయ కారణాలేవీ లేవని వార్తలు వస్తున్నాయి. అయితే, బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయాన్ని ఆయన చంద్ర బాబు తో చర్చించనున్నారని సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరయితే, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను ఆహ్వానించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మోడిని కోరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.   ఈ విషయంలో తుది నిర్ణయం జరిగితే, ఈ మధ్యాహ్నం బాలయ్య గుజరాత్ కు పయనమవుతారు. ఇంతకు ముందెన్నడూ మోడి, బాలకృష్ణ ను ఆహ్వానించిన దాఖలాలు లేకపోవడంతో, ప్రస్తుతం మోడి ఆలోచన వెనుక ఉన్న అంతరార్ధంఫై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.   వ్యక్తిగతంగా బాలయ్య ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నపటికీ, బిజెపి కి దూరంగా ఉండాలని భావిస్తున్న తెలుగు దేశంలో ఈ ఆహ్వానం చర్చనీయాంసంగా మారే అవకాశం కాదనలేం.  

బెయిలెనుక బెయిలు బెట్టి పదహారు బెయిళ్ళు పెట్టీ....కసేరీల సుట్టూ తిరగాడినా

  బండెనుక బండి గట్టీ పదహారు బళ్ళు గట్టీ....అని ఒకనాడు జనం తన్మయత్వంగా పాడుకొనేవారు. గానీ, చంచల్ గూడా జైల్లో ఈ మద్యనే రెండు శతదినోత్సవాలు, ఒక పుట్టిన రోజు ఘనంగా జరుపుకొన్న జగన్నన్న మాత్రం ‘బెయిలెనుక బెయిలు బెట్టి పదహారు బెయిళ్ళు పెట్టీ....కసేరీల సుట్టూ తిరగాడినా బెయిలు రాదేటన్నా...ఇదేటి నాయమో...ఓరన్నా’ అని చిన్నగా పాడుకొంటూ, ఏ తోడూలేని చోట నీనీడే నీకుతోడూ అని తనకి తానూ సర్ది జెప్పుకొంటూ, తనని తానే ఒదార్చుకొంటూ మరో బెయిలు దరఖాస్తు కోర్టులో పడేసాడు.   హైకోర్టు మాత్రం వద్దంటే వినడేమి ఈ కడప జగమొండి అని పల్లవి ఎత్తుకొని మళ్ళీ మరోమారు ఆతని బెయిలు దరఖాస్తుని పరిశీలించడానికి సైతం పనికి రాదనీ నేడు కొట్టిపారేసింది.   జయిలెరిగిన జగనన్న, పరీక్షల్లో మార్చి తరువాత సెప్టెంబర్ ఆప్షను ఉన్నట్లే తనకీ రేపు బుదవారం కోర్టు విచారణకి రానున్న మరో బెయిలు పిటిషను ఉందన్న దీమాతో ఎదురు చూడసాగాడు.   అయితే, కాంగ్రేసు ‘చేతి’వాటానికి గురయి నాబ్రతుకు ఇలాగ తెల్లారి పోయిందని ఒక వైపు బాధ పడుతూనే, తన లాగే సి.బి.ఐ.కూడా కాంగ్రెస్ కబంధ ‘హస్తం’లో ఇర్రుకుపోయిందని దానిమీద జాలిపడాడు కూడా. కాంగ్రేసు, సిబి.ఐ. కవల పిల్లల మాదిరిగా ‘చేతిలో చేయి వేసుకొని’ తన వంటి అమాయకులూ, కష్టపడి కోట్లు సంపాదించుకొన్న మేధావులను అన్యాయంగా చంచల్ గూడా లో ఫ్రీ మీల్స్ తినిపించడం ఏమి న్యాయమని ప్రశ్నిస్తున్నాడు. గానీ, ఎన్నికలు వచ్చే వరకూ అతనిది అరణ్య రోదనగానే కాదు... కాదు... చంచల్ గూడా రోదనే అనుకోక తప్పదు. అప్పుడయినా, రాహుల్ బాబు తన స్నేహ ‘హస్తం’ అందించితేనే జగనన్న లోటస్ పాండ్ గాలి పీల్చుకోగలడు.

సమైక్య నినాదంతోనే తెలంగాణాలో గెలుస్తా: జయప్రకాష్ రెడ్డి

  కాంగ్రెస్ పార్టీలో, సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్నతెలంగాణా కాంగ్రెస్ శాసనసభ సభ్యుడు తూరుపు జయప్రకాశ్ రెడ్డి మాత్రమే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అవసరం లేదని వాదిస్తున్న ఒకే ఒక తెలంగాణా వ్యక్తిగా నిలిచేరు. అంతటితో ఆగక వచ్చే ఎన్నికలలో సమైక్య వాదంతోనే తానూ తన నియోజక వర్గంనుండి గెలిచిచూపిస్తానని, దమ్ముంటే తనని తెలంగాణా వాదంతో ఓడించమని, ఒకవేళ తానూ గనుక ఎన్నికలలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కేసిర్ కి అయన సవాలు విసిరేరు. కేసిర్ కే గనుక దమ్ముంటే, మతతత్వ పార్టీ అయిన యం.ఐ.యం.ని తెలంగాణాకి అనుకూలంగా ఒప్పించాలని మరో సవాలు విసిరారు. తెలంగాణావాదాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు పోగేసుకోన్నాడని కేసిర్ ని విమర్శించారు. కాంగ్రెస్ ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ప్రకటించే బదులు, తెలంగాణా అభివృద్ధి బోర్డుని స్థాపించి దానికి రూ.10,000 కోట్లు ఇచ్చినట్లయితే తెలంగాణా ఇంకా త్వరితగతిన అభివృద్ధి సాదించగలదని ఆయన తెలిపారు. చేవెల్ల-ప్రాణహిత ప్రాజెక్టులు పూర్తీ చేసినట్లయితే తెలంగాణాలో పలుజిల్లాలు సస్యశ్యామలమవుతాయని ఆయన అభిప్రాయ పడ్డారు.