రాష్ట్ర విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే కారణమా
posted on Oct 29, 2013 @ 10:05PM
కేంద్రమంత్రి పదవి కోసం కావూరి సాంబశివరావు అలకలు గురించి అందరికీ తెలిసిన విషయమే. మంత్రి ఇవ్వలేదనే కోపంతో ఆయన సమైక్యాంధ్ర కోసం అవసరమయితే పార్టీ పెట్టి మరీ పోరాటం మొదలు పెడతానని కాంగ్రెస్ హస్తాన్ని మెలితిప్పి మరీ కేంద్ర మంత్రి పదవి సంపాదించుకొన్నారు. కేంద్రమంత్రి పదవి రాగానే రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు కూడా. కానీ తాను సమైక్యవాదినేనని నేటికీ అయన చెప్పుకొంటూనే ఉంటారు.
తను కేంద్ర మంత్రి అయిననాటి నుండి తను ప్రతీ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర విభజన చేయవద్దని, దానివల్ల అనేక సమస్యలు వస్తాయని కేంద్రానికి హితవు చెపుతూనే ఉన్నానని, కానీ ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన కొందరు సీనియర్లు రాష్ట్ర విభజన చేయమని అధిష్టానాన్ని ప్రోత్సహించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. వారి కారణంగానే నేడు రాష్ట్రం విడిపోతోందని ఆయన ఆరోపించారు.
ఆయన తాజా ఆరోపణలతో రాష్ట్ర విభజనకు కొందరు స్వార్ధపరులయిన సీమాంద్ర కాంగ్రెస్ నేతలే ప్రధాన కారకులని అర్ధం అవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి డిల్లీ వరకు ఒక్కో నేత ఒక్కో కారణమెందుకు చెపుతున్నట్లు? రాష్ట్ర విభజన ప్రతిపక్షాలిచ్చిన లేఖలే కారణమంటూ ఎందుకు నిందిస్తున్నట్లు? ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రోత్సహించింది ఎవరు? ఈ సంగతి తెలిసి ఉండి కూడా ఇంతకాలం కావూరి ఎందుకు దాచిపెట్టినట్లు? ఇప్పుడే ఎందుకు బయటపెడుతున్నట్లు?
కాంగ్రెస్ నేతలకు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్రం ముఖ్యం కాదని కావూరి మాటలు నిర్దారిస్తున్నాయి. వారి రాజీనామాల డ్రామాలలాగే, వారి సమైక్యాంధ్ర డ్రామాలు కూడా సాగుతున్నాయి నేటికీ.