మోడీపై కాంగ్రెస్ నేతల విమర్శలు
posted on Oct 30, 2013 @ 12:41PM
మొన్న ప్రధాని డా.మన్మోహన్ సింగ్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీల మధ్య అహ్మదాబాద్లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పై మొదలయిన చర్చకి కాంగ్రెస్ నేతలు కొసర్లు వేయడం మొదలుపెట్టారు. వరుస కుంభకోణాలతో, ఉగ్రవాదుల దాడుల వల్ల మసకబారిన తమ కాంగ్రెస్ ప్రతిష్టని కప్పిపుచ్చుకొంటూ, ప్రజలని పక్కదారి పట్టించే ప్రయత్నంలో మోడీపై దాడి మొదలుపెట్టారు.
"బీజేపీ వల్లభ్ భాయ్ పటేల్ వారసత్వం స్వంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ లౌకిక వాది అయిన పటేల్ అసలు సిసలు కాంగ్రెస్ వాది కూడా అని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. అసలు గాంధీ మహాత్ముడిని చంపిన ఆర్ఎస్ఎస్ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందని పటేలే ఆర్ఎస్ఎస్ ను నిషేదించారు. మరి మోడీ దీనికి ఏమని జావాబు చెబుతారని ఆయన ప్రశ్నించారు.
“అసలు మోడీ ఏవిధంగా తనను తాను వల్లభ్ భాయ్ వారసుడిగా ఆవిష్కరించుకోవాలని చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన వారసుడిగా మోడీ తనను తాను అవిష్కరించుకోవాలని ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు,” అని కేంద్ర మంత్రి మనీశ్‌తివారీ స్పష్టం చేశారు.
మోడీని విమర్శించడంలో ఎప్పుడు ముందుండే దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, “గతంలో వాళ్ళు (బీజేపీ) అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని సేకరించిన ఇటుకలను అమ్మేసుకొన్నారు కానీ ఐదేళ్ళు దేశాన్ని పాలించినా వాళ్ళు ఆలయం మాత్రం నిర్మించలేదు. ఇప్పుడు పటేల్ విగ్రహ స్థాపన కోసం ఇనుము సేకరిస్తున్నారుట! రేపు దానిని కూడా అమ్మేసుకొంటారేమో?” అని వ్యంగంగా ఎత్తిపొడిచారు.
ఒకవైపు మహానీయుల పేరుప్రతిష్టలను,వారి వారసత్వాన్ని స్వంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్న ఈ నేతలు వారి ఆలోచనలను, ఆశయాలను, వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని గానీ ఏమాత్రం ఆచరించలేక కనీసం అనుకరించలేక ఇలా చాలా లేకిగా వారి వారసత్వం కోసం వాదులాడుకొంటూ, ఆ మహానీయులతో తామెన్నడు సరితూగలేమని స్వయంగా వారే వారి మాటలతో, ప్రవర్తనతో చాటి చెప్పుకొంటున్నారు.