విమర్శకులకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..

తెలుగు దేశం పార్టీ పుట్టింది హైదరాబాద్లోనే అని.. నా మనసుకు దగ్గరగా ఉన్న నగరం హైదరాబాద్ అని చంద్రబాబు అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సనత్‌నగర్ పాటిగడ్డ ప్రచారంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనపై విమర్సలు చేసిన వారికి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో నాకేం పని అంటూ కొందరు అంటున్నారు.. గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాను.. ఏపీ రాజధాని అభివృద్ధి నిమిత్తం అక్కడికి వెళ్లి పాలన చేస్తున్నాను..అంతేకాని ఇక్కడ ఎవరికో భయపడి వెళ్లడంలేదు అని ఘాటుగా సమాధానమిచ్చారు. అలాగే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు వచ్చాయంటే అది నా చొరవేనని, హైదరాబాద్‌లో గల్లిగల్లిలో సీసీ రోడ్లు వేయించానని..టీడీపీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ నగరంలో ఫ్లై ఓవర్లు కట్టించింది తానేనని తెలిపారు.

పెరుగుతున్న సోలార్ స్కాం హీట్..

కేరళ సీఎం ఊమెన్‌ చాందీ సోలార్ స్కామ్ లో ఇప్పటికే పీకల్లోతు ఉచ్చులో కూరుకుపోయారు. ఇప్పటికే ఈ స్కాంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ సీఎంకు రూ.కోటి తొంభై లక్షలు ఇచ్చానని చెప్పడంతో సీఎంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడు కేరళ రాష్ట్రం సోలార్ స్కామ్ హీట్ తో వేడెక్కిపోయింది. మరోవైపు సీపీఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. సీఎం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్‌ ను చుట్టుముట్టారు. దీంతో వారిని అడ్డుకోవడానకి వచ్చిన పోలీసులపై కూడా కార్యకర్తలు రాళ్ళు విసరడంతో వారిని చెల్లాచెదురు చేయడానికి.. పోలీసులు బాష్పవాయు గోళాలు, లాఠీలు ఉపయోగించారు. మొత్తానికి సీఎం సోలార్ స్కాం వ్యవహారంతో రాష్ట్రం హీటెక్కిపోతుంది.

రేవంత్ రెడ్డి నయా సమాచారం..

తెలంగాణలో అధికార పార్టీని కానీ.. పార్టీ అధినేతని కానీ ఘాటూగా విమర్శించాలంటే మాత్రం టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా. ఆయన చేసే విమర్శలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. రేవంత్ రెడ్డి గతంలో కేటీఆర్.. హరీశ్ ల మధ్య ఉన్న బేధాభిప్రాయాల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కూడా మరోసారి కేటీఆర్.. హరీశ్ రావుల మధ్య విభేధాల గురించి ప్రస్తావించారు. కేటీఆర్..హరీశ్ రావుల మధ్య పంచాయితీ ఉందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు మరో కొత్త విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. అది కేసీఆర్ ఫ్యామిలీలో లుకలుకలు ఉన్నట్టు. దీనికి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి కేటీఆర్..కవిత.. కేసీఆర్ చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవటమే నిదర్శనం అని అన్నారు. మరి రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో ఎంత వరకూ నిజముందో.. రేవంత్ రెడ్డి మాటలకు ఆపార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

పార్టీ మారినా చంద్రబాబు అంటే ఇష్టమంటున్న ఎమ్మెల్యే..

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు టీడీపీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా కూడా తనకు చంద్రబాబు అంటే ఇష్టమని చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పక్క పార్టీల నేతలను తిట్టడం కామన్. అలాగే ప్రచారంలో పాల్గొన్న కృష్ణారావు కూడా అందరి పార్టీ నేతలపై విమర్శలు చేశారు. మొన్నటి వరకూ ఉన్న టీడీపీ పార్టీ నేతలపై కూడా విమర్శలు గుప్పించారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడిపై మాత్రం ఆయన ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ఇదే విషయాన్ని అడుగ్గా.. దీనికి ఆయన టీడీపీ పార్టీలో నేను పాతికేళ్లు పనిచేశాను.. చంద్రబాబు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమని అన్నారు. అంతేకాదు చంద్రబాబు పాదయాత్రకు 250 మంది కార్యకర్తలతో రాష్ట్రం అంతటా తాను కూడా తిరిగాను.. నాకు టికెట్ ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు.. కానీ ఆఖరికి టిక్కెట్ ఇచ్చారని అన్నారు. ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా కృష్ణారావు క‌టౌట్లలో కూడా కొంద‌రు చంద్ర‌బాబు ఫొటోను పెడుతున్నార‌ట‌. దీనిపై కూడా ఆయ‌న ఏమీ అన‌డం లేదట. మరి ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

అటు కేటీఆర్.. ఇటు లోకేశ్.. మధ్యలో అనుసూయ

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అన్నీ పార్టీలు తమ జెండాలతో ప్రచారం చేయడంలో మునిగిపోయాయి. ఇతర పార్టీ నేతలపై కామెంట్లు, కౌంటర్లు వేసుకుంటూ పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి పార్టీలన్నీ. అయితే అందరి ప్రచారం సంగతి పక్కన పెడితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో యువనేతలు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తనయులు కేటీఆర్, లోకేశ్ ల మధ్య జరుగుతున్న వార్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే ఇద్దరూ చాలా తెలివిగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనే లోకేశ్ అధికార పార్టీపై విమర్శలు చేయగా.. దానికి కేటీఆర్.. లోకేశ్ ను తమ్ముడూ అంటూనే చురకలు అంటించారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ జరుగుతుంది. అది కూడా ఒక అనసూయ అనే మహిళ వల్ల.. ఆమెకు వీరిద్దరికీ సంబంధం ఏంటంటారా.. లోకేశ్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా అనసూయ అనే మహిళ ఆయన వాహనం వద్దకు వచ్చి తనను ఆదుకోవాలని కోరిందట. దీనికి గాను లోకేశ్ కేటీఆర్ కు ట్వీట్ చేశారట.  ‘‘అనసూయ అనే మహిళ పొరపాటున నన్ను మీరనుకుంది..తనను ఆదుకోవాలని నా వాహనం ముందు నిలిచింది..మిమ్మల్ని కలిసి తన గోడుకు చెప్పుకొనే మరో మార్గం లేకనే ఇలా చేసింది’’ అని ట్వీట్‌ చేశారు. దీనికి కేటీఆర్ స్పందించి.. ‘‘బ్రదర్‌ సంతోషం.. రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న పార్టీతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిసే ఆమె ఇలా చేశారని అర్థం చేసుకోగలరు. ఆమెను తప్పకుండా ఆదుకుంటాం. అనసూయే కాదు… ఆమెలాంటి మహిళలందరినీ ఆదుకుంటాం. ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు’’ అని జవాబిచ్చారు. అంతేకాదు లోకేశ్ కు గుడ్ లక్ కూడా చెప్పారంట. మరి కేటీఆర్ ట్వీట్ కు లోకేశ్ ఎలా రీ ట్వీట్ ఇస్తారో చూడాలి.

రైల్వేశాఖ కొత్త నిర్ణయం.. టికెట్ల విషయంలో కూడా..

రైల్వేశాఖ ఈసారి మరో తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్న రైల్వేశాఖ మరో నిర్ణయం తీసుకొని ప్రయాణికులకు షాకిచ్చింది. అదేంటంటే.. సాధారణంగా ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఇప్పటివరకూ మనకు ఐఆర్ సీటీసీ ద్వారా చేసుకునే వీలుంది. అది అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు టికెట్ బుక్ ఫెసిలిటీ పై కూడా ఆంక్షలు విధించింది రైల్వేశాఖ. మామూలుగా అయితే ఇప్పటివరకూ నెలకు పది టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.. కానీ ఫిబ్రవరి 15 నుంచి వెబ్ సైట్ ద్వారా కేవలం ఆరు టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేసుకునే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయంతో ప్రజలు రైల్వేశాఖ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఒకవేళ ఎక్కువ టిక్కెట్లను కొనుగోలు చేయాల్సివస్తే అప్పుడు పరిస్థితి  ఏంటని.. రైళ్లలో సౌకర్యాలు సరిగా చూసుకొని రైల్వేశాఖ.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ముందుంటుందని అంటున్నారు. మరి రైల్వేశాఖ ఇప్పటికైనా ప్రయాణికులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవడం మానుకుంటుందో లేదా తమ పని తాము చేసుకుంటూ పోతుందో చూడాలి.

మరోసారి హెచ్ సీయూకి రాహుల్..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి రానున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ యూనివర్శిటీలో రోహిత్ అనే విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నసంగతి తెలిసిందే. అప్పుడు విద్యార్ధులను, రోహిత్ తల్లి దండ్రులను పరామర్శించడానికి వచ్చాడు రాహుల్ . మళ్లీ ఇప్పుడు రాహుల్ మరోసారి హెచ్ సీయూకి రానున్నారు. రేపు రోహిత్ జన్మదినం కావడంతో క్యాంపస్ లో విద్యార్ధులు హంగర్ స్ట్రైక్ నిర్వహిస్తున్నారు. దీంతో రాహుల్ ఈ అర్ధరాత్రి నుండి రేపు సాయంత్రం వరకూ రోహిత్ కుటుంబ సభ్యులతో కలిసి దీక్షలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా యూనివర్శిటిలో ఇంకా ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి.

మళ్లీ పొగిడేసిన జానారెడ్డి..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి ప్రతిపక్ష పార్టీని పొగడటం కొత్తేమి కాదు. గతంలో ఈయన ప్రతిపక్షపార్టీలను పొగడటం.. దానికి పార్టీనేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం అన్నీ జరిగాయి. అయితే మళ్లీ ఇప్పుడు జానాసాబ్ ప్రతిపక్ష పార్టీని పొగిడేసి తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నారు. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ విషయంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై.. రూ.5 భోజనం పథకాన్ని మెచ్చుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేసిన రూ.5 భోజనం నాణ్యత ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు గురువారం సీఎల్పీ సిబ్బంది చేత ప్రత్యేకంగా తెప్పించుకున్న జానాసాబ్ దీని నాణ్యత గురించి, రుచి గురించి తెగ పొగిడేశారంట. అంతేకాదు ఈ పథకం మంచిగా అమలవుతుందని కూడా కితాబు ఇచ్చారంట. దీంతో అసలే ఎన్నికల వేళ జానారెడ్డి ఇలా వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ నేతలు అతినిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దేనికైనా సమయం, సందర్భం ఉండాలి అంటూ జానాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో తాత్కాలిక సెక్రటేరియట్..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది జూన్ కల్లా ఏపీకి రావాలని గతంలో ఆదేశించిన సగంతి తెలిసిందే. అయితే ఉద్యోగులు రావడానికి సిద్దంగా ఉన్నా ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో వారు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో తాత్కాలిక సెక్రటేరియట్ సిద్దం చేసేందుకు ప్రభుత్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. మొత్తం ఆరు బ్లాకులుగా.. జీ ప్లస్ 7 విధానంలో డిజైన్ చేస్తున్న ఈ భవనాన్ని మే రెండో వారానికి 6 లక్షల చదరపు అడుగుల స్థలం వినియోగించేందుకు వీలుగా సిద్ధం చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. కాగా ఈ భవనంలో కనీసం 6750 మంది వరకూ కూర్చొని పని చేసుకునే విధంగా తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు.

కేసీఆర్ ప్రచారం చేస్తే ట్రాఫిక్ జాం అవుతుందట..!

తెలంగాణ సీఎం మాటలు చెప్పడంలో దిట్ట అని అందరికి తెలిసిందే. ఆయన మాటలతోనే అందరిని ఓడించేస్తారు. అలాంటి వాక్చాతుర్యం ఉంది కేసీఆర్ కి. అది ఇంకోసారి నిరూపించారు కేసీఆర్. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఎక్కడ చూసినా పార్టీలు ప్రచారాలతో బిజీగా ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రచార బాధ్యతలు మొత్తం కేటీఆర్ తీసుకొని నడిపిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం గురించి మీడియా సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ ను విలేకరులు ఒక ప్రశ్న అడిగారంట.. అదేంటంటే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మీరెందుకు పాల్గొనడంలేదు. దానికి కేసీఆర్ తాను ప్రచారం చేస్తే  ట్రాఫిక్ జాం అవుతుందని.. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసమే తాను ప్రచారం చేయటం లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చెప్పిన మాటకు అందరూ షాకయ్యారంట. మొత్తానికి తన కొడుకు సామర్థ్యం ఈ ఎన్నికల ద్వారా తెలుసుకుందామని  గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లిట్మస్ టెస్ట్ మాదిరిగా చూసుకుంటున్న కేసీఆర్ అసలు విషయం చెప్పలేక ఇలాంటి సాకు చెప్పినట్టు తెలుస్తోంది.

తెలంగాణను ఎవరూ విడదీయలేరు.. చంద్రబాబు

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రచారంలో పాల్గొన్నారు. పటాన్‌చెరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ  టీడీపీతో తెలంగాణను ఎవరూ విడదీయలేరని వ్యాఖ్యానించారు. బ్రిటష్ వాళ్లు, నిజాంలు వందల సంవత్సరాలు హైదరాబాద్ ను పాలించారు.. కానీ నేను అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలతో ప్రపంచ పటంలో హైదరాబాద్ కు స్థానం కల్పించా అని అన్నారు. అంతేకాదు హైదరాబాద్‌లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని, దీనివల్ల 14 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని.. హైదరాబాద్‌ వల్ల తెలంగాణకు ఎక్కువ లాభం వచ్చిందని, ఔటర్‌ రింగురోడ్డు, మెట్రోరైలు ఘనత టీడీపీదేనని, 12 ఏళ్లయినా మెట్రో పనులు పూర్తి కాలేదని, అదే తాము మేము గెలిచి ఉంటే మూడేళ్లలో పూర్తిచేసే వాళ్లమని అన్నారు. అలాగే హైదరాబాద్‌లో అడుగడుగునా నేను చేసిన అభివృద్ధి ఉందని, నేను ఎక్కడికీ వెళ్లలేదు.. ఇక్కడే ఉంటా.. మీతోనే ఉంటా అని అన్నారు.

ఒక్క దోమ.. 2018 వరకూ గర్భధారణ లేకుండా చేసింది..!

ఒకప్పుడు ఎబోలా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో ఇప్పుడు ఇంకో వైరస్ పేరు చెబితేనే వణికిపోతున్నారు బ్రెజిల్ దేశస్థులు. అదే జైకా వైరస్. రోజు.. రోజుకీ ఈ వైరస్ ప్రభావం ఎక్కువతుందే కానీ తగ్గడంలేదు. అసలు ఈ జైకా వైరస్ కు కారణం ఎజెపి దోమ. ఈ దోమ కుట్టడం ద్వారా వైరస్ వ్యాపించి.. జ్వరంతోపాటు డెంగీ, చికున్‌ గున్యా, యెల్లో ఫీవర్‌ వంటి వ్యాధులు కూడా విస్తరిస్తాయి. అంతేకాదు అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. గర్భిణీ స్త్రీలకు ఈ వైరస్ రావడం వల్ల పుట్టే పిల్లలకు జన్యుపరమైన లోపాలు రావడం.. పిల్లలకు శారీరక పెరుగుదల ఉండకపోవడం.. చిన్నచిన్న తలలుగా పుట్టడం వంటివి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. మరోపక్క ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అవి విఫలమవుతున్నాయి. దీంతో చేసేది లేక ఈ సమస్య పూర్తిగా సమసిపోయేంత వరకూ గర్భధారణకు దూరంగా వుండాలని.. 2018 వరకూ స్త్రీలు గర్భం దాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఎల్‌సాల్వడార్‌, కొలంబియా, బ్రెజిల్‌ ప్రభుత్వాలు మహిళలకు సూచిస్తున్నాయి. అంతేకాదు ఈ వైరస్ చిన్నచిన్నగా బ్రెజిల్‌తో పాటు పలు లాటిన్‌ అమెరికా దేశాలలో ఈ వైరస్‌ విస్తరించటంతో ఇది అంతర్జాతీయ సమస్యగా మారింది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి అధికారులు తొందరగా మేల్కొని దీనికి తగిన చర్యలు తీసుకొని ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్త్తుంది.

పురంధరేశ్వరికి చంద్రబాబుపై కోపం పోయిందా..?

బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి.. చంద్రబాబుకి మధ్య ఉన్న బేధాభిప్రాయల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీజేపీ-టీడీపీ మిత్రపక్షాలు అయినప్పటికీ.. బీజేపీ పార్టీ నుండి టీడీపీ నేతలను కాని.. ఆఖరికి పార్టీ అధినేత చంద్రబాబును కాని విమర్శించడంలో పురంధరేశ్వరీ ఎప్పుడూ ముందుంటారు. అయితే గత కొద్ది రోజుల నుండి మాత్రం పరిస్థితి మారింది. ఎప్పుడూ చంద్రబాబు మీద విరుచుకుపడే పురంధరేశ్వరీ ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు. అంతేకాదు ప్రస్తుతం గ్రేటర్లు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో జోరుమీదుండగా.. బీజేపీకి టీడీపీ పార్టీల తరుపున ఆమె ప్రచారానికి దిగారు. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పురంధరేశ్వరీకి చంద్రబాబు మీద ఉన్న కోపం పోయిందా అని మాట్లాడుకునే వారు కూడా ఉన్నారు. కాగా ప్రచారంలో ఆమె మాట్లాడుతూ అభివృద్ధి విషయం దగ్గరికి వచ్చే సరికి టి ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మాటలతోనే సరిపెడుతున్నారని.. అభివృద్ధి మాత్రం జరగడం లేదని ఆమె వాపోయారు. అభివృద్ధి ఎవరు చేశారో చూసి ఓటెయ్యాలని ఆమె కోరారు. ఇదిలా ఉండగా పురంధరేశ్వరీ చంద్రబాబు విషయంలో ఏమనకుండా ఉండటానికి గల కారణం రాజ్యసభ సీటు కోసమే అని కూడా గుసగుసలాడుకుంటున్నారు. మరి ఏది నిజమో ఆమెకే తెలియాలి.

కాంగ్రెస్ కు అంత సీన్ లేదంటున్న తలసాని..

ఎన్నికల సమయంలో పార్టీ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు మామూలే. మీరు ఎన్నికల్లో విజయం సాధిస్తే నేను పార్టీకి రాజీనామా చేస్తా అని ఒకరంటే.. మీరు గెలిస్తే మేం రాజీనామా చేస్తాం అంటూ పోటాపోటీగా సవాళ్లు విసురుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల సందర్బంగా ఆ సవాళ్లు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పుటికే కేటీఆర్, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి లాంటి ముఖ్య నేతలు సవాళ్లు విసిరారు. ఇప్పుడు వారి జాబితాలో తలసాని కూడా చేరిపోయారు. ఈసారి తలసాని కాంగ్రెస్ పార్టీపై సవాల్ విసిరారు. గ్రేటర్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అంతేకాదు హైదరాబాద్ ను తామే అభివృద్ధి చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు అని ఎద్దేవ చేశారు. మరి తలసాని సవాల్ కు కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ గెలుపు కోసం చాలా కష్టపడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా కృషిచేస్తోంది. ఎన్నికల బాధ్యతను మొత్తం తన భుజాల మీద వేసుకొని కేటీఆర్ ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ఇక మిత్రపక్షమైన టీడీపీ బీజేపీ.. టీఆర్ఎస్ కూడా బానే కష్టపడుతున్నాయి. మరి ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.

కేరళ సీ.ఎం చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

సోలార్‌ స్కామ్‌లోని పాపాలు ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ మెడకి చుట్టుకుంటున్నాయి. స్కామ్‌లోని ముఖ్య పాత్రధారి సరితానాయర్‌ తాను ముఖ్యమంత్రికి రెండు కోట్లు ముట్టచెప్పానని కుండబద్దలుకొట్టడంతో చాందీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. సరితా నాయర్‌, ఆమెతో సహజీవనం చేస్తున్న రాధాకృష్ణ కలిసి 2011లో సౌర విద్యుత్తుకి సంబంధించి ఒక సంస్థను నెలకొల్పారు. భవిష్యత్తలో ప్రభుత్వం స్థాపించే సౌర విద్యత్‌ ప్రాజెక్టులన్నీ తమకే వస్తాయని చెప్పి వీరిద్దరూ జనాల దగ్గర్నుంచీ కోట్లాది రూపాయలు దండుకున్నారు. దీనికి ఉమెన్‌ చాందీ సహకారం ఉందన్నదే ఇప్పుడు ప్రధాన ఆరోపణ. తన పేరు వాడుకున్నందుకు ఉమెన్‌ చాందీకి కావల్సినంత సొమ్ము ముట్టిందట! దానికి తోడు ఉమెన్‌ చాందీ లై డిటెక్టరు పరీక్షలను కూడా నిరాకరించడంతో విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. మరోవైపు ఉమెన్‌ చాందీకి సానుభూతి చూపిస్తున్నవారికి కూడా కొదవ లేదు. రాజకీయాలలో వేల కోట్లు హరాయించేసుకున్నవారే దర్జాగా బతుకుతుంటే, ఆఫ్టరాల్‌ రెండు కోట్ల కోసం ముఖ్యమంత్రి అంతటివాడిని ఇబ్బంది పెడతారా అని సదరు సానుభూతిపరులు జాలిపడుతున్నారు!

చంద్రబాబుకి విధేయుడిని.. పార్టీకి కాదు.. జేసీ

  కొన్ని రోజుల నుండి సైలెంట్ గా ఉన్న తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనని పిలిచి టికెట్ ఇచ్చారని.. చంద్రబాబుకు విజన్ ఉందని.. అలాంటి చంద్రబాబుకు మాత్రమే నేను విధేయుడిని కానీ పార్టీకి కాదని ఆయన అన్నారు. అంతేకాదు గత శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఆయన స్పందిస్తూ రోజా అసెంబ్లీలో ఉండటం దురదృష్టకరమని, ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు బాధపడుతున్నానని అన్నారు. ఎంతో హుందాగా, క్రమశిక్షణగా నడుచుకోవాల్సిన సభ్యులు పోడియం వద్దకు వెళ్లి గొడవచేసే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వోద్యోగే- కానీ పర్వతం ఎక్కడంలో రికార్డు!

ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక ఐపిఎస్‌ అధికారి. శాంతిభద్రతలను కాపాడటంలో నిరంతరం తలమునకలై ఉంటారు. కానీ ఏమాత్రం అవకాశం చిక్కినా తనకు ఇష్టమైన పర్వతారోహణకు సిద్ధమైపోతారు. మనసులో ఆసక్తి ఉండాలే కానీ అనుకున్నది సాధించడానికి స్త్రీ, పురుషులన్న వివక్ష కానీ, ఉద్యోగబాధ్యతలు కానీ అడ్డురావని నిరూపిస్తున్నారు అపర్ణ కుమార్‌. గత వారం అంటార్క్‌టికాలోని మౌంట్‌ విన్సన్‌ అనే 17,000 పర్వతాన్ని అధిరోహించిన అపర్ణ, ఆ పర్వతాన్ని ఛేదించిన తొలి భారతీయ ఉద్యోగిగా రికార్డు సాధించారు. ఇంతేకాదు! మౌంట్‌ విన్సన్‌ని అధిరోహించడంతో ప్రపంచంలోని 7 అతి క్లిష్టమైన పర్వతాలుగా భావించేవాటిలో 5 పర్వతాలను ఆమె అధిరోహించినట్లు అయింది. సాహసమే జీవితంగా గడిపిన అపర్ణకు గత ఏడాదే ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ‘రాణి లక్ష్మిబాయ్‌ పురస్కార్‌’ను అందించింది. ఆ పురస్కారాన్ని మరోసారి సార్థకం చేసుకుంది అపర్ణ. ఇక తన తదుపరి లక్ష్యం ఎవరెస్టు పర్వతమే అంటోంది!