ఆర్‌. కృష్ణ‌య్య‌కు ఆ విష‌యం తెలియ‌దా!

తుని సంఘ‌ట‌న మీద బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణ‌య్య చాలా చిరాకుప‌డిపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కాపుల‌ను బి.సిలలో చేర్చితే మిగ‌తా బి.సి.ల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని, అందుక‌ని వారి డిమాండ్‌కి త‌ల ఒగ్గ‌ద్ద‌నీ ఆయ‌న చంద్ర‌బాబు నాయుడుని హెచ్చ‌రిస్తున్నారు కృష్ణ‌య్య‌. మ‌రి తెలుగుదేశం, కాపుల‌ను బి.సిల‌లోకి చేర్చేందుకు కృషి చేస్తామ‌ని త‌న మ్యానిఫెస్టోలో చెప్పింది క‌దా! అదే మ్యానిఫెస్టోతో అంద‌రూ ఎన్నిక‌ల‌కి దిగారు క‌దా! ఆ రోజున కిమ్మ‌న‌కుండా ఉన్న కృష్ణ‌య్య‌గారు ఈ రోజున ఎందుకు కోప‌గించుకుంటున్నారంటూ తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. కృష్ణయ్య‌గారు తెదెపా త‌ర‌ఫు నుంచి ఎల్‌.బి.న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ప్ర‌స్తుత తెలంగాణ శాస‌న‌స‌భ్యులుగా ఉన్నారు. ఆయ‌న మొద‌టి నుంచీ కాపుల‌ని బి.సి.ల‌లోకి చేర్చేకూడ‌దంటూ త‌న నిర‌స‌న గ‌ళాన్ని వినిపిస్తూనే ఉండేవారు. కాక‌పోతే ఎన్నిక‌ల స‌మ‌యంలో కాస్త శాంతించి ఉంటారంతే.

"తుని" వెనుక సంఘ విద్రోహులు.. పవన్

ముద్రగడ చేపట్టిన కాపు ఐక్య గర్జనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ తుని ఘటన దురదృష్టకరమని.. ఇది తనను ఎంతో బాధించిందని అన్నారు. లక్షలమంది ఒకచోట గుమిగూడుతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో.. తగినంత బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేయలేదో తనకు అర్ధం కావడంలేదని అన్నారు. రాజకీయ పార్టీలు బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. నిన్నటి హింసాత్మక ఘటనల వెనుక ఖచ్చితంగ సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉంది. ఈ సమస్య ఎప్పటినుండో ఉంది.. ఒక్కరోజులో తీరేది కాదు.. తెలంగాణ, ఉత్తరాంధ్రలో కాపులు బీసీలుగా ఉన్నారు.. రాయలసీమ కోస్తాంద్రాలో మాత్రమే కాపులు ఓసీలుగా ఉన్నారని అన్నారు.. 

అప్ఘనిస్థాన్లో బాంబు పేలుడు.. ఈజిప్టులో కూడా..

ఈ ఒక్కరోజే పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో పార్లమెంటు భవనం సమీపంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈజిప్టులో రెండు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈజిప్టులోని రఫా ప్రాంతంలో భద్రతా సిబ్బంది పోలీసు వాహనంలో వెళుతుండగా బాంబు పేలుడు సంభవించింది. ఈఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో ప్రాంతం ఉత్తర సినాయ్‌ లో కూడా బాంబు పేలుడు సంభవించింది. షేక్‌ జువాయిడ్‌ పట్టణంలో సైనికాధికారులపై దుండగులు బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో  ఇద్దరు సైనికాధికారులు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యాయి.

చంద్రబాబుది క్రిమినల్ బుర్ర.. జగన్

ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జన పై వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్సల బాణాలు వదిలారు. ఘటనపై చంద్రబాబు మాట్లాడిన తీరు తప్పని.. చంద్రబాబు తప్పుచేసి ఇతరలపై నెట్టడానికి చూస్తున్నారని అన్నారు. అంతేకాదు చంద్రబాబు చేసేవన్నీ క్రిమినల్ పనులే అని.. చంద్రబాబుది క్రిమినల్ బుర్ర కాదా? అని మండిపడ్డారు. 1988లో విజయవాడ కాపునాటు మహాసభ జరిగితే ఆనాటి సభను తట్టుకోలేక సభను అడ్డుకున్నారు.. ఇప్పుడు ఈ సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. కాపుల మీటింగ్ సక్సెస్ అయితే తట్టుకోలేకపోతున్నావ్.. మీటింగ్ ఆపేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నావ్ అని ధ్వజమెత్తారు. గతంలో ఎస్సీ కులాల మధ్య చిచ్చుపెట్టావు.. ఇప్పుడు కాపులకు, బీసీలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు అని విమర్శించారు.

అందుకే విరమించాను.. ముద్రగడ

  ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఐక్య గర్జన ఉద్యమంపై రాజకీయ వేడి పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ పలు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సందర్బంగా ముద్రగడ మాట్లాడుతూ కాపు గర్జన సదస్సుపై చంద్రబాబే ఎదురుదాడి చేశారని.. కాపులతోనే ఉద్యమాన్ని నీరుగార్చాలని చూశారని అన్నారు. లక్ష్యాన్ని దెబ్బతీయడానికి అసాంఘిక శక్తులను దింపారు.. టీడీపీ నేతలే విద్వంసానికి దిగారు.. చంద్రబాబు ఆదేశాల మేరకే నిన్న ఘటనలు జరిగాయి అని ఆరోపించారు..అందుకే వెంటనే రాస్తా రోకో విరమించాను అని తెలిపారు. కాపు జాతికి చేతనైన సాయం చేయడానికే ఈ ఉద్యమం చేపట్టాను..మహాత్మా గాంధీ బాటలోనే రిజర్వేషన్ల కోసం తాము శాంతియుత ఉద్యమం తలపెట్టామని అన్నారు. కొన్ని మీడియాలు వంకర రాతలు రాశారు అని మండిపడ్డారు. అంతేకాదు నాలుగైదు రోజుల్లో నేను నాభార్య నిరాహార దీక్షకు పూనుకుంటున్నాం.. తమను అరెస్టు చేసినా పర్వాలేదు.. బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకోము.. జైల్లో ఉండే దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. తమ దీక్షకు మద్దతుగా ఎవరూ కిర్లంపూడి రావొద్దని, ఎవరికి వాళ్లు తమ ఇళ్లలోనే నిరాహార దీక్ష చేయాలని కోరారు. నేను చనిపోయిన తరువాత అయినా సరే రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి అని అన్నారు.

భ‌గ‌త్ సింగ్ మీద పాకిస్తాన్‌లో కేసు!

పాకిస్తాన్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. మొన్న‌టికి మొన్న భార‌త‌దేశ జెండా ఎగుర‌వేశార‌ని విర‌ట్ కోహ్లీ అభిమానికి జైలు శిక్ష విధించారు. ఇప్పుడేమో భ‌గ‌త్ సింగ్‌ని నిర్దోషిగా గుర్తించ‌మంటూ లాహోర్ హైకోర్టులో ఒక కేసు న‌డుస్తోంది. భ‌గ‌త్‌సింగ్‌ని సాండ‌ర్స్ అనే బ్రిటిష్ అధికారి హ‌త్య‌కేసులో 85 ఏళ్ల క్రితం లాహోర్‌లో ఉరితీశారు. అయితే నిజానికి భ‌గ‌త్‌సింగ్ ఆ హ‌త్య చేయ‌లేదనీ అత‌డిని నిర్దోషిగా గుర్తించ‌మ‌నీ ఖురేషీ అనే న్యాయ‌వాది లాహోర్ హైకోర్టులో కేసు వేశారు. దానికి రుజువుగా ఆనాటి ఎఫ్‌.ఐ.ఆర్ కాపీల‌ను కూడా బ‌య‌ట‌కు తీయించారు ఖురేషీ. ఆనాటి ఎఫ్ఐ.ఆర్‌లో భ‌గ‌త్‌సింగ్ పేరుని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. భ‌గ‌త్ సింగ్ గొప్ప దేశ‌భ‌క్తుడేకానీ హంత‌కుడు కాదంటారు ఖురేషీ. భ‌గ‌త్‌సింగ్‌ని ఇప్పుడు న్యాయ‌స్థానం నిర్దోషిగా గుర్తిస్తే ఆయ‌న‌ప‌ట్ల పాకిస్తాన్ ప్ర‌జ‌ల్లో మ‌రింత గౌర‌వం పెరుగ‌తుంద‌నీ, ఏమైనా అవార్డులూ గట్రా ఇవ్వాల‌నుకుంటే కూడా నిర్భ‌యంగా ప్ర‌క‌టించ‌వచ్చ‌నీ ఖురేషీ ఆశ‌. మ‌రి కోర్టు ఆయ‌న వాద‌న‌తో ఎంత‌వ‌ర‌కు ఏకీభ‌విస్తుందో చూడాలి మ‌రి!  

మళ్లీ బాంబు బెదిరింపు

అస్ట్రేలియా రాజధాని సిడ్నీలోని పాఠశాలలకు మరోసారి బెదిరింపు కాల్స్ రావడంతో పాఠశాలలను మూసేశారు. గంతలో కూడా క్రిస్మస్‌ సెలవుల తర్వాత ఇలాగే బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి బెదిరింపు కాల్స్ రావడంతో అధికారులు పాఠశాలలను ఖాళీ చేయించి.. స్కూళ్ల నుంచి విద్యార్థులను పంపేసి.. 8 పోలీసు బృందాలు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. బెదిరింపు కాల్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం చాలా తీవ్రమైన నేరమని, కాల్స్‌ చేసే వారినందరినీ కచ్చితంగా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఐసిస్.. బాంబుల తయారీలో అగ్గిపుల్లల మందు..

ఎన్ఐఏ ఇటీవలే ఐఎస్ఐఎస్ లో చేరినట్లు అనుమానించి16 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిని విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. అవేంటంటే.. ఉగ్రవాదులు గత ఏడు నెలలుగా అగ్గిపుల్లల్లోను, దీపావళి టపాసుల్లోను ఉపయోగించే రసాయనాలు సేకరించి.. వాటితో బాంబులు తయారుచేస్తున్నారట. అంతేకాదు వారి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్న బాంబులలో ఈ రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. సాధారణంగా అగ్గిపుల్లల చివర ఉండే మందులో పొటాషియం క్లోరేట్‌ను వాడతారు.. దీపావళి సామగ్రి తయారీలో పొటాషియం నైట్రేట్‌ను వాడతారు. వీటి ద్వారా తయారు చేసిన బాంబులను పలు చోట్ల దాడులకు ఉపయోగించాలని చూస్తున్నారట. అంతకుముందు అమోనియం నైట్రేట్‌ను ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. తర్వాతి కాలంలో దాని అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణలు విధించింది. దాంతో ఇప్పుడు ఈ పదార్థాలపై ఉగ్రవాదుల కన్నుపడింది.

శశిథరూర్ కి లై డిటెక్టర్ పరీక్ష..!

సునంధ పుష్కర్ హత్యలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈమె విషంతో చనిపోయింది అని ఎయిమ్స్  వైద్యులు వెల్లడించారు. దీంతో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చిక్కులో పడ్డారు. మరోవైపు ఈయనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఢిల్లీ పోలీసులు థరూర్ను విచారించడంతో పాటు ఆయనకు సత్యశోధన పరీక్షలు నిర్వహించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన కీలక వ్యక్తులను పోలీసులు మరోసారి విచారించారు. శశి థరూర్ డ్రైవర్ బజరంగి, సహాయకుడు నరైన్ సింగ్, థరూర్ కుటుంబ స్నేహితుడు సంజయ్ దేవన్, సునందను పరీక్షించిన వైద్యుడిని పోలీసులు ప్రశ్నించారు.

"కాపు ఐక్య గర్జన" కాక.. చంద్రబాబు ఫైర్

ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఐక్య గర్జన ఉద్యమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పద్మనాభం ఆందోళనకారులకు రైలు, రాస్తారోకోలు పిలుపు నివ్వడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రత్నాచల్ అనే రైలును కూడా ఆందోళన కారులు తగలబెట్టారు. అంతేకాదు పలు పోలీసులు వాహనాలు కూడా దగ్గమయ్యాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మరోవైపు ఈ రోజు కూడా పద్మనాభం  3 గంటలకు ముద్రగడ పద్మనాభం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రంలోగా కాపులను బీసీల్లో చేరుస్తూ జీవో జారీ చేయాలని లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని కూడా ఆయన ప్రకటించారు. ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలు ముందుగా జరుగతాయని ఊహించడంలో నిఘా వర్గాలు వైఫల్యం చెందాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఘా వర్గాలతో పాటు పోలీసులు, మీడియా సైతం కుట్ర జరుగుతోందని అంచనా వేయలేకపోయాయని బాబు అభిప్రాయపడ్డారు. సామాజిక శ్రేయస్సు కోసం తాము ఆలోచిస్తుంటే, కేవలం ఆరేడు వాహనాల్లో వచ్చిన వారు హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. వీళ్లపై పోలీసు చర్యలే ఏకైక మార్గమని అధికారులతో వ్యాఖ్యానించిన చంద్రబాబు, కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే ఆధారాల కోసం వీడియో ఫుటేజ్ లను కూడా పరీక్షించనున్నారు.

కేసీఆర్ పై లోకేశ్ ఫైర్.. మీ సొత్తా? మా సొత్తా?

నిన్నటితో గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆఖరి రోజు కావడంతో పార్టీలన్నీ చాలా పోటాపోటీగా ప్రచారం చేస్తూ.. ర్యాలీలు నిర్వహించాయి. దీనిలో భాగంగానే నారా లోకేశ్  హైటెక్‌ సిటీ నుంచి ఎన్టీఆర్‌ఘాట్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి బుల్లెట్ నడిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు గ్రేటర్‌ ఎన్నికల భయం పట్టుకుందని, అందుకే ఏపీ సీఎం చంద్రబాబుపై చిత్రమైన విమర్శలు చేస్తున్నారన్నారు. అంతేకాదు కేసీఆర్ చంద్రబాబు సతీమణి ఓటు కూడా టీఆర్ఎస్ కే అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో లోకేశ్ ఆ వ్యాఖ్యలపై స్పందించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి గురించి ఇలాంటి అబద్ధం చెప్పడం దారుణం అని ఒక ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి ఇంత అబద్దం ఆడటం దౌర్భాగ్యం అని మండిపడ్డారు. అంతేకాదు.. ఏపీని చంద్రబాబుకు, తెలంగాణను తనకు ప్రజలు ఇచ్చారన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ‘‘ప్రాంతాలేమయినా మీ సొత్తా? మా సొత్తా? అది ప్రజలు ఇచ్చిన తీర్పు'' అని వ్యాఖ్యానించారు.

ముద్రగడ కాపు ఐక్య గర్జన ఉద్యమం..

తూర్పుగోదావరి జిల్లా తునిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జన సభ నిర్వహించారు. కాపులను ఎప్పటినుండో బీసీ వర్గంలోకి చేర్చాలని పద్మనాభం ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రోజు ఐక్య గర్జన సభ నిర్వహించి రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్ తీర్చే వరకూ నిరసన చేపడతామని.. సమీపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు..అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు కార్యకర్తలు రైల్వే ట్రాక్, రోడ్లను దిగ్బంధించడంతో రైళ్లు, వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

అమీర్ వల్ల వెంకయ్య బాధపడ్డారంట..

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అసహనంపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమీర్ చేసిన వ్యాఖ్యలకు గాను అతనిపై చాలా విమర్శలే వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే తను చేసిన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో అనుభవించారు. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించారు. అమీర్ మాటలు తనను చాలా బాధించాయని చెప్పారు. మహారాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఛాత్ర సంసద్ కార్యక్రమంలో ట్విట్టర్ లో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అందులో భాగంగా అమీర్ వ్యాఖ్యలపైనా ఓ ప్రశ్న రాగా అమీర్ తనకు మంచి స్నేహితుడని... కానీ ఆయన ఆ రోజు అన్న మాటలతో తాను బాధపడ్డానని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన అమీర్ వ్యాఖ్యలను పట్టుకుని రాద్ధాంతం చేయబోయిన ప్రతిపక్షాలపై కూడా విమర్శలు చేశారు.

టీడీపీ ర్యాలీలో ఉద్రిక్తం..

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం చేస్తూ చాలా బిబీగా ఉన్నాయి. అందునా ఈరోజు ప్రచారానికి ఆఖరికి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. అయితే టీడీపీ నేత రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల నుండి ముందస్తు అనుమతి లేదని.. ర్యాలీని నిర్వహించడానికి కుదరదని..  పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. మరోవైపు టీడీపీ నేతలు ఈ ఘటన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఆదేశాల మేరకే పోలీసులు తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం అయిదు గంటల లోపు అభ్యర్థులు ప్రచారం ముగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి అన్నారు. ఎస్సెమ్మెస్‌లు, బల్క్ ఎస్సెమ్మెస్‌లు, టీవీల్లో ప్రచారాలు నిలిపివేయాలన్నారు. ఫిబ్రవరి 2న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహణ జరగనున్నట్లు తెలిపారు.