పార్టీ మారినా చంద్రబాబు అంటే ఇష్టమంటున్న ఎమ్మెల్యే..
posted on Jan 29, 2016 @ 3:21PM
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీడీపీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా కూడా తనకు చంద్రబాబు అంటే ఇష్టమని చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పక్క పార్టీల నేతలను తిట్టడం కామన్. అలాగే ప్రచారంలో పాల్గొన్న కృష్ణారావు కూడా అందరి పార్టీ నేతలపై విమర్శలు చేశారు. మొన్నటి వరకూ ఉన్న టీడీపీ పార్టీ నేతలపై కూడా విమర్శలు గుప్పించారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడిపై మాత్రం ఆయన ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ఇదే విషయాన్ని అడుగ్గా.. దీనికి ఆయన టీడీపీ పార్టీలో నేను పాతికేళ్లు పనిచేశాను.. చంద్రబాబు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమని అన్నారు. అంతేకాదు చంద్రబాబు పాదయాత్రకు 250 మంది కార్యకర్తలతో రాష్ట్రం అంతటా తాను కూడా తిరిగాను.. నాకు టికెట్ ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు.. కానీ ఆఖరికి టిక్కెట్ ఇచ్చారని అన్నారు.
ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా కృష్ణారావు కటౌట్లలో కూడా కొందరు చంద్రబాబు ఫొటోను పెడుతున్నారట. దీనిపై కూడా ఆయన ఏమీ అనడం లేదట. మరి ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.