బీజేపీలోకి సుభాష్ చంద్రబోస్ మనమడు..

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. నేతాజీకి సంబంధించిన పలు రహస్య ఫైళ్లను బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకరు బీజేపీలోకి చేరుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. పశ్చిమబెంగాల్ లో ప్రముఖుల కుటుంబాల్లో  బోస్ కుటుంబం కూడా ఒకటి. అలాంటి బోస్ కుటుంబానికి చెందిన.. ఆయన మనవడు అయిన చంద్రకుమార్ బోస్ బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరాడు. ఈ సందర్భంగా బోస్ మనమడు మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చిట్ ఫండ్ పరిశ్రమ మాత్రమే వృద్ధి చెందుతుందంటూ వ్యాఖ్యానించారు.

రాజమౌళి పద్మశ్రీ పై రచ్చ.. కర్ణాటక పుణ్యమా..?

ఒక్క సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన దర్శకుడు ఎవరంటే రాజమౌళి అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అలాంటి దర్శకుడి ప్రతిభకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇక్కడి వరకూ బానే ఉన్నా..ఇప్పుడు ఆ పద్మశ్రీ పై పలువురు పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు రాజమౌళికి పద్మశ్రీ వచ్చిందని సంతోషిస్తుంటే.. అంతలోనే అది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యం కాదని.. కర్ణాటక రాష్ట్రం కారణంగా ఆ పురస్కారం లభించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజమౌళికి ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం వార్తలో బ్రాకెట్ లో కర్ణాటక అని ఉంది. దీంతోనే అసలు రచ్చ మొదలైంది. రాజమౌళికి వచ్చిన పద్మశ్రీ అవార్డు కర్ణాటక ప్రభుత్వం సిఫార్సు చేస్తే వచ్చిందని.. తెలుగు రాష్ట్రాలు మరిచిపోయిన ఈ విషయాన్ని పక్కనున్న కర్ణాటక ప్రభుత్వం పట్టించుకొని ఇప్పించిందని అంటున్నారు. దీనిపై తెలుగు సినీ అభిమానులు కూడా అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిపై రాజమౌళి స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం గత ఏడాదే తమ పేరును ప్రతిపాదించిందని.. కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చిందని అన్నారు. అయినా నేను నాలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డని.. నేను పుట్టింది కర్ణాటకలో.. చదువుకుంది ఏపీలో.. పని చేసింది తమిళనాడులో.. స్థిరపడింది తెలంగాణలో అంటూ చెప్పుకొచ్చారు.

జెండా వందనం సాక్షిగా..కాంగ్రెస్ నేతల కొట్లాట..

కొట్లాటలు - కుమ్ములాటలకు మారుపేరైన కాంగ్రెస్ నాయకులు ఆఖరికి గణతంత్ర దినోత్సవం రోజున కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ ఘటన నల్లొండ జిల్లా భువనగిరిలో జరిగింది. నల్గొండ జిల్లా భువనగిరిలో రిపబ్లిక్ డే సందర్భంగా జెండాను ఎవరు ఎగరేయాలన్న విషయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు మధ్య వివాదం ఏర్పడింది. దీంతో పార్టీ నేతల మధ్య ఘర్ణణ పెరగడంతో కార్యకర్తలు కూడా ఒకరినొకరు దూషించుకుంటూ చొక్కాలు - కాలర్లు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. అంతేకాదు పోలీసు స్టేషన్లో ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ కొట్లాటలో పడి ఆఖరికి అక్కడ జెండా వందనం కూడా చేయకుండానే ఆపేశారు.

అజార్ మీద చేయి పడనీయం – పాక్‌!

భారతదేశం యావత్తునీ కుదిపేసిన పఠాన్‌కోట్ దాడి మీద పాకిస్తాన్‌ మరో సారి తన ద్వంద్వ నీతిని ప్రదర్శించింది. తొలుత ప్రపంచదేశాల ఒత్తిడికి తల ఒగ్గిన పాక్‌, పఠాన్‌కోట్ నిందుతుల తమ దేశంలోనే ఉంటే తప్పక దండిస్తామని చెప్పింది. పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న జైష్‌-ఏ-మహమ్మద్‌ నాయకుడైన మసూద్‌ అజారే ఈ దాడులకి సూత్రధారి అని భారత్‌ తేల్చిచెప్పడంతో పాకిస్తాన్‌కి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. తుపాకుల దగ్గర నుంచి, పాదరక్షల దాకా పఠాన్‌కోట్ వద్ద దొరికిన వందలాది సాక్ష్యాలన్నీ తన వైపు వేలెత్తి చూపడంతో పాకిస్తాన్‌ ఆత్మరక్షణలో పడింది. చివరికి తప్పనిసరి పరిస్థితులలో మసూద్‌ అజార్‌ను అరెస్టు చేశామని పాకిస్తాన్ ప్రకటించినా, ఆ దేశపు చర్యల గురించి రక్షణ నిపుణులు సందేహాస్పదంగానే ఉన్నారు. అందుకు తగినట్లుగానే పాక్ ఆ తరువాత మాట మార్చింది. అజార్‌ను అరెస్టు చేయలేదు, కేవలం పారిపోకుండా నిఘా ఉంచాం అంటూ సెలవిచ్చింది. ఇప్పుడు మరో మెట్టు కిందకి దిగి అజార్‌ను ప్రశ్నించేందుకు భారత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పేసింది. మరో వైపు ఇండియా పఠాన్‌కోట్ సంఘటనను దేశ ప్రతిష్ఠకు సవాలుగా భావిస్తోంది. మసూద్‌ అజార్‌ను అతని సోదరుడు అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌ను ఎలాగైనా దేశానికి రప్పించి శిక్షించాలన్న పట్టుదలతో ఉంది. మసూద్‌ అజార్‌ జైష్‌-ఏ-మహమ్మద్‌ అనే తీవ్రవాద సంస్థను స్థాపించి భారతదేశపు పార్లమెంటు మీద దాడి మొదల్కొని ఇప్పటి పఠాన్‌కోట్‌ దుస్సంఘటన వరకు మన దేశం మీద ఎన్నో దాడులను సాగించాడు. ఈ దాడులకు వెనుక ఉండే ఆలోచన మసూద్‌ అజార్‌దే అయినప్పటికీ వాటిని అమలుపరిచే బాధ్యత మాత్రం తమ్ముడు అబ్దుల్‌ రవూఫ్‌దే! మరి వారిద్దరినీ భారత్‌ శిక్షించగలుగుతుందా? లేకపోతే మరిన్ని దాడులకు సిద్ధపడాల్సి ఉందా? అన్నది ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్న ప్రశ్న! ఆ ప్రశ్నకి జవాబు మాత్రం పాకిస్తాన్‌ దగ్గరే ఉంది.

రిపబ్లిక్ డే వేడుకల్లో కేసీఆర్.. అమర జవాన్ల స్తూపానిని నివాళులు

తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్‌ కవాతు మైదానంలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమర జవాన్ల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ ముఖ్యఅతిథికా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్రమంత్రులు జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రణబ్‌

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈరోజు 67వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా వేడుకలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రాజ్‌పథ్‌కు పలువురు ప్రముఖుల చేరుకున్నారు. భారతదేశ ప్రధమ పౌరుడు..రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ఫ్రాన్స్‌ అధ్యక్షడు హొలాండ్ లు రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. మరోవైపు రాజ్‌పథ్‌ మార్గంలో హెలికాప్టర్ల ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనికుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో 76మంది ఫ్రెంచి సైనికులు కవాతు నిర్వహించారు. టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకు, రాడార్ల ప్రదర్శన ఆకట్టుకుంది. కాగా రాజ్‌పథ్‌వద్ద భద్రతా బలగాలు భారీ స్థాయిలో మోహరించాయి.

హాలీవుడ్ లో అడుగుపెడుతున్న ధనుష్..

భారత దేశంలో పెద్దదైన సినీ పరిశ్రమ బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికే చాలా మంది నటీ నటులు కష్టపడుతుంటారు. అలాంటిది అక్కడ ఈజీగా అరంగేట్రం చేసి ఇప్పుడు ఎంతో మంది కలలు కనే హాలీవుడ్ లోకి కూడా అడుగు పెడుతున్నాడు ఓ కుర్ర హీరో.. అతను ఎవరో కాదు రజనీకాంత్ అల్లుడు, తమిళనాట టాలెంటెడ్ నటుడు ధనుష్. ధనుష్ కు ఈ అరుదైన అవకాశం దక్కింది. త్వరలో ధనుష్ ఓ హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు. "ద ఎక్స్ టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్" అనే సినిమాలో హాలీవుడ్ హీరోయిన్లు ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా దడారియోలతో ధనుష్ జతకట్టనున్నాడు. ఈ సందర్బంగా ఈ చిత్ర డైరెక్టర్ మర్జానే సత్రపి మాట్లాడుతూ ఈ సినిమాలో హీరో కోసం తాను ఎన్నో ఇండియన్ సినిమాలు చూశానని.. అప్పుడే ధనుష్ ని చూశానని.. ధనుష్ అయితే తాను అనుకున్న పాత్రకి సరిగ్గా సరిపోతాడనిపించిందని చెప్పాడు. ఈ సినిమాలో ప్రేమ, సాహసం, అద్భుతాలు కలగలిపి ఉంటాయని తెలిపారు.

రామ్ గోపాల్ వర్మ తాట తీస్తానన్న వంగవీటి రాధా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గట్టి వార్నింగే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. రామ్ గోపాల్ వర్మ వంగవీటి రంగా కథతో ఓ సినిమా తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రాధాకృష్ణ తన తండ్రి జీవితాన్ని నేపథ్యంగా చేసుకొని వర్మ సినిమా తీయడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. చిత్రంలో వాస్తవాన్ని చూపిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతేకానీ రంగా జీవితం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తాటతీస్తామని హెచ్చరించారు. మరి రాధాకృష్ణ వార్నింగ్ కు వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

కేంద్రం పద్మ అవార్డులు.. మీడియా మొగల్ రామోజీరావుకి పద్మవిభూషణ్.. రాజమౌళికి పద్మశ్రీ

2016 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈరోజు పలు పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఈ అవార్డులు దక్కాయి. మన తెలుగు వారిలో మువీ మొగల్ రామోజీరావుకి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. పత్రికా రంగంలో ఎనలేని కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు అందించారు. ఇంకా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కు కూడా పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. ఇంకా వీరితోపాటు నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి, ధీరూబాయ్ అంబానీ(మరణానంతరం), సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, శ్రీశ్రీ రవిశంకర్‌, జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్‌, విశ్వనాథన్ శాంత, డా. వాసుదేవ్ కులకుంటె ఆత్రే, అవినాశ్ దీక్షిత్(భారత సంతతి) అవార్డు వరించింది. . కాగా టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళికి పద్మశ్రీ అవార్డు దక్కింది పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు వీరే. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, సానియా మీర్జా టెన్నిస్ క్రీడాకారిణి, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌, ఉదిత్ నారాయణన్‌, వినోద్ రాయ్(మాజీ కాగ్), హేస్నమ్ కన్హయిలాల్, ఎన్ఎస్ రామనుజ తాతాచార్య, బరిందర్ సింగ్ హమ్దర్ద్, డి. నాగేశ్వర్ రెడ్,డి స్వామి తేజోమయానంద, రాబర్ట్ డి బ్లాక్‌విల్(భారత యూఎస్ మాజీ అంబాసిడర్), ఇందూ జైన్ రవిచంద్ర భార్గవ రాం, వి సుతార్ హఫీజ్, కాంట్రాక్టర్ వెంకట్ రామారావు ఆళ్ల, బ్రిజేందర్ సింద్ పద్మ శ్రీ అవార్డ్ గ్రహీతలు: ఉజ్వల్ నికమ్(సీనియర్ లాయర్), బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్, ఎస్ఎస్ రాజమౌళి(బాహుబలి దర్శకుడు),  భోజ్‌పురి గాయని మాళిని అవాస్థి,   ప్రెడ్రగ్ కె నికిక్ (యోగా-సైబీరియా),  హూయి లాన్ ఝాంగ్(యోగా-చైనా)  

ఫేస్ బుక్ సీఈఓ కూతురు అప్పుడే స్విమ్ చేసేసిందట..

ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు.. తన పాప తన జీవితాన్ని మార్చేసినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఫేస్ బుక్ సీఈవో మార్క్ బుకర్ బర్గ్ తన కూతురు మాక్స్ తో బిజీగా జీవితాన్ని గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన పాపాయి పుట్టిన సందర్బంగా తనకున్న షేర్లలో 90 శాతం షేర్లను ట్రస్ట్ లకు ఇచ్చి ప్రపంచంతో ప్రశంసలు అందుకున్నాడు  బుకర్ బర్గ్. ఇప్పుడు మాక్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త షేర్ చేస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు. మొదటి  ఫోటో, తొలి టీకా మొదలగు ఫొటోలు పోస్ట్ చేసిన జుకర్ బర్గ్ ఇప్పుడు తాజాకా మాక్స్ ఫస్ట్ స్విమ్.. షి లవ్స్ ఇట్ అని ఒక ఫోటోను  షేర్ చేశాడు. అంతే ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఇంకా ఫొటోకి కామెంట్లు, షేర్లు, లైక్ లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

ఎంఎస్ నారాయణ సతీమణి మృతి.. మలయాళ నటి కల్పన మృతి

ప్రముఖ హాస్యనటుడు, దివంగత  ఎంఎస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ (63) ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఆమె ఈరోజు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మృతి చెందారు. ఇప్పటికే హాస్య నటుడు మరణించి ఎంఎస్ నారాయణ మరణించి జనవరి 23 నాటికి ఏడాది అయింది. మొన్న ఎంఎస్ నారాయణ ప్రధమ వర్ధంతి జరిగింది. అది జరిగిన రెండు రోజులకే కళాప్రపూర్ణ మృతి చెందారు.దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు ప్రముఖ మలయాళ నటి కల్పన (50) కూడా ఈరోజు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ కార్యక్రమానికి వచ్చిన ఆమె గుండెపోటుతో మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఓ ప్రయివేట్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన ఆమె తాను బస చేసిన హోటల్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి .... హుటాహుటీన జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కల్పన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కల్పన ప్రముఖ నటి ఊర్వశి సోదరి.

రాహుల్ గాంధీ చిన్నపిల్లాడు.. ఎవరూ పట్టించుకోరు.. ఆజంఖాన్

చాలా సంవత్సరాల రాజకీయానుభవం ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సెటైర్లు తప్పవు. ఇప్పటికి చాలా మంది నేతలే రాహుల్ పై వ్యంగ్యంగా మాట్లాడారు. ఇప్పుడు సమాజ్‌వాదీ నేత ఆజంఖాన్ కూడా ఆ జాబితాలో చేరారు. రాహుల్‌ గాంధీ ఇంకా చిన్న పిల్లాడేనని, అతడి మాటలను ఎవరూ పట్టించుకోరని ఆయన అన్నారు. రాహుల్‌ గాంధీ చాక్లెట్లు తింటూ, కొన్నింటిని మిగిలిన 'చిన్న పిల్లల'కు పంచిపెట్టాలని సూచించారు. కాగా రాహుల్‌గాంధీ శనివారంనాడు బుందేల్‌ఖండ్‌లో పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదా చేసుకున్న నిధులనుంచి కొంత భాగాన్ని కరవు దెబ్బ తిన్న ప్రాంతాలకు కేటాయించాలని రాహుల్ డిమాండ్‌ చేశారు. దీంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆజంఖాన్‌ పైవిధంగా స్పందించారు.

బ్రిటన్ మా తర్వాత లక్ష్యం : ఐఎస్ఐఎస్

పారిస్‌లో 130 మందిని బలితీసుకుని, నరమేధానికి పాల్పడిన తొమ్మిదిమంది ఉగ్రవాదులు ఎవరో చెబుతూ,ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఒక వీడియో విడుదల చేసింది. ఈ దాడిలో నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫ్రెంచి పౌరులు, ఇద్దరు ఇరాకీలు పాల్గొన్నారని  వెబ్‌సైట్లలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది. 'వాళ్లు ఎక్కడ కనిపిస్తే.. అక్కడ చంపండి' అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో అమెరికా సంకీర్ణ దేశాలకు ఐఎస్ఐఎస్ తీవ్ర హెచ్చరికలు చేసింది. సంకీర్ణ కూటమిలో భాగంగా ఉన్న బ్రిటనే తమ నెక్స్ట్ టార్గెట్ అని సంకేతాలు ఇచ్చింది. 2014 సెప్టెంబర్ నుంచి సిరియా, ఇరాక్‌లో ఐఎస్ఐఎస్పై దాడులు చేస్తున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి దేశాలన్నింటికీ ఈ బెదిరింపు వర్తిస్తుందని ఫ్రెంచ్, అరబ్ భాషలో ఉగ్రవాదులు హెచ్చరించారు. వీడియోలో బ్రిటన్ పిఎం డేవిడ్ కామెరాన్‌ ఫొటోను చూపించి..  'అవిశ్వాసులతో జతకలిసే ప్రతి ఒక్కరూ మ తల్వార్లకు లక్ష్యం కావాల్సిందే' అని ఇంగ్లిష్‌లో పేర్కొన్నారు. పారిస్‌ దాడితో ఫ్రాన్స్‌ను గడగడలాడించిన తొమ్మిది మంది ఉగ్రవాదులు సింహాల్లాంటి వాళ్లంటూ కితాబిచ్చారు తీవ్రవాదులు.ఐఎస్ఐఎస్ మీడియా కేంద్రం అయిన 'అల్‌ హయత్‌' ఈ వీడియోను విడుదల చేసింది.

టీడీపీకి మరో షాక్.. టీఆర్ఎస్ లోకి కృష్ణ యాదవ్.. అన్నా క్షమించు..

తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నేతలు పార్టీని వీడి అధికార పార్టీలోకి చేరుతున్న వేళ మరో టీడీపీ నేత  మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కూడా ఆ జాబితాలో చేరారు. కృష్ణ యాదవ్ టీడీపీని వీడి కారెక్కుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ మార్పుపై కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. తనపై పార్టీ వ్యవహరిస్తున్నతీరుకు మనస్తాపానికి గురై టీడీపీని వీడుతున్నట్టు ఆయన తెలిపారు. పార్టీలో ఇమడలేని తీరు ఉండటంతో బాధతో తన పదవికి రాజీనామా చేశానని..తను పార్టీ పదవికి రాజీనామా చేసినా కూడా కనీసం ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు ముగ్గురు చేతుల్లో పార్టీ నష్టపోతున్న తీరును అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా పంపినట్లు చెప్పారు. కాగా అధికార పార్టీ తెలంగాణాభివృద్ధికి పాటు పడుతోందని.. నేను కూడా రాష్ట్ర అభివృద్దిలో పాలు పంచుకునేందుకు టీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన స్వర్గీయ నందమూరి తారకరామారావును గుర్తు చేసుకున్నారు. పార్టీ స్థాపించి ఎందరినో నాయకులుగా తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, అలాంటి పార్టీలో ఎదిగిన వాడిలో నేను కూడా ఒకడినని.. పార్టీని వీడుతున్నందుకు అన్నా క్షమించు అంటూ వాపోయారు.

చంద్రబాబు, కేసీఆర్ మధ్య పంచాయతీ లేదు.. మీ మధ్య ఎందుకు.. కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ అందరికి తెలిసిన విషయాన్నే మరోసారి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఎలాంటి పంచాయితీ లేదని.. వారి మధ్య ఎలాంటి గొడవలు విభేధాలు లేవు.. వారి విషయంలో అనవసరంగా ప్రజల మధ్య పంచాయితీలు ఎందుకని అన్నారు. తెలంగాణ అభివృద్దికి అందరూ పాటుపడదాం.. హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములమవుదామవుదాం అని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ ను నమ్మాలని.. ఆయనకు గ్రేటర్లో గెలిచే అవకాశం ఇవ్వాలని.. మేనిఫెస్టోలో చెప్పినవి అన్నీ తప్పకుండా చేస్తారని అన్నారు.

రిపబ్లిక్ డే హై అలర్ట్.. ఎన్‌కౌంటర్‌ టెన్షన్

రిపబ్లిక్ డే సందర్బంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని అనుమానించి భద్రతా దళాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. అయితే ఈ భద్రతా దళాల బందోబస్తు నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్‌ జరుగడం కలకలం రేపింది. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీసు చెక్‌పోస్టు వద్ద ఎన్‌కౌంటర్‌ జరిగింది. దీంతో పోలీసులు అలర్ట్ అయి ఘటనా స్థలానికి వెళ్లి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు పరారైనట్టు తెలుస్తోంది. కాగా అరెస్ట్ అయిన వ్యక్తి పేరు అంకిత్ అని.. అతను ఓ పేరు మోసిన దొంగ అని.. అతని పేరు 25వేల రివార్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు.  

ఏదో ఆశించే పార్టీల్లోకి చేరుతారు.. జయసుధ

సినీ నటి జయసుధ ఇటీవలే టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ మార్పుపై ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా వేరే పార్టీ మారేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఆశించే అని అన్నారు. అంతేకాదు తన పద్దతులేంటో తనకు తెలుసని..  రాజకీయాల్లో అందరూ ఒకేలా ఉండాలని లేదని.. తెలుగు దేశం పార్టీలోకి చేరినప్పటికీ తాను తన పద్దతిలోనే ఉంటానని చెప్పారు. అధికార పార్టీలో ఉంటేనే ప్రజలకు మేలు చేయడానికి కుదురుతుందని.. అందుకే టీడీపీలో చేరాను.. త్వరలో గ్రేటర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ ఆదేశిస్తే ప్రచారం చేస్తానని చెప్పారు. సినిమాల్లో కన్నా రాజకీయాల్లోనే పెద్ద నటులు ఉన్నారని ఆమె అన్నారు. అంతేకాదు మా ఎన్నికల గురించి కూడా ఆమె మాట్లాడుతూ మా ఎన్నికల్లో పోటీకి తనను ఎవరూ బలవంతం చేయలేదని.. నేనే పోటీ చేశానని అన్నారు. అయినా పోటీ అనేది ఎన్నికల వరకే అని.. సినిమా పరిశ్రమ అంత ఒకటేనని స్పష్టం చేశారు.