ప్రభుత్వోద్యోగే- కానీ పర్వతం ఎక్కడంలో రికార్డు!
posted on Jan 28, 2016 @ 9:50AM
ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక ఐపిఎస్ అధికారి. శాంతిభద్రతలను కాపాడటంలో నిరంతరం తలమునకలై ఉంటారు. కానీ ఏమాత్రం అవకాశం చిక్కినా తనకు ఇష్టమైన పర్వతారోహణకు సిద్ధమైపోతారు. మనసులో ఆసక్తి ఉండాలే కానీ అనుకున్నది సాధించడానికి స్త్రీ, పురుషులన్న వివక్ష కానీ, ఉద్యోగబాధ్యతలు కానీ అడ్డురావని నిరూపిస్తున్నారు అపర్ణ కుమార్. గత వారం అంటార్క్‌టికాలోని మౌంట్ విన్సన్ అనే 17,000 పర్వతాన్ని అధిరోహించిన అపర్ణ, ఆ పర్వతాన్ని ఛేదించిన తొలి భారతీయ ఉద్యోగిగా రికార్డు సాధించారు. ఇంతేకాదు! మౌంట్ విన్సన్‌ని అధిరోహించడంతో ప్రపంచంలోని 7 అతి క్లిష్టమైన పర్వతాలుగా భావించేవాటిలో 5 పర్వతాలను ఆమె అధిరోహించినట్లు అయింది. సాహసమే జీవితంగా గడిపిన అపర్ణకు గత ఏడాదే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ‘రాణి లక్ష్మిబాయ్ పురస్కార్’ను అందించింది. ఆ పురస్కారాన్ని మరోసారి సార్థకం చేసుకుంది అపర్ణ. ఇక తన తదుపరి లక్ష్యం ఎవరెస్టు పర్వతమే అంటోంది!