అటు కేటీఆర్.. ఇటు లోకేశ్.. మధ్యలో అనుసూయ
posted on Jan 29, 2016 @ 2:47PM
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అన్నీ పార్టీలు తమ జెండాలతో ప్రచారం చేయడంలో మునిగిపోయాయి. ఇతర పార్టీ నేతలపై కామెంట్లు, కౌంటర్లు వేసుకుంటూ పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి పార్టీలన్నీ. అయితే అందరి ప్రచారం సంగతి పక్కన పెడితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో యువనేతలు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తనయులు కేటీఆర్, లోకేశ్ ల మధ్య జరుగుతున్న వార్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇప్పటికే ఇద్దరూ చాలా తెలివిగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనే లోకేశ్ అధికార పార్టీపై విమర్శలు చేయగా.. దానికి కేటీఆర్.. లోకేశ్ ను తమ్ముడూ అంటూనే చురకలు అంటించారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ జరుగుతుంది. అది కూడా ఒక అనసూయ అనే మహిళ వల్ల.. ఆమెకు వీరిద్దరికీ సంబంధం ఏంటంటారా.. లోకేశ్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా అనసూయ అనే మహిళ ఆయన వాహనం వద్దకు వచ్చి తనను ఆదుకోవాలని కోరిందట. దీనికి గాను లోకేశ్ కేటీఆర్ కు ట్వీట్ చేశారట. ‘‘అనసూయ అనే మహిళ పొరపాటున నన్ను మీరనుకుంది..తనను ఆదుకోవాలని నా వాహనం ముందు నిలిచింది..మిమ్మల్ని కలిసి తన గోడుకు చెప్పుకొనే మరో మార్గం లేకనే ఇలా చేసింది’’ అని ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ స్పందించి.. ‘‘బ్రదర్ సంతోషం.. రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న పార్టీతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిసే ఆమె ఇలా చేశారని అర్థం చేసుకోగలరు. ఆమెను తప్పకుండా ఆదుకుంటాం. అనసూయే కాదు… ఆమెలాంటి మహిళలందరినీ ఆదుకుంటాం. ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు’’ అని జవాబిచ్చారు. అంతేకాదు లోకేశ్ కు గుడ్ లక్ కూడా చెప్పారంట. మరి కేటీఆర్ ట్వీట్ కు లోకేశ్ ఎలా రీ ట్వీట్ ఇస్తారో చూడాలి.