చుట్టాలు తిరిగి వెళ్లడం లేదని..పోలీసులకు ఫిర్యాదు..!

అతిథి దేవో భవ..! అన్న నానుడిని గౌరవించే సంస్కృతి మనది. ఇంటికి చుట్టాలు వస్తే వారిని గౌరవించి, తగిన మర్యాదలు చేయడం భారతీయుల రక్తంలోనే ఉంది. చుట్టాలు ఇంటికి వచ్చి రెండు రోజులో మూడు రోజులో ఉంటారు. కాని ఇక్కడ మాత్రం వచ్చి రోజులు గడుస్తున్నా తిరిగి వెళ్లడం లేదు. దీంతో విసిగిపోయిన ఒకాయన మాత్రం బంధువులతో విసిగిపోయాడు. ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి ఆర్‌ఎంస్ కాలనీలో నివాసం ఉండే విజయేందర్ రావు అనే మాజీ సైనికోద్యోగి ఇంటికి ఆయన మనవడు, మనవరాలు కుటుంబంతో పాటు వచ్చారు. అయితే వారు తిరిగి వెళ్లట్లేదు..ఎన్నిరోజులైనా వారు ఇల్లు కదలకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి.. వారిని తన ఇంటి నుంచి పంపించాలని తెలిపాడు. బంధువులను తిరిగి వారింటికి పంపించడం తన వల్ల కావడం లేదని, వారిపై కేసు నమోదు చేసి ఇంటి నుంచి పంపించాలంటూ పోలీసులకి మొరపెట్టుకున్నారు. తాను చేసిన ఫిర్యాదుకి పోలీసులు స్పందించకపోవడంతో రెండో సారి కూడా రక్షకభటులను కలిశాడు. అయితే దీనిపై ఎలా స్పందించాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు.

భారత్ లో న్యాయం జరగదనే రాజీనామా.. మాల్యా

  బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎంచక్కా లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్బంగా మాల్యా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పేరు ప్రతిష్టలకు మరింత బురద అంటించడం ఇష్టం లేకనే ఈ చర్య తీసుకున్నట్లు.. ఈ మధ్య చోటుచేసుకున్న వరుస సంఘటనలు, పరిణామాలను బట్టి చూస్తే భారత్‌లో తనకు న్యాయం లభిస్తుందన్న నమ్మకం లేదని రాజీనామా లేఖలో మాల్యా పేర్కొన్నాడు. అందుకే తన పార్లమెంట్ సభ్యత్వానికి తక్షణమే అమలులోకి వచ్చేలా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు.

69 ఏళ్ల తరువాత ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లు..

  పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఐదో విడత ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈనెల 5వ తేదీన చివరి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఇప్పటివరకూ అంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 69 ఏళ్ల వరకూ ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా.. అసలు సంగతేంటంటే.. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతాలను గత ఏడాది ప్రాంతాలను పంచుకున్నాయి. మొత్తం 162 ప్రజా సమూహాల్లో బంగ్లాదేశ్ కు 111, భారత్ కు 51 ప్రజాసమూహాలు వచ్చాయి. దీంతో పశ్చిమబెంగాల్ లోని కూచ్ బీహార్ జిల్లాలో 15 సమూహాలకు 9 వేల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. అంతకుముందు వరకూ వారు ఏ దేశానికి చెందినవారో పరిగణించకపోవడంతో ఇన్ని సంవత్సరాలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.

సద్దుమణిగిందనుకున్నారా..ఏపీ, తెలంగాణ వార్ రిటర్న్

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య సోదర బంధం బలపడుతున్న తరుణంలో తాగునీటి ప్రాజెక్ట్ల్‌లు మళ్లీ చిచ్చుబెట్టాయి. నిన్న విజయవాడలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లపై కేంద్రానికి లేఖ రాయాలని..అవసరమైతే న్యాయపోరాటం చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల మళ్లీ రెండు రాష్ట్రాలు కొట్టుకునే పరిస్థితి రాబోతుందని రాజకీయ విశ్లేషకులు ముందుగానే ఊహించారు. అనుకున్నట్టుగానే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటల యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లపై ఏపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని..కేబినెట్ తీర్మానం బాధ్యాతారాహిత్య చర్య అని అభిప్రాయపడ్డారు. ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్‌కు సీడబ్ల్యూసీ అనుమతులు ఉన్నాయా? అని ఆయన నిలదీశారు. పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజల్లో జగన్‌కు మైలేజీ వచ్చే ప్రమాదం ఉందని భావించే, చంద్రబాబు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారని ఆయన విమర్శించారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మరి తలసానికి కౌంటర్‌గా ఏపీలో ఎవరు మాట్లాడుతారో.

కేసీఆర్‌కు ఆంధ్రా అల్లుడు రాబోతున్నాడు...!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రా అబ్బాయి అల్లుడిగా రాబోతున్నాడు. అదేంటి కేసీఆర్‌ కూతురు కవితకు అల్రెడీ పెళ్లయిపోయింది కదా మళ్లీ అల్లుడేంటి అంటారా? అసలు మ్యాటరేంటంటే కొన్నాళ్ల క్రితం ప్రతీ రోజు తండ్రి, పినతల్లి చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై..గృహ నిర్భంధంలో చిక్కుకుని ఆఖరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో..మహిళా సంఘాలు, ఎన్జీవోలు, మీడియా చొరవతో ఆ యువతిని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు రక్షించి..ఆ తర్వాత హాస్టల్‌లో జాయిన్ చేయడం జరిగిపోయింది. ఆ తర్వాత ప్రత్యూష దీనగాథ గురించి తెలుసుకుని స్వయంగా ఆస్పత్రిలో ఆమెను పరామర్శించి దత్తత తీసుకోవడం అందరికీ తెలిసిందే.   ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ప్రత్యూష ప్రేమలో పడింది. తాను ఆళ్లగడ్డకు చెందిన యువకుడిని ప్రేమించానని..అతడితో పెళ్లి జరిపించాలని అధికారులను కోరడం సంచలనం రేపింది. ఇంతకీ ప్రత్యూష లవ్ స్టోరీలోకి వెళితే..ఆమె ప్రేమించిన యువకుడి పేరు మద్దిలేటి వెంకట్ అని..కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఈ యువకుడు తన దగ్గరి బంధువులు హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న సమయంలో..వారి బాగోగులు చూసుకోవడం కోసం అక్కడే ఉండేవాడు. అదే సమయంలో..తన కంటి చికిత్స నిమిత్తం ప్రత్యూష అదే హస్పిటల్‌లో జాయిన్ అయ్యింది. ఈ క్రమంలోనే, ఇద్దరికీ మాటలు కలవడం..స్నేహానికి దారి తీయడం, ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది. ప్రత్యూష ఎల్వీ ప్రసాద్ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా ఫోన్లలో మాట్లాడుకోవడం, వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకోవడం జరిగింది. వీరి స్నేహం..ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే, ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అధికారుల వద్ద ప్రత్యూష తన ప్రేమను చెప్పింది. అయితే ప్రత్యూషకు సంబంధించిన అన్ని విషయాలు ముఖ్యమంత్రి చూసుకుంటుండటంతో ఈ విషయాన్ని సీఎంవోకు చేరవేశారు. తదనంతరం సీఎంవో ఆదేశాలతో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల సాయంతో వెంకట్ వివరాలు సేకరించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రత్యూషను దత్తత తీసుకోవడం వల్ల ఆయన ఆమెకు తండ్రి. ఈ పెళ్లికి సీఎం పచ్చజెండా ఊపితే తెలంగాణ సీఎంకి అల్లుడిగా ఆంధ్రా అబ్బాయి వెంకట్ వెళ్లే అవకాశాలున్నాయి. మరి సీఎం నిర్ణయం ఎలా ఉండబోతుందో.  

పాలేరు ఉపఎన్నిక.. టీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి...

  కాంగ్రేస్ పార్టీ పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఉపఎన్నిక ఖరారై సంగతి తెలిసిందే. అయితే ఈ ఉపఎన్నికకు టీఆర్ఎస్ నుండి తుమ్మల నాగేశ్వరరావు బరిలో దిగుతుండగా.. కాంగ్రెస్ నుండి సుచరిత రెడ్డి బరిలో దిగుతున్నారు. టీడీపీ మాత్రం ఈ ఉపఎన్నికకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు తెలంగాణ టీడీపీపై సెటైర్లు వేస్తున్నారు. ఎలాగూ పోటీ చేసినా కానీ ఓడిపోతుందనే ఎన్నికలో పోటీ చేయడంలేదని.. నారాయణఖేడ్ ఎన్నికల్లో పాల్గొన్న టీడీపీ ఇప్పుడు పాలేరు ఎన్నికల సమయంలో మాత్రం.. గెలిచే సత్తా లేక పోటీ నుండి తప్పుకుంటుందని మంత్రులు హరీష్ రావు, కెటి రామారావు, తుమ్మల నాగేశ్వర రావులతో పాటు పలువురు నేతలు కూడా ఎద్దేవ చేస్తున్నారు. అయితే వీరికి తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కాస్త గట్టిగానే సమాధానం చెబుతున్నారు. గతంలో నారాయణఖేడ్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ మమ్మల్ని సంప్రదించలేదు.. ఇప్పుడు సంప్రదించింది అని అన్నారు. అంతేకాదు సుచరిత రెడ్డిగారు అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నా టీఆర్ఎస్ కనీసం ఆమె కలిసే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. మరి రేవంత్ రెడ్డి సమాధానాలకు టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుండో చూడాలి.

లాడెన్ గురించి చెప్పిన డాక్టర్ ను వదిలేస్తా.. ట్రంప్

  చైనా, ఇండియాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పాకిస్థాన్ తో కూడా తిట్లు తిట్టించుకునేలా ఉన్నారు. 9/11 అంటే మనకు వెంటనే గుర్తొచ్చే విషయం అగ్రరాజ్యమైన అమెరికా ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదుల దాడి. బిన్ లాడెన్ నేతృత్వంలో ఆల్ ఖైదా దాడులు చేసింది. అయితే ఈ దాడులకు పాల్పడి.. అనంతరం బిన్ లాడెన్ ను అంతమొందించేందుకు అమెరికన్లలకు సహకరించి.. లాడెన్ జాడను తెలిపిన డాక్టర్ షకీల్ అఫ్రిది ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు దానిని గుర్తుచేస్తూ డొనాల్డ్ ట్రంప్.. నేను అధ్యక్షుడినైతే షకీన్ ను రెండు మూడు నిమిషాల్లో విడిపిస్తా అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అక్కడితో ఆగకుండా మనం పాక్ కు నిధులిస్తున్నాం.. మన మాట వాళ్లు వింటారు అని అన్నాడు.   అయితే దీనికి పాకిస్థాన్ మాత్రం తీవ్రంగా స్పందించి ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు షకీల్ అఫ్రిదిని విడుదల చేయడానికి ట్రంప్ ఎవరని.. ఆయనకు పాకిస్థాన్ గురించి పెద్ద అవగాహన లేనట్టుంది.. చిల్లర విదిల్చుతూ భయపెడదామని చూడటం పొరపాటు.. అఫ్రిది సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అమెరికాకు ఏం సంబంధం ఉంది.. మా దేశపు కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి అని ఘాటుగా పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చౌదరీ నిస్సార్ అలీ ఖాన్ నిప్పులు చెరిగారు.

బయటపడిన పొంగులేటి బ్రదర్స్ విబేధాలు.. నిజ స్వరూపం బయటపడింది

వైసీపీ పార్టీ నుండి ఎంపీగా గెలుపొందిన నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పొంగులేటి బ్రదర్స్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. పొంగులేటి బ్రదర్స్... సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిల మధ్య పెద్ద వివాదాలేమీ లేవు. అయితే వైసీపీ ఆవిర్భావం తరువాత వైసీపీ పార్టీలో చేరిన శ్రీనివాస రెడ్డి ఆతరువాత మంచిపేరు తెచ్చుకున్నారు. మరోవైపు సుధాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో మంచిపేరు తెచ్చుకొని ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అయితే నిన్న శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించగానే సుధాకర్ రెడ్డి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ముసుగు వేసుకుని ఇంతకాలం వైసీపీలో కొనసాగిన శ్రీనివాసరెడ్డి నిజ స్వరూపం ఎట్టకేలకు బట్టబయలైందని.. అసలు ప్రత్యేక తెలంగాణ కోసం శ్రీనివాసరెడ్డి ఏం చేశారని తెలంగాణ కోసం ఉద్యమం చేశారా? జైలుకెళ్లారా? ఆయనను పార్టీలో చేర్చుకుంటున్నారని కూడా టీఆర్ఎస్ నేతలను సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. 

అగస్టా స్కాంలో కొత్త విషయాలు.. త్యాగి కోడ్ నేమ్ 'అపురూప లావణ్యవతి'

  అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణంలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగికి భారీగా ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ త్యాగిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. డీల్ కోసం సంప్రదింపులు జరిపే సమయంలో ఎస్పీ త్యాగిని ఇటలీ మధ్యవర్తులు కోడ్ నేమ్ తో సంబోధించే వారట. తమ సంభాషణల్లో త్యాగిని 'అపురూప లావణ్యవతి' (ఇటలీ భాషలో గియులి లేదా గియులియా)గా సంబోధించేవారట. మార్చి 25, 2012లో వీరిద్దరినీ మిలాన్ లోని మల్పెన్సా ఎయిర్ పోర్టులో త్యాగి కలుసుకున్నాడని సీబీఐ, ఈడీ అధికారులు సేకరించిన పత్రాల్లో ఉంది. " ఆపై తిరిగి వెళుతూ, చాపర్ డీల్ లో ఇటలీ విచారణ పట్ల గియులియా ఆందోళన వ్యక్తం చేశారు" అని ఆ పత్రాల్లో ఉన్నట్టు సమాచారం.

పేల‌డానికి సిద్ధంగా ఉన్న హాట్ పిస్ట‌ల్‌గా ఇండియా..ట్రంప్

  నిన్ననే చైనాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు మళ్లీ ఇండియాపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఇండియా తమ ఉద్యోగాలు తన్నుకుపోతుందంటూ వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మరోసారి ఇండియాపై విరుచుకుపడ్డారు. త‌మ దేశీయుల ఉద్యోగాల‌ను త‌న్నుకుపోతూ ఇండియా త‌మ‌కు అన్యాయం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఇండియాతో పాటు చైనా, వియత్నాం, జపాన్ ఎన్నో విష‌యాల్లో అమెరికాకు న‌ష్టం క‌ల‌గ‌జేస్తున్నాయంటూ ఆరోపించారు. ఓ వైపు ఇండియాపై విమ‌ర్శ‌లు చేస్తూనే.. మ‌రోవైపు కాసేప‌ట్లో పేల‌డానికి సిద్ధంగా ఉన్న హాట్ పిస్ట‌ల్‌గా ఇండియాను అభివ‌ర్ణించారు. వేరే దేశాల‌నుంచి యువ‌త‌ త‌మ దేశానికి వ‌చ్చి ఇక్క‌డి ఉద్యోగాల‌ను కొట్టేయ‌డ‌మేంటంటూ ఆయన ప్ర‌శ్నించారు.

కలిసిపోయిన భూమా, శిల్పా సోదరులు... కలసికట్టుగా పనిచేసుకుంటాం

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కర్నూలు జిల్లా నేతల భేటీ ముగిసింది. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. నేతల మధ్య విబేధాలు సమసిపోయాయి..రాజీ కుదిరింది.. కలసికట్టుగా పనిచేసుకుంటామని భూమా, శిల్పా సోదరులు చెప్పారు అని అన్నారు.   ఇంకా శిల్పా చక్రపాణి మాట్లాడుతూ.. భూమాతో విబేధాలు తొలగిపోయాయి.. చంద్రబాబు సమక్షంలో విబేధాలపై చర్చించాం.. పార్టీ బలోపేతం కోసం కలిసిపనిచేస్తాం పనిచేస్తాం అని అన్నారు. ఇంకా వైసీపీ అధినేత జగన్ తీరుపై మండిపడ్డారు. త్వరలోనే వైకాపా పూర్తిగా ఖాళీ అవుతుందని విమర్శించారు. పార్టీపై జగన్ పట్టును కోల్పోయారని.. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగిందని, ఇక అభివృద్ధి పథంలో జిల్లా దూసుకెళుతుందని అన్నారు.

గోవా ముఖ్యమంత్రిగా పారికర్ రీఎంట్రీ.. అసలు ఏమైందీ..?

  ప్రధాని మోడీ కేబినేట్లో రక్షణ శాక మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ త్వరలోనే మళ్లీ గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు గతంలో గోవా ముఖ్యమంత్రిగా ఉన్న పారికర్ ను ప్రధాని నరేంద్ర మోడీనే తన పనితీరు నచ్చి.. గోవా సీఎం పదవికి రాజీనామా చేయించి మరీ తన కేబినెట్ లో చేర్చుకొని రక్షణ శాఖ బాధ్యతలను ఆయనకు అప్పజెప్పారు. అయితే పారికర్ కూడా తన బాధ్యతలు ఎలాంటి వివాదాలు లేకుండా సక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఏమైందో, ఏమో తెలియదు కాని... మోదీ కేబినెట్ నుంచి పారికర్ బయటకు వచ్చేస్తున్నారని.. తిరిగి గోవా సీఎంగా పారికర్ పదవీ బాధ్యతలు చేపడతారని ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు గోవాలోని బిచోలిమ్ లో ఓ వెబ్ సైట్ తో మాట్లాడిన పారికర్ కూడా ఈవిషయంపై క్లారిటీ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ‘అవును. మూడు నాలుగు నెలల్లో తిరిగి గోవాకు వచ్చేస్తున్నాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరి అసలు ఏం జరిగిందో.. ఇంత సడెన్ గా మళ్లీ గోవాకి రీఎంట్రీ ఇవ్వడంపై కారణాలు ఏంటో అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మోడీ వచ్చిన తరువాత మత గొడవలు.. అమెరికా

  యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం (యూఎస్సీఐఆర్ఎఫ్) అనే సంస్ధ మన దేశంలోని మతపరమైన సంఘర్షణలపై నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై కూడా పరోక్షంగా విమర్శలు చేసినట్టుగానే కనిపిస్తోంది. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్పీకరించిన తరువాతే ఇండియాలో మత స్వాతంత్ర్యం ప్రమాదకరంగా మారిందని, కొన్ని మతాల వారు స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ, ఇతర మతాలపై దాడులు జరుపుతున్నారని, ప్రజల్లో అసహనం పెరిగిందని తన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న వారిని నిలువరించడంలో పోలీసులు సైతం మిన్నకుంటున్నారని పేర్కొంది. తదుపరి భారత్ తో జరిపే చర్చల్లో మతపరమైన అంశాన్నీ జోడించాలని.. ఇండియాలో పరిస్థితి మారేందుకు అమెరికా ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేయాలని కోరింది. కాగా త్వరలో నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న వేళ, ఆ దేశం ఈ తరహాలో ఆరోపణలు చేయడం గమనార్హం.

కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం... వైసీపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

ఒక పక్క వైసీపీ నేతలు పార్టీ మారుతూ జగన్ కు గుబులు పుట్టిస్తుంటే.. ఇప్పుడు కొంతమంది నేతలు తీరు ఆయనకు తలనొప్పిగ తయారయ్యేట్టు ఉంది. గతంలో విమానాశ్రయంలో ఒక మేనజర్ పై చేయిచేసుకున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు మరోసారి..మిథున్ రెడ్డిపై కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన కాంట్రాక్టర్ శరత్ చంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిథున్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి ఆదేశాలతో తాను ఓ పని చేశానని .. అందుకైన బిల్లులు రూ.32 లక్షలను వారు తనకివ్వలేదని ఆరోపించారు. దీంతో తాను వైసీపీ కార్యలయం ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన పిర్యాదుతో మిథున్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు.

మహిళా డీఎస్పీ ఫొటోలు తీశాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు

  ఆకతాయితనంతో కొన్నిసార్లు చేసే పనుల వల్ల నష్టం కలుగుతుంది. అలా ఆకతాయితనంతోనే ఓ పోలీసు అధికారి ఫొటో తీసి ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఓ యువకుడు హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడు ఏకంగా కమిషనర్ కార్యాలయంలోనే సెల్ ఫోన్ చేతబట్టి సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఓ మహిళా పోలీసు అధికారి ఫొటోలు తీశాడు. వెంటనే విషయాన్ని గమనించిన సదరు డీఎస్పీ అతడి చేతిలోని సెల్ ఫోన్ లాగేసుకొని..  తన ఫొటోలను అతడు తీసిన తీరును పరిశీలించి.. ఉద్దేశ్యపూర్వకంగానే అతడు ఈ పని చేసినట్టు నిర్ధారించుకొని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతడిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసి అతడిపై కేసు కూడా నమోదు చేశారు.

అచ్చెన్నను మెచ్చుకున్న చంద్రబాబు.. పీతల సుజాత, కొల్లు రవీంద్రలకు తిట్లు..

  ఏపీ చంద్రబాబు నాయుడు మంత్రులు పనితీరు నచ్చకపోతే తిట్టడం ఎంత సహజమే.. పనితీరు నచ్చితే అదే రీతిలో పొగుడుతారు. నిన్న ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగిన నేపథ్యంలో చంద్రబాబు కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ప్రశంసించారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు  కార్మిక శాఖపై పట్టు సాధించి తన సత్తా చాటుతున్నారు. దీనిలో భాగంగానే..  కార్మిక శాఖ పనితీరు తనకు బాగా నచ్చిందని.. మిగిలిన మంత్రులు కూడ తమ శాఖలపై పట్టు సాధించాలని సూచించారు.   అయితే మరో ఇద్దరు మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాతలకు మాత్రం చంద్రబాబు అక్షింతలు వేసినట్టు సమాచారం. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయాలు సాగుతున్నాయని చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో.. దీనిపై స్పందించిన చంద్రబాబు  ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖలో ఏం జరుగుతుందో ఏంటో అని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని.. పరిస్థితి మారాల్సిందేనని ఆదేశించారు.   ఇంకా ఉచిత ఇసుక విధానంపై పీతల సుజాతకు కూడా చంద్రబాబు క్లాస్ పీకినట్టు సమాచారం.  రాత్రి వేళ ఇసుక తవ్వకాలకు అనుమతి లేదని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ జారీ చేసిన ఆదేశాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను అందించాలన్న ఉద్దేశంతోనే ఉచిత ఇసుకకు శ్రీకారం చుట్టామని మరింత సేపు ఇసుక తవ్వుకుంటామంటే వచ్చే ఇబ్బంది ఏమిటని.. అయినా ఇసుక వ్యవహారంలో పోలీసులకు ఏం పని అని ఆయన పీతలపై ప్రశ్నల వర్షం కురిపించారు.