హైదరాబాద్ మ్యాచ్ కు మళ్లీ వరుణుడి అడ్డంకి..!
ఐపిఎల్ లో ఎవరికీ లేని అడ్డంకి సన్ రైజర్స్ ను మాత్రం వెంటాడుతోంది. రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ తో జరిగిన గతమ్యాచ్ లో అడ్డు వచ్చిన వరుణుడు, ఈ రోజు బెంగళూరు తో జరిగే మ్యాచ్ కు కూడా వచ్చేశాడు. సాయంత్రం నుంచి మబ్బు పట్టి చల్లగా మారింది హైదరాబాద్ వాతావరణం. ఉప్పల్లో ప్రస్తుతానికి చిన్న జల్లులా వర్షం కొడుతుండటంతో, టిక్కెట్ కొని స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు మ్యాచ్ జరుగుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. గత మ్యాచ్ లో వరుణుడి ప్రభావంతో, హైదరాబాద్ ఆడిన ఫస్ట్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ కు సహకరించిన పిచ్, పుణే బ్యాటింగ్ సమయానికి బ్యాటింగ్ పిచ్ గా మారిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పుణే టీం కంఫర్టబుల్ గా గెలిచింది. ఈరోజు బెంగళూర్ తో జరిగే మ్యాచ్ కు కూడా వర్షం వస్తుండటంతో, క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నా సిటీజనానికి మాత్రం, మలమల మాడ్చుతున్న ఈ ఎండల కాలంలో, వర్షం రిలీఫ్ ఇస్తోంది. ఇంకా వర్షం కురవాలని సిటీవాసులు కోరుకుంటున్నారు.