ఏపీ నేతలకు కేసీఆర్ వార్నింగ్.. మీకు చేత కాకుంటే చెప్పండి.. పడుకున్న బెబ్బొలిని లేపొద్దు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ తన ఉగ్రస్వరూపం చూపించారు. మీ చిల్లర రాజకీయాలు మా దగ్గర చూపించొద్దు.. అవి మా దగ్గర పనిచేయవు.. అని హెచ్చరించారు. అంతేకాదు ఏపీకి చెందిన ఇద్దరు నేతల సంగతి తనకు తెలుసని ఆయన అన్నారు. తన దగ్గర నాటకాలాడవద్దని ఆయన హితవు పలికారు. తెలంగాణలో ఉన్న అంతో ఇంతో మర్యాదని పొగొట్టుకోవద్దని ఏపీ నేతలకు ఆయన సూచించారు. గోదావరి నీళ్లు ఎలా ఉపయోగించాలో తెలివిలేని మీరు తెలంగాణ మీద పడి ఏడవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మీకు చేత కాకుంటే చెప్పండి, గోదావరి నీరు ఎలా వినియోగించుకోవాలో వివరిస్తానని ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. పడుకున్న బెబ్బొలిని లేపి గొడవ పెట్టుకోవద్దని హెచ్చరించారు.

చేతులు జోడించి అడుగుతున్నా.. ప్రత్యేక హోదాపై గల్లా

  ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి జయంత్ సిన్హా ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకహోదా వచ్చే అవకాశం లేదని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు. అయితే దీనిపై గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సిన్హా ఇచ్చిన సమాధానంతో మాకు చాలా బాధ కలిగింది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అని అన్నారు. పార్లమెంట్ లోపలా.. ఎన్నికల ససమయంలో మోడీ హామీలు ఇచ్చారు.. మోడీ ఇచ్చిన హామీకే సభలో విలువలేదా అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ కు ఏ సిఫార్స్ మీద ప్రత్యేక హోదా ఇచ్చారు..? బుందేల్ ఖండ్.. తలసరి ఆదాయం కంటే ఏపీ తలసరి ఆదాయం తక్కువగానే ఉంది.. ఏపీకి ప్రత్యేక  హోదా ఇవ్వాలని చేతులు జోడించి అడుగుతున్నా.. ఇప్పటి వరకూ ఏపీకి ఏమిచ్చారు.. ఏం ఇవ్వబోతున్నారు.. ఎన్ని రోజుల్లో ఇస్తారు అంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇక మాటలు వినే ఓపిక ప్రజలకు లేదు, చేతలు కావాలని ఆయన స్పష్టం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదు... కేంద్రమంత్రి సిన్హా

  పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో ఏపీకి ప్రత్యేక హోదా రాదు అన్న విషయం చాలా క్లియర్ గానే అర్దమవుతోంది. ఏపీ ప్రత్యేక హోదా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ రాజ్యసభలో ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలా నష్టపోయిందని, ఆ లోటును పూడ్చాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వక పోవడంవల్ల ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారంటూ ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు.   అయితే దీనికి కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు. ప్రత్యేకహోదా వచ్చే అవకాశం లేదని.. ఏపీ రెవెన్యూ లోటును భరించలేం.. ఏపీకి ప్రత్యేకహోదాపై నీతిఆయోగ్ ఎలాంటి సూచన చేయలేదని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేకహోదా గురించి లేదని ఆయన స్పష్టం చేశారు.

అగస్టాపై సభలో రచ్చ.. మొత్తం బయటపెడతామన్న బీజేపీ.. మోస్ట్ వెల్ కమ్ అన్న సోనియా

  అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై అధికార, ప్రతిపక్ష పార్టీలతో రాజ్యసభ దద్దరిల్లిపోతోంది. అగస్టా స్కాంపై చర్చను ప్రారంభించిన బీజేపీ నేత భూపేంద్ర యాదవ్.. ఒప్పందంలో అక్రమాలు జరిగేందుకు వీలుగా యూపీఏ ప్రభుత్వం దొడ్డిదారిన అనుమతులు ఇచ్చిందని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. దీనికి కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా అధికార పక్షం ఇలా మాట్లాడటం సరికాదని.. ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది యూపీఏ ప్రభుత్వం అన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఇంకా దీనిపై బీజేపీ నేతలు మాట్లాడుతూ.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రక్షణ మంత్రి రాజ్యసభ ముందు ఉంచుతారు అని చెప్పగానే.. దానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోస్ట్ వెల్ కమ్ అన్నారు. ఈ విషయంలో అన్ని విషయాలను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు

పతాంజలి బ్రాండ్ అంబాసిడర్ గా లాలూ..

  బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పతాంజలి బ్రాండ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాందేవ్ బాబానే తెలిపారు. లక్నోలో లాలూ ప్రసాద్ ను కలిసిన సందర్భంగా.. రాందేవ్ బాబా మాట్లాడుతూ పతంజలిఉత్పత్తులకు లాలూను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన పతంజలి గోల్డ్ ఫేస్ క్రీమ్ ను లాలూ ముఖానికి ఆయన పూశారు.   ఈ సందర్భంగా లాలూ మాట్లాడుతూ..  అనంతరం లాలూ మాట్లాడుతూ, పతంజలి ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని అన్నారు. పతంజలి ఉత్పత్తులను చూసి ప్రముఖ సంస్థలు అసూయ చెందుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఉత్పత్తుల ద్వారా బాబారాందేవ్ దేశానికి సేవ చేస్తున్నారని ఆయన తెలిపారు.

జగన్ అడుగుపెట్టాడు.. ప్రాబ్లం సాల్వ్

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్ల చంద్రబాబుకి అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతాయేమో కానీ.. ఇప్పుడు అదే జగన్ వల్ల సమస్య తీరింది.  అదేంటనుకుంటున్నారా.. విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ బ్రాండెక్స్ కార్మికుల గత 20 రోజులుగా తమకు కనీస వేతనాలు ఇవ్వాలని.. పీఎఫ్ బకాయిలు చెల్లించాలని ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వేలాది మంది కార్మికులు విడతల వారీగా చేస్తున్న ఆందోళనలతో సెజ్ మొత్తం నిరసనలతో హోరెత్తుతోంది. అయితే ఏపీ ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తామని.. కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీలంకకు చెందిన సదరు కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కానీ దానికి తగిన చర్యలు మాత్రం ఇంత వరకూ తీసుకోలేదు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. వారికి మద్దతు తెలిపి.. కార్మికులకు సంఘీభావం తెలుపడానికి విశాఖకు వెళ్లారు. అయితే జగన్ అలా వెళ్లాడో లేదో.. ఇప్పటివరకూ పెద్దగా స్పందించని ప్రభుత్వం.. వెంటనే కార్మికులు కోరినట్టు బ్రాండెక్స్ లో కనీస వేతనాల అమలు కోసం ఓ ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తానికి ప్రతిపక్ష నేతకి అధికార పక్షం కాస్త భయపడుతున్నట్టే తెలుస్తోంది..

చంద్రబాబుపైనే ఎర్రబెల్లి కామెంట్లు..

తెలంగాణ టీడీపీ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార పార్టీ టీఆర్ఎస్ లో జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే అలా పార్టీ మారారో లేదో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసేస్తున్నారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎర్రబెల్లి స్పందిస్తూ.. నీటి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని.. తెలంగాణ నీటి వాటాను అడ్డుకునే యత్నాలు చేయవద్దని కోరారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్య లేకుండా చేశారని, ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలకు మద్దతు తెలపాలనే తాను టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చానని ఇటీవలే పార్టీ మారిన ఎర్రబెల్లి అన్నారు.

అగస్టా స్కాం.. వ్యూహప్రతివ్యూహాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు

అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసుకి సంబంధించిన విషయాలు ఈరోజు సభలో ప్రవేశపెడతానని పారికర్ వెల్లడించిన నేపథ్యంలో ఈ స్కాంప్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులతో అత్యవసరం భేటీ అయ్యారు. అంతేకాదు ప్రతిపక్షం కూడా వ్యూహప్రతివ్యూహాలు చేస్తోంది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సైతం తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అగస్టాపై సభలో అనుసరించాల్సిన వ్యూహం, అధికార పక్షం ఎత్తుగడలను ఏవిధంగా తిప్పికొట్టాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.

పనామా పేపర్స్ బయటపెట్టిన మరో బాలీవుడ్ జంట..

  ప్రపంచ వ్యాప్తంగా నల్ల కుబేరుల గుండెల్లో గుబులు రేపిన పనామా పేపర్స్.. ఇప్పటికే ఎంతో మంది దిగ్గజాల పేర్లను బయటపెట్టింది. వీరిలో బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, ఇంకా సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ల జంట పేర్లు ఉండగా..ఇప్పుడు తాజాగా మరో జంట పేర్లు కూడా బయటపెట్టాయి.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కాజోల్ పేర్లను పనామా పేపర్స్ బయటపెట్టింది.   ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ బ్రిటన్‌లోని వర్జిన్ ఐలాండ్ కు చెందిన మేరిలిబోన్ ఎంటర్ టైన్మెంట్ అనే సంస్థలో దాదాపు వెయ్యి షేర్లు కొనుగోలు చేశారని.. ఈ కంపెనీలో ఆయన భార్య కాజోల్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీకి అజయ్ 2013లో డైరెక్టర్ గా ఉండి.. 2014లో రాజీనామా చేశారని పనామా బయటపెట్టింది.   అయితే అందరూ చెప్పినట్టే ఇప్పుడు వీరు కూడా తాము ఏం తప్పు చేయలేదని అంటున్నారు. తాను ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించే విదేశాల్లోని ఆ కంపెనీలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టానని.. చట్ట ప్రకారం చేయాల్సిన ట్యాక్స్ రిటర్న్స్ కూడా చేశామని, వాటి వివరాలు తన కుటుంబం ఇప్పటికే తెలియజేసిందని అజయ్ దేవగన్ అన్నారు. మరి ముందు ముందు ఇంకెంతమంది పేర్లు బయటపెడుతుందో చూడాలి.  

విజయపథంలో ట్రంప్... రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంపే..

  అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్ డ్రంప్ మరో అడుగు ముందుకేశారు. ఇండియానా ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ తన విజయ కేతనాన్ని ఎగరేసి పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ చేస్ అభ్యర్ధిగా నిలిచాడు. ఇండియానా ఎన్నికల్లో క్రుజ్ ట్రంప్ పై ఓటమిపాలవ్వడంతో తాను ఎన్నికల నుండి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుండి అధ్యక్ష అభ్యర్దిగా ట్రంప్ కు లైన్ క్లియర్ అయింది. మొత్తానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్.. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో విజయ సాధించి అమెరికా అధ్యక్ష బరికి దిగాడు.

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. ఇబ్బందులు తప్పవు.. రాయపాటి

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేస్తున్నారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హామీలు ఇచ్చాయి.. ఇప్పుడు ఆహామీలను పెద్దలు నెరవేర్చాల్సిందే అని డిమాండ్ చేశారు. అంతేకాదు నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు.. దానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ కూడా ప్రధాని ప్రకటనను స్వాగతించి.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.. ఇప్పుడు వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

న్యాయవాదుల కేటాయింపులు.. ఏపీకి 492, తెలంగాణకు 335

  ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకూ దాదాపు అన్ని శాఖల్లో విభజన జరిగింది. అయితే ఇప్పుడు న్యాయవ్యవస్థలో కూడా ఇరు రాష్ట్రాలు ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. న్యాయధికారుల కేటాయింపునకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు ఓ జాబితాను తాజాగా విడుదల చేసింది. రెండు రాష్టాల్లో జిల్లా జడ్జీలు, సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు.. మొత్తం కలిపి 830 మంది ఉండగా వీరిలో ముగ్గురుతప్ప మిగతా 827 మంది ఆప్షన్లు ఇచ్చారు. దీని ఆధారంగా 827 మందిలో 492 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 335 మందిని తెలంగాణకు కేటాయించారు.   తెలంగాణకు కేటాయింపులు... తెలంగాణకు 335 మందిని కేటాయించగా.. అందులో 77 మంది జిల్లా జడ్జిల కేడర్, 65 మంది సీనియర్ సివిల్ జడ్జీల కేడర్, 193 మంది జూనియర్ సివిల్ జడ్జీల కేడర్ న్యాయాధికారులున్నారు. ఈ మూడు కేడర్లలోని 28 మంది విశ్రాంత న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించారు.   ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు... ఆంధ్రప్రదేశ్‌కు 492 మందిని కేటాయించగా.. అందులో 79 మంది జిల్లా జడ్జీల కేడర్, 123 మంది సీనియర్ సివిల్ జడ్జీల కేడర్, 290 మంది జూనియర్ సివిల్ జడ్జీల కేడర్ న్యాయాధికారులున్నారు. 34 మంది విశ్రాంత న్యాయాధికారులను ఏపీకి కేటాయించారు. ముగ్గురు న్యాయాధికారులు ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సర్వీసు రికార్డుల్లోని వివరాల ఆధారంగా వారిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.

కేరళలో దారుణం.. నర్సింగ్ విద్యార్ధినిపై సామూహిక అత్యాచారం..

కేరళలో కాలేజి విద్యార్థినిపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేసి, హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణం జరిగిన కొద్దిరోజులకే ఇప్పుడు మరో ఘాతుకం చోటుచేసుకుంది. కేరళలోని తిరువనంతపురంలోని కాలేజీలో ఓ 19 ఏళ్ల దళిత విద్యార్ధి బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే ఆమెకు ఆటో డ్రైవర్ ఫైజు అనే ఓ స్నేహితుడు ఉన్నాడు. ఈ పరిచయంతోనే తనను ఆటోలో ఎక్కించుకొని.. మార్గమధ్యంలో ఫైజు స్నేహితులు మరో ఇద్దరిని ఎక్కించుకొని ఓ నిర్జర ప్రదేశానికి తీసుకెళ్లి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె మూర్చకు గురవ్వడంతో అక్కడే వదిలి వెళ్లిపోయారు. అనంతరం బాలిక అరుపులు విని కొందరు వ్యక్తులు వచ్చి ఆమెను కాపాడి.. ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించగా అసలు విషయం బయటపడింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులకోసం గాలిస్తున్నారు. షైజుతో పాటు మరో నిందితుడిని సుజిత్ గా బాధితురాలు గుర్తించిందని పోలీసులు చెప్పారు.

నేను రాజకీయాలకు పనికిరాను.. పవన్ నిజాయతీగా ఉంటాడు

దర్శకరత్న దాసరి నారయణరావు ఈరోజు తన 72వ పుట్టిరోజు జరుపుకుంటున్నారు. ఈసందర్బంగా దాసరి మీడియాతో మాట్లాడుతూ పలు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలని.. హైదరాబాద్లో రెండు వేల ఎకరాలు సినిమా హబ్ కు కేటాయించి.. దీనికోసం పలు సలహాలు, సూచనల కోసం తనను అడగటానికి ప్రభుత్వమే దగ్గరుండి కమిటీని ఏర్పాటు చేయడం విశేషం అన్నారు. ఇంకా ఏపీలో కూడా సినిమాలకు సంబంధించిన మౌళిక వసతులు మరిన్ని కల్పించాలన్నారు. షూటింగుల కోసం పర్మిషన్లు దొరకడం కష్టమవుతోందని, సింగిల్‌ విండో పద్ధతిన అనుమతులు మంజూరు చేస్తే బాగుంటుందన్నారు.   అంతేకాదు రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని, తన లాంటి వాళ్లు ప్రస్తుత రాజకీయాలకు పనికిరారని, వెళ్తే బురద చల్లించుకొని రావాలని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు.   ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ..అతను ముక్కుసూటి మనిషి అని, నిజాయతీగా ఉంటాడని, ఓ మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఉండే మనస్తత్వం గలవాడని, అతను రాజకీయాల్లోకి రావడం సంతోషకరమైన విషయమేనని, పవన్‌ రాణిస్తాడనే నమ్మకం ఉందని అన్నారు.

వైసీపీ ఎమ్మేల్యేల టీడీపీ ఎంట్రీకి బ్రేక్.. మూఢం, మూహూర్తాలు లేవట..

  వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి ఏపీ అధికారపార్టీ టీడీపీలో చేరుతున్న సంగతి తెలసిందే. అయితే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు ఏదో నామ్ కే వాస్త్ పార్టీ మారడంలేదట. ముహూర్తలు చూసుకొనిమరీ పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ చేరిన నేతలు కూడా దాదాపు అలా ముహూర్తాలు చూసుకొని చేరినవారే ఉన్నారంట. తమ తమ పేరు బలాలకు సంబంధించి మంచి మంచి జ్యోతిష పండితులతో సుముహూర్తాలు పెట్టించుకుని సీఎం చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కేస్తున్నారు. అంతేకాదు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నా ఇప్పుడప్పుడే వారు చేరే పరిస్థితి కనిపించడంలేదట. ఎందుకంటే.. ప్రస్తుతం మూఢం అని.. మంచి మూహూర్తాలు లేవనే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరాలంటే కొంత సమయం ఆగాల్సిందే అని చెబుతున్నారు జ్యోతిష్యులు. మూఢం పూర్తైన వెంటనే వైసీపీకి చెందిన మరికొంత మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కడం ఖాయం అంటున్నారు. మొత్తానికి సినిమా వాళ్లేకాదు రాజకీయ నాయకులు కూడా ముహూర్తాలను, జ్యోతిష్యాలను నమ్మే పరిస్థితి వచ్చింది.

మాల్యా రాజీనామా తిరస్కరించిన రాజ్యసభ... సంతకం కూడా స్కాన్ చేసిందే..

వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు వెళ్లిన విజయ్ మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ  రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనకు ఇక్కడ న్యాయం జరగదనే తను రాజీనామా చేస్తున్నట్టు కూడా మాల్యా లేఖలో పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు మాల్యా రాజీనామా లేఖను అన్సారీ నిన్న తిరస్కరించారు. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా ఈ లేఖ లేదని, సరైన పద్దతిలో లేని కారణంగానే రాజీనామాను తిరస్కరిస్తున్నామని చెప్పారు. తన రాజీనామా లేఖలో సంతకం కూడా స్కాన్ చేసిఉందని.. ఇది నిబంధనలకు అనుగుమంగా లేదని రాజ్యసభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు రుణ బకాయికి సంబంధించి ఆయన ఇచ్చిన సమాధానంపై కూడా కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మాల్యా ప్రవర్తన రాజ్యసభ ఎంపీ హోదాకు అనుగుణంగా లేదని ఈరోజు రాజ్యసభకు తన నివేదికను సమర్పించనుంది.

ప్రశ్నలు భరించలేక ఏడ్చేసిన యడ్యూరప్ప..

కర్ణాటక మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఏడ్చేశారంట. అంతలా యడ్యూరప్పను ఏడిపించింది ఎవరబ్బా అనుకుంటున్నారా. సీబీఐ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏడ్చేశారంట. అసలు సంగతేంటంటే.. యడ్యూరప్ప నిర్వహిస్తున్న ప్రేరణా ట్రస్ట్ రూ.20 కోట్ల నిధులు అందుకున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై కోర్టులో విచారణ జరుగగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న స్కాంలపై కోర్టు ప్రశ్నలు సంధించింది. అయితే ఒకటి కాదు రెండు కాదు రెండున్నర గంటల వ్యవధిలో ఏకంగా 475 ప్రశ్నలను అడిగారు. దీనికి యడ్యూరప్పా భావోద్వేగానికి గురై.. తానే తప్పూ చేయలేదని స్పష్టం చేస్తూ, చట్ట పరిధిలోనే పాలన జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే పని చేయలేదని అన్నారు. ఇంకా చెబుతూ ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యారు.