ప్రత్యేక హోదాపై ఏపీలో మొదలైన నిరసనల సెగ.. పవన్ కళ్యాణ్ మాట్లాడాలి..
posted on May 5, 2016 @ 12:03PM
ప్రత్యేక హోదాపై నిన్న పార్లమెంట్లో కేంద్రమంత్రి జయంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలకు గాను ఏపీలో నిరసనల సెగలు మొదలయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని.. విభజన చట్టంలో ఇది లేదని సిన్హా చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. దీంతో విజయవాడ, విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఆదోళనలు చేపడుతున్నారు.
విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వార్యంలో ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిందంటూ.. పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజల సంక్షేమంపై ఎన్నో మాటలు చెప్పారని ఇప్పుడు హోదా లేదంటూ ప్రకటించారు.. ఇప్పుడు దీనిపై వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా మోడీ ఇచ్చారు.. ఇప్పుడు బీజేపీ ప్రకటన సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ విషయం పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
మరోవైపు విశాఖలో కూడా ప్రత్యేక హోదాపై నిరసనలు మొదలయ్యాయి. విశాఖపట్నంలో అంబేద్కర్ జంక్షన్‌లో విద్యార్థి జేఏసీ ఆందోళన చేస్తోంది. కేంద్రం ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తోంది. మరి దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.