రోగి పడకపై కాలు పెట్టి.. ఐఏఎస్ అధికారి అహంకారం
posted on May 5, 2016 @ 10:46AM
చదవు సంస్కారం నేర్పుతుంది అంటారు. కానీ ఉన్నత చదువులు చదువుకొని.. ఒక అత్యున్నత పదవిలో ఉన్న కొందరు మాత్రం అలాంటి సంస్కారం మరచిపోయి. అధికారంలో ఉన్నాం కదా తామేం చేసినా చెల్లుబాటు అవుతుందిలే అని ప్రవర్తిస్తుంటారు. ఒక్కొక్కరూ, ఒక్కో రకంగా తమ అధికారాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఇక్కడ ఓ యువ ఐఎఎస్ అధికారి కూడా అలాగే ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు. చత్తీస్ గఢ్ కు చెందిన జగదీశ్ శంకర్ అనే ఐఏఎస్ అధికారి ఒక ఆస్సత్రిని సందర్శించారు. అయితే అక్కడ ఒక మహిళతో మాట్లాడుతూ.. రోగుల పడకకు ఉండే స్టీల్ రెయిలింగ్ పై దర్జాగా కాలు పెట్టి మాట్లాడారు. అంతే ఇంతలో ఆ ఫొటో తీసి సోషల్ మీడియా పెట్టేసరికి ఐఎఎస్ అధికారి నిర్వాకం బయటపడింది. దీంతో ఆయనపై నెటిజన్లు మండిపడుతూ.. ఆయనపై విమర్శల బాణాలు సంధించారు. రోగులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోమని, ఈ సంఘటనను పునరావృతం కానివ్వదని, ప్రజలకు మర్యాదనివ్వని నీకు మర్యాద ఎవరిస్తారని, ఎలాంటి సంస్కారం నేర్చుకున్నావు, నీలాంటి కొడుకును కన్న తల్లిదండ్రులు ధన్యమయ్యారని పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు.