సంవత్సరాలు,వారాలు తెలియని అన్నవరం ఆలయ అధికారులు...
posted on May 5, 2016 @ 5:11PM
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయ అధికారులకు తెలుగు సంవత్సరాలు, వారాలు తెలియవనుకుంట. స్వామి వారి కళ్యాణానికి సంబంధించి తయారు చేసిన ఆహ్వాన పత్రికలో తప్పులు దొర్లాయి. ప్రస్తుతం జరుగుతున్న దుర్ముఖి నామ సంవత్సరానికి బదులుగా జయ నామ సంవత్సరమని..మంగళవారానికి బదులు శనివారమని ఈ ఆహ్వాన పత్రికలో ముద్రించారు. దీంతో భక్తులు-స్థానికులు కూడా ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఆలయ అధికారుల తీరు వల్ల తరచూ వార్తల్లో కెక్కడం ఆలయ పరువు ప్రతిష్టలు మంటగలసిపోవడం కామన్ అవుతోంది. అప్పట్లో ఒక వివాహ కార్యక్రమం సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు జరగడంతో భక్తుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఏకంగా స్వామి వారి కళ్యాణ పత్రికల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అధికారులు అభాసుపాలయ్యారు.