టీడీపీ రూ.20 కోట్ల భూమి ఆఫర్ చేసింది.. వైసీపీ ఎమ్మెల్యే

  వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి టీటీడీపీలోకి చేరుతున్న వేళ మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ పై సంచలనమైన ఆరోపణలు చేశారు. విశాఖపట్టణం జిల్లాలోని మాడుగుల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ..  తనను టీడీపీ పార్టీలోకి చేర్చుకునేందుకు గాను సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించారని.. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని.. రూ.20 కోట్లు, రాజధానిలో భూమి ఇచ్చేందుకు తనకు ఎర చూపారని ఆరోపించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లను కలిసే ఏర్పాటు చేస్తానని సీఎం రమేష్ తనతో అన్నారని, అయితే, ఈ ఆఫర్ ను తాను తిరస్కరించానని చెప్పారు.

కేజ్రీ ప్లాన్ ఫ్లాప్ అయిందా.. 23 శాతం కాలుష్యం పెరిగింది

  ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈమధ్యే మలి దశను ప్రారంభించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ పద్దతి సత్ఫలితాన్ని ఇవ్వలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. బ్రీత్ ఎయిర్ క్వాలిటీ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ నాటికి కాలుష్యం 23 శాతం పెరిగిపోయిందట. తొలి రెండు వారాల్లో ఘనపు మీటర్ పరిధిలో 56.17 మైక్రోగ్రాముల కాలుష్య కారకాలుండగా, సరి-బేసి విధానం ముగిసేనాటికి అది 68.98 మిల్లీగ్రాములకు పెరిగిందట. దీంతో బస్ సర్వీసులను పెంచడం, పరిశ్రమలకు అడ్డుకట్ట, కాలుష్య కారకాలను వెదజల్లే వాహనాల అదుపు వంటి అదనపు చర్యలు తీసుకోకుంటే, దీర్ఘకాలంలో సరి-బేసి విధానం పని చేయదని వెల్లడైనట్లయింది. మరి దీనికి కేజ్రీవాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మోడీ విద్యార్హతలపై డౌట్ క్లియర్.. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు..

  ప్రధాని నేరంద్ర మోడీ విద్యార్హతలు ఏంటో తెలియజేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమాచార కమిషనర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రశ్నలకు వారు సమాధానం చెప్పారో లేదో తెలియదు కాని..  గుజరాత్ కు చెందిన 'అహ్మదాబాద్ మిర్రర్' పత్రిక మోదీ విద్యార్హతల వివరాలను బయటపెట్టింది. ఆయన విస్నగర్ లోని ఎంఎన్ సైన్స్ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారని, ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారని తెలిపింది. 1983లో 62.3 శాతం మార్కులతో పట్టాను పొందారని వివరించింది. ఆయన చదువుకుంటున్న సమయంలోనే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ చేస్తున్నారని, వీరిద్దరి రోల్ నెంబర్ 71 అని పేర్కొంది. మరి కేజ్రీవాల్ గారికి  ఈ వివరాలు సరిపోతాయో లేదో చూడాలి మరి.

అగస్టా పై పారికర్.. 4న అంతా బయట పడుతుంది..

  అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ కుంభకోణంలో సోనియా గాంధీపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.  ఈ డీల్ లో కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నేతలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈకేసు వ్యవహారంలో ఇప్పటికే మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగికి ఈడీ సమన్లు జారీ చేసింది కూడా. అయితే ఇప్పుడు దీనిపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మరో విషయం వెల్లడించారు. 4వ తేదీన పూర్తి వివరాలతో కూడిన దస్త్రాలన్నింటినీ పార్లమెంట్ లో ప్రవేశపెడతానని, దాంతో ఎవరి తప్పెంతన్నది తేలుతుందని ఆయన అన్నారు.   మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తుంది. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు మరోసారి అగస్టా కుంభకోణాన్ని బీజేపీ వెలుగులోకి తీసుకురాగా, పూర్తి విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

పవన్ పై వర్మ సెటైర్లు... గబ్బర్ సింగ్ కావాలి.. బెగ్గర్ సింగ్ వద్దు..

  ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంపై ట్విట్లర్లో ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ..  మరోసారి తనదైన శైలిలో సెటైర్ వేశారు. పవన్ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుక్కోవడం మానాలని.. పవన్ గబ్బర్ సింగ్ అని, బెగ్గర్ సింగ్ కావొద్దని వివాదాస్పదవ్యాఖ్యలు చేశాడు.  వీరుడు అడుక్కోకూడదని, ఏ కాపులకైతే మీరు పవర్ ఇచ్చారో.. వాళ్లని మీ విన్నపాలతో బీదవాళ్లను చేశారని వ్యాఖ్యానించాడు. అరే కెసిఆర్‌లా నీ తాట తీస్తాననే పవర్ హీరో మాకు కావాలి. విన్నపాలు కోరే పవర్ లేని స్టార్‌లు వద్దని వ్యాఖ్యానించారు. డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది కాని.. విన్నపాలు చేస్తే ప్రత్యేక హోదా రాదని అన్నారు.

'ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’ ను ప్రారంభించిన మోడీ..

  ప్రధాని నరేంద్ర మోడీ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్‌ లోని బాలియాలో కొద్దిసేపటి క్రితం 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా దేశంలోని 5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించనున్నట్టు తెలిపారు. పలువురు మహిళలకు స్వయంగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేసిన మోదీ, పేదలందరి జీవితాల్లో వెలుగులను నింపే లక్ష్యంతో తమ ప్రభుత్వం మరిన్ని పథకాలను ప్రకటించనుందని వివరించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశం ముందడుగు వేస్తుందని తాను నమ్ముతానని అన్నారు.

ఈసారి జయలలితకు ఓటమి తప్పదా..? తమిళనాట కొత్త సర్వే..

  తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం చాలా వాడీ వేడీగా జరగనున్నట్టు తెలుస్తోంది. ఒకపక్క ఎన్నికల బరిలో సెలబ్రిటీలు ఉండగా, మరోపక్క ఈసారి హిజ్రాలు కూడా పోటీ చేస్తుండటంతో మరి రసవత్తరంగా మారింది. అయితే ఈసారి మాత్రం ముఖ్యమంత్రి జయలలితకు పరాభవం తప్పదని, తదుపరి ప్రజలు డీఎంకేకు పట్టం కట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెన్నై లయోలా కాలేజ్ పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. పూర్వవిద్యార్థుల సంఘం సమన్వయకర్త తిరునావుక్కరసు మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 29 నుంచి ఏప్రిల్ 28 మధ్య రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని సర్వేలో భాగంగా ప్రశ్నించామని.. ఈ సర్వేలో జయలలితపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసిందని.. సర్వే వివరాలు తెలియజేస్తూ, డీఎంకేకు 124 సీట్లు లాభించనున్నాయని, అన్నాడీఎంకే 90 స్థానాలకు పరిమితం కానుందని వివరించారు.

స్పీకర్ కోడెలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్నారు..

  వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు టీడీపీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరగా.. ఇంకా మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద రావును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. వైయస్సార్ కాంగ్రెస పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 16మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని.. వారిపై అనర్హత వేటు వేయాలని.. పార్టీ ఫిరాయింపులను టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్నారని .. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఫిర్యాదు చేశారు.

కెనడాలో తెలుగు అమ్మాయిపై కాల్పులు..

  విదేశాల్లో తెలుగువారిపై దాడులు జరగడం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు కెనడాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కెనడాలో ఓ తెలుగు అమ్మాయి పైన గుర్తు తెలియని దుండగలు కాల్పులు జరిపి దాడి చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాదుకు చెందిన తింత్రియాజాన్‌ కెనడాలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అయితే ఆమె  ఓ షాపింగ్ మాల్లో వస్తువులు కొనుగోలు చేస్తుండగా.. ఆ సమయంలో దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమెకు తీవ్ర గాయాలవ్వగా ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని దుండగుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. కాల్పుల వెనుక గల కారణాలు ఏమిటన్నది తెలియరాలేదని పోలీసులు చెప్పారు

హైదరాబాద్ మ్యాచ్ కు మళ్లీ వరుణుడి అడ్డంకి..!

  ఐపిఎల్ లో ఎవరికీ లేని అడ్డంకి సన్ రైజర్స్ ను మాత్రం వెంటాడుతోంది. రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ తో జరిగిన గతమ్యాచ్ లో అడ్డు వచ్చిన వరుణుడు, ఈ రోజు బెంగళూరు తో జరిగే మ్యాచ్ కు కూడా వచ్చేశాడు. సాయంత్రం నుంచి మబ్బు పట్టి చల్లగా మారింది హైదరాబాద్ వాతావరణం. ఉప్పల్లో ప్రస్తుతానికి చిన్న జల్లులా వర్షం కొడుతుండటంతో, టిక్కెట్ కొని స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు మ్యాచ్ జరుగుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. గత మ్యాచ్ లో వరుణుడి ప్రభావంతో, హైదరాబాద్ ఆడిన ఫస్ట్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ కు సహకరించిన పిచ్, పుణే బ్యాటింగ్ సమయానికి బ్యాటింగ్ పిచ్ గా మారిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పుణే టీం కంఫర్టబుల్ గా గెలిచింది. ఈరోజు బెంగళూర్ తో జరిగే మ్యాచ్ కు కూడా వర్షం వస్తుండటంతో, క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నా సిటీజనానికి మాత్రం, మలమల మాడ్చుతున్న ఈ ఎండల కాలంలో, వర్షం రిలీఫ్ ఇస్తోంది. ఇంకా వర్షం కురవాలని సిటీవాసులు కోరుకుంటున్నారు.

ఐపిఎల్ 2016 : కోల్ కతా విజయ లక్ష్యం 187

ఢిల్లీలో ఈరోజు జరుగుతున్న కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ లో గంభీర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి వరస వికెట్లతో రసెల్ ఇబ్బందుల్లోకి నెట్టాడు. వన్ డౌన్ బ్యాట్స్ మ్యాన్ గా వచ్చిన సంజూ శామ్సన్(15) కూడా ఆకట్టుకోలేకపోయాడు. కష్టాల్లో ఉన్న ఢిల్లీని కరుణ్ నాయర్ (68, 50 బంతుల్లో), శామ్ బిల్లింగ్ప్ (54, 34 బంతుల్లో) ఆదుకున్నారు. చివర్లో వచ్చిన కార్లోస్ బ్రాత్ వైట్, 11 బంతుల్లో 34 పరుగులతో మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ స్కోర్ 186కు చేరింది. కోల్ కతా బౌలర్లలో రస్సెల్, ఉమేష్ యాదవ్ లకు చెరో మూడు, నరైన్ కు ఒక వికెట్ దక్కాయి.

సెలబ్రేటరీ ఫైరింగ్లో పెళ్లి కొడుకుకే గాయాలు..

  పెళ్లి వేడుకల్లో జరిగిన ఫైరింగ్లో పెళ్లి కొడుకుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హర్యాలోని హిసార్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హర్యానాలోని హిసార్‌లో సెలబ్రేటరీ ఫైరింగ్ చేయగా.. పెళ్లి కొడుకుకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సె మణిదీప్ సింగ్ తెలిపారు. కాగా సెలబ్రేటరీ ఫైరింగ్‌పై నిషేధం వున్నప్పటికీ కొంతమంది బడాబాబులు, ధనవంతులు ఈ నిబంధనని తుంగలో తొక్కి కొన్నిసార్లు తమ ప్రాణాలని, ఇంకొన్నిసార్లు ఇతరుల ప్రాణాలని బలితీసుకుంటున్న ఘటనలు తరచు దేశంలో వెలుగు చూస్తూనే వున్నాయి.

ఢిల్లీ క్యాబ్ ఓనర్లకు సుప్రీం ఝలక్.. సీఎన్జీ కార్లకే అనుమతి

  ఢిల్లీలో క్యాబ్ ఓనర్లకు దిమ్మతిరిగే నిర్ణయాన్ని ఒకటి సుప్రీం కోర్టు తీసుకుంది. ఇక నుండి ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ క్యాబ్ లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే గతంలోనే దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. ఏప్రిల్ 30 లోగా పెట్రోల్, డీజిలేతర సీఎన్జీ వాహనాలుగా మార్చుకోవాలని ఆదేశించింది. అయితే ఈ గడువును పొడిగించాలని క్యాబ్స్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ వేయగా దీనిపై ఈరోజు విచారణ జరిపిన సుప్రీం.. గడువు పెంచేది లేదని.. మే 1నుంచి సీఎన్జీతో ఉన్న క్యాబులను మాత్రమే అనుమతిస్తామంటూ పిటిషన్ కొట్టివేసింది. అయితే, ఆల్ ఇండియా పర్మిట్ ఉన్న వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చింది.

భార్యను అత్యాచారం చేసిన భర్త... ఇంకా ఇద్దరితో..

  మహిళలపై అత్యాచారాలు జరగడం చూస్తూనే ఉంటాం.. కానీ ఒక భర్తే.. భార్యపై అత్యాచారం చేసిన ఘటన యూపీలో జరిగింది. వివరాల ప్రకారం.. యూపీలోని కప్తాన్‌గంజ్ గ్రామంలో బాధిత మహిళ గత రెండు సంవత్సరాల నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే నీతో మాట్లాడాలని చెప్పి సమీత తోటకు తీసుకెళ్లి.. భర్తతో పాటు, మరో ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే గత సంవత్సరం ఈ మహిళను రాణి లక్ష్మీబాయ్ ధైర్య సాహసాల అవార్డుతో యూపీ ప్రభుత్వం సత్కరించింది.

పవన్ కళ్యాణ్ కూడా దేశద్రోహేనా..?

  నిన్న రాజ్యసభలో ప్రత్యేక హోదా పై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్పీ చౌదరి.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఏపీ ప్రజలతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, హీరో శివాజీ కూడా స్పందిస్తూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. రాష్ట్రం ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందే అంటూ, మోదీ ప్రత్యేక హోదాపై పెదవి విప్పాలంటూ వ్యాఖ్యానించారు. అయితే శివాజీ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ యువ‌మోర్చా స్పందించి.. శివాజీపై తీవ్ర స్థాయిలో మండిప‌డింది. ‘దేశం నుంచి ఏపీని విడ‌గొట్టాల‌న్న శివాజీపై కేసు న‌మోదు చేయాలి’ శివాజీపై దేశ ద్రోహం కేసుపెట్టాల‌ని పేర్కొంది.     అయితే ఇప్పుడు ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు శివాజీ స్పందిస్తూ.. ‘ప్రత్యేక హోదాపై ప్రశ్నించే వారందరూ దేశద్రోహులేనా? ఈ రోజున పవన్ కల్యాణ్ గారు కూడా ప్రత్యేక హోదాపై ప్రశ్నించారు.. ఆయన కూడా దేశద్రోహేనా?’ అంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ స్పందించడం చాలా సంతోషించదగ్గ విషయమని..  ప్రత్యేక హోదాపై పవన్ చొరవ చూపాలని, బహిరంగ సభ పెట్టాలని కోరారు. పవన్ కల్యాణ్ ఒక్కరు రోడ్డుపైకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా సమస్యకు పరిష్కారం నాలుగు నెలల్లో లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

బీహార్ మద్యం నిషేదం.. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో బిజినెస్ అదుర్స్

  బీహార్లో సంపూర్ణ మద్యపానం నిషేదించిన సంగతి తెలిసిందే. అయితే బీహార్లో నిషేదించడం సంగతేమో కాని.. బీహార్ తో సరిహద్దు పంచుకుంటున్న జార్ఖండ్ లోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు పెరిగాయట. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లో కూడా మద్యం విక్రయాలు భారీగా పెరిగాయట. ఇది ఎవరో చెబుతున్న విషయం కాదు.. అబ్కారీ శాఖకు చెందిన ఉన్నతాధికారులే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. బీహార్లో మద్యం నిషేదించడంవల్ల బీహారీలు యూపీ జిల్లాలోని బల్లియాలోని భరౌలీ గ్రామానికి చెందిన ఓ మద్యం షాపుకు వెళుతున్నారంట. దీంతో రోజు ఆ షాపు జనంతో కిటకిటలాడిపోతుందట. ఆ క్రమంగా మద్యం షాపు విక్రయాలు ఏకంగా 900 శాతం పెరిగాయట. ఆ షాపు ఒక్కటే కాదు.. ఆగ్రామానికి సమీపాన ఉన్న వేరే గ్రామాల్లో కూడా మద్యం విక్రయాలు భారీగా పెరిగాయట. మొత్తానికి బీహార్లో మద్యం నిషేదం జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లకు వర ప్రదాయినిగానే మారిందని చెప్పాలి.