ఐదు పైసల కోసం... 40 ఏళ్లుగా కండక్టర్ పోరాటం
posted on May 5, 2016 @ 2:57PM
ఐదు పైసల కోసం నలభై ఏళ్లుగా ఓ వ్యక్తి పోరాడుతూనే ఉన్నాడు. ఐదు పైసలేంటి.. నలభై ఏళ్లుగా పోరాటం ఏంటని ఆశ్చర్యంగా ఉంది కదా..వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. దీని అసలు కథ ఏంటంటే.. రణవీర్ సింగ్ యాదవ్ అతనికి ఇప్పుడు 73 ఏళ్లు. 1973 లో తాను ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ (డీటీసీ)బస్సులో కండక్టర్ గా పనిచేసేవాడు. అయితే అతను టికెట్ కోసం ఓ మహిళా ప్రయాణికురాలు దగ్గర 10 పైసలు బదులుగా 15 పైసలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో చెకింగ్ స్టాప్ బస్సులోకి ఎక్కి యాదవ్ పై ఇంటర్నల్ విచారణ చేపట్టారు. ఇక అప్పటి నుండి అతను ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాడు. అయితే 1990లో కార్మికుల న్యాయస్థానంలో యాదవ్ ఈ కేసు గెలిచినప్పటికీ, మళ్లీ తర్వాత ఏడాదిలో ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ అతనిపై కేసును తిరగదోడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అయితే దీనిపై విచారించిన కోర్టు.. డీటీసీ వేసిన పిటిషన్ కొట్టేస్తూ అక్షింతలు వేసింది. దాదాపు 40 ఏళ్లుగా అతను పోరాటం చేస్తున్నాడు.. కార్మికుల న్యాయస్థానంలో గెలిచినా ఫలితాన్ని అతనికి దక్కకుండా చేశారు అని కోర్టు మండిపడింది. అంతేకాదు నష్టపరిహారంగా.. యాదవ్ కు రూ.30వేలు నష్టపరిహారంగా రవాణా సంస్థ చెల్లించాలని తీర్పునిచ్చింది. అతని పారితోషికం రూ.1.28 లక్షలు, సీపీఎఫ్ రూ.1.37 లక్షలు వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే దీనిపై తుది విచారణ మాత్రం మే 26న యాదవ్ హాజరు కావాల్సి ఉంది.