ఎమ్మెల్యేలు కావాలనుకునే వారికి జగన్ చిట్కాలు..
ఎంత డబ్బు ఉన్నా..ఎంత పేరున్నా పొలిటికల్ పవర్ ముందు దిగదుడుపే..అందుకే జీవితంలో ఒక్కసారైనా ఖద్దరు బట్టలు వేసుకోవాలనుకుంటారు చాలామంది. కాని అది అనుకున్నంత ఈజీ కాదు. అలాంటి వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మంచి చిట్కాలు చెబుతున్నారు. రాజకీయ నాయకులు కావాలంటే ఘనమైన వారసత్వం కావాల్సిన అవసరం లేదని, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదన్నారు. అందుకు చక్కన అవకాశం తాను కల్పిస్తున్నానన్నారు. రోజుకి నాలుగు గంటల చొప్పున, 5 నెలల పాటు రోజుకొక పంచాయతీ చొప్పున ప్రచారం కల్పిస్తే..విజయం మీ సొంతమవుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికీ వెళ్తే..మనతో ఉన్నదెవరు, మాటలు చెబుతున్నదెవరు, మన వెంట నడిచేదెవరు? అన్న క్లారిటీ వస్తుందన్నారు. ఆ సమయంలో బూత్ ఏజెంట్లు, గ్రామ పెద్దలు, ఇలా వివిధ స్థాయిల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలకు క్లారిటీ వస్తుందని ఆయన చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఇచ్చే పాంప్లేట్‌ను గడపగడపకు ఇచ్చి, అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయించడం ద్వారా ప్రజల స్పందన తెలుస్తుందని..జూలై 8 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.