ఏపీలో ఇకపై బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్..

ఇటీవలి కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫలాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరైంది. దీంతో ప్రభుత్వపరంగా ఏం కావాలన్నా ఆధార్ కార్డు కావాల్సిందే. ఇక నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ కార్డ్ జారీ చేసే నూతన విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి రానుంది.   భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తొలుత హర్యానాలో ఈ కార్యక్రమం ప్రారంభించగా విజయవంతమైంది. దీంతో రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో జనన ధ్రువీకరణ పత్రం తయారు చేయడం కోసం వివరాలు నమోదు చేసే సమయంలోనే తల్లి లేదా తండ్రి ఆధార్ సంఖ్య, ఫోన్ నెంబర్ వివరాలు జత చేస్తారు. ఆ వెంటనే ఆ బిడ్డకు 14 అంకెలతో కూడిన ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ వస్తుంది. దీని ఆధారంగా ఆ బిడ్డకు శాశ్వత ఆధార్ నెంబర్ మూడు రోజుల్లోనే మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత పేరు పెట్టగానే కార్డులో మార్పు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల వయసు దాటిన తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా జులై నుంచి అమలు చేయనున్నారు.

క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యం.. ఆరో రోజుకి దీక్ష

  కాపునేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష ఆరో రోజుకు చేరింది. మరోవైపు ముద్రగడ మాత్రం వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు వైద్యం చేయడానికి ముద్రగడ అంగీకరించారని, ఆయనకు వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారని అన్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో రక్తపరీక్షలు చేయాలని కలెక్టర్‌ నుంచి ఆదేశాలు అందాయని, పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.   కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని.. తుని అల్లర్ల కేసులో అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ముద్రగడ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

ఫ్రిజ్ సమస్య తీర్చమంటూ సుష్మాకి ట్వీట్... నేను ఏం చేయలేను..

సోషల్ మీడియా ఎక్కుప ప్రాచుర్యం పొందిన తరువాత రాజకీయ నాయకులు ప్రజలకు మరింత చేరువయ్యారనే చెప్పవచ్చు. ఏకంగా వాటి ద్వారానే తమ సమస్యలను నేతలకు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన సమస్యను వివరిస్తూ విదేశాంగ శాఖ, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ కు ట్వీట్ చేశాడు.  ట్విట్టర్లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. తాము ఆపదలో ఉన్నామంటూ చిన్న ట్వీట్‌ చేస్తే చాలు.. సుష్మాస్వరాజ్‌ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు. అలాంటి ఆమె సదరు ట్వీట్ చూసి ఒకింత షాక్ కు గురై.. ఆతరువాత ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు. ఇంతకీ సుష్మ షాక్ అయ్యేలా చేసిన ట్వీట్ ఏంటనుకుంటున్నారా..!   కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్‌, రామ్‌విలాస్‌ పాసవన్‌ను ట్యాగ్‌ చేస్తూ.. వెంకట్‌ అనే పేరుతో ఉన్న ట్విట్టర్‌ నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. అదేంటంటే.. ‘డియర్‌ మినిస్టర్స్‌.. ఓ కంపెనీ నాకు చెడిపోయిన రిఫ్రిజిరేటర్‌ అమ్మింది. అడిగితే.. వారు ఫ్రిజ్‌ వెనక్కి తీసుకోడానికి సిద్ధంగా లేరు సరి కదా.. బాగుచేయించుకోమని సలహా ఇచ్చారు’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు సుష్మాస్వరాజ్‌ చాలా నిజాయతీగా జవాబిచ్చారు. ‘రిఫ్రిజిరేటర్‌ విషయంలో తాను సాయం చేయలేనని.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తాను బిజీగా ఉన్నానని’ సుష్మ ట్వీట్‌ చేశారు.

వాటర్ ట్యాంకులో మృతదేహాలు..

  తిరుపతిలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. వాటర్ ట్యాంకులో మూడు మృతదేహాలు లభ్యమవ్వడంతో స్ధానికులు భయాందోళలో ఉన్నారు. వివరాల ప్రకారం.. తిరుపతి రైల్వే స్టేషన్‌ సమీపంలోని వాటర్‌ ట్యాంకు నుండి దుర్వాసన రావడంతో రైల్వే కూలీలు వాటర్‌ ట్యాంకులో చూడగా అందులో 3 మృతదేహాలు ఉన్నాయి. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసులు మూడు మృతదేహాలను బయటకు తీశారు. అందులో ఒకటి రైల్వేస్టేషన్‌లో వాటర్‌ బాటిల్స్‌ విక్రయించే అబ్దుల్లాగా కూలీలు గుర్తించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఏటీఎం కార్డు లేదా నో ప్రాబ్లమ్...

  అప్పుడప్పుడు ఏటీఎం కార్డులు మర్చిపోతుంటాం.. అది సహజం. దాని కోసం మళ్లీ వెనక్కి వెళ్లడం.. డబ్బులు డ్రా చేసుకోవడం.. చాలా టైం వేస్ట్. అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ఓ సరికొత్త వెసులుబాటు తీసుకొచ్చారు. ఆధార్‌ సంఖ్య, వేలిముద్ర ఆధారంగా పనిచేసే ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. బెంగళూరు నగరంలో తొలిసారిగా ఏర్పాటైన ఈ కేంద్రాన్ని ఆధార్‌ రూపకర్త నందన్‌ నీలెకని ప్రారంభించారు. ఇక్కడి జయనగరలోని డీసీబీ బ్యాంకు ప్రాంగణంలో సోమవారం ఈ సేవలు మొదలయ్యాయి. ఈ యంత్రం ద్వారా ఏటీఎం కార్డు పిన్‌నెంబరు అవసరం లేకుండానే ఖాతాదారులు.. ఆధార సంఖ్య, వేలిముద్రల ఆధారంగా నగదును తీసుకోవచ్చు.

మరోసారి ఉలిక్కిపడ్డ పారిస్.. ఉగ్రవాది కాల్పులు

  పారిస్ లో మరోసారి ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. మాగ్నావిల్‌ లో ఓ ఉగ్రవాది కాల్పులతో విరుచుకుపడగా.. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి, ఆయన భార్య మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఉగ్రవాదిని హ‌త‌మార్చారు. కాగా మాగ్నావిల్‌ ప్రాంతంలో దాడికి దిగింది తామేన‌ని అనంత‌రం ఇస్లామిక్ స్టేట్ ప్ర‌క‌టించింది. పారిస్‌లో భ‌ద్ర‌త‌ను పెంచారు. అక్క‌డి ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే గతంలో జరిగిన ఉగ్రదాడులకు పారిస్ ప్రజలు భయపడుతుంటే.. ఇప్పుడు ఈ కాల్పులతో ఆ ప్రాంతం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

'లింక్ డ్ ఇన్' కొనుగోలు చేసిన మైక్రో సాఫ్ట్.. చక్పం తిప్పిన సత్య నాదెళ్ల..

  ఇక నుండి 'లింక్ డ్ ఇన్' టెక్నాలజీ దిగ్గజం మైక్రో సాఫ్ట్ తో కలిసి తన ప్రయాణం సాగించనుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. లింక్ డ్ ఇన్ కొనుగోలు చేస్తున్నట్టు నిన్న అమెరికాలో ఓ ప్రకటన చేశారు. దాదాపు రూ.2,620 కోట్ల డాలర్లు (రూ.1.75 లక్షల కోట్లు)తో లింక్ డ్ ఇన్ ను సొంతం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాదు తాను మొదటి నుంచి లింక్ డ్ ఇన్ కు పెద్ద అభిమానిని అని పేర్కొన్నారు. లింక్ డ్ ఇన్ తో కలిసి కొత్త అవకాశాలను సృష్టిస్తామని కూడా సత్య ప్రకటించారు.   అయితే ఈ డీల్ కుదరడం వెనుక సత్య నాదేళ్ల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పటినుండో 'లింక్ డ్ ఇన్' ను చేజిక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ గతంలో చాలా సార్లు యత్నించిందట. కానీ ఫలితం లేదు. అయితే సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సత్య నాదెళ్ల.. ఆ సంస్థను టేకోవర్ చేసుకునేందుకు ఫిబ్రవరిలో చర్యలు ప్రారంభించారట. విడతలవారీగా జరిగిన చర్చల ఫలితంగా లింక్ డ్ ఇన్ ను మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసే పనిని నాదెళ్ల విజయవంతగా ముగించారు.

వైసీపీ నేత బైరెడ్డికి చేదు అనుభవం.. కోడి గుడ్లతో దాడి..

  వైసీపీ నేత, రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పులి వెందుల పర్యటనకు వెళ్లిన ఆయనపై ప్రజలు కోడి గుడ్లతో దాడి చేశారు. లింగాల మండలం  పార్నపల్లెలో పర్యటనకు వెళ్లిన ఆయన టీడీపీపై విమర్శలు చేశారు. ‘రాయలసీమ ప్రజల గొంతు కోసి ఆంధ్రాలో అమరావతి పేరుతో రాజధాని నిర్మిస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో టీడీపీ హామీలు గుప్పించింది. ఇప్పటివరకు రుణాల మాఫీ, జాబులు, నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలా ఎక్కడా కనిపించలేదు’’ అని వ్యాఖ్యానించారు. అంతే ఆయన వ్యాఖ్యలకు ఆగ్రహం చెందిన గ్రామ యువకులు ‘రుణాలు ఎక్కడ మాఫీ కాలేదో చెప్పండి’’ అంటూ బైరెడ్డిని నిలదీశారు. అంతేకాదు అబద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో షాక్ కు గురైన బెరెడ్డి ప్రసంగం మధ్యలోనే ఆపి అక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది.

జింబాబ్వే సిరీస్ సొంతం చేసుకున్న భారత్..

  జింబాబ్వే రాజధాని హరారే వేదికగా టీమిండియా-జింబాబ్వే వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి రెండు వన్డేలు జరగగా.. రెండింటిలో భారత్ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు కేవలం 34.4 ఓవర్లలో 126 పరుగులు చేసి అలౌట్ అయింది. ఇక అనంతరం 127 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 26.5 ఓవర్లలో 127 పరుగులు సాధించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మూడు వికెట్లు తీసిన చాహల్ నిలిచాడు. దీంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది.

అలా చేస్తే మిమ్మల్ని ఉప రాష్ట్రపతి చేయరు.. కేజ్రీవాల్

  ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌కు మధ్య తరచూ వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ కు లేఖ రాస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీకి మద్దతుగా ఉండి ప్రజావ్యతిరేక పనులు చేస్తే ఆయనేమీ మిమ్మల్ని దేశ ఉపరాష్ట్రపతిని చెయ్యరు అంటూ ఘాటుగా లేఖలో పేర్కొన్నారు. ఆప్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పనిలో కేంద్రం అడ్డుతగులుతోందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మా ప్రభుత్వం నిన్ననే వంద సీట్లతో మెడికల్‌ కళాశాల ప్రారంభించింది.. ఇక దానిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెయ్యమని మీ ఏసీబీ టీంతో చెప్పండి, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ ఇంటిపై దాడలు చేయించమని ప్రధాని మోదీతో చెప్పించండి.. అంటూ కేజ్రీవాల్‌ లేఖలో రాశారు.

సచిన్ కు రాసిన లేఖ.. 76 లక్షల నిధుల‌ు గ్రాంట్

  రాజ్య‌స‌భ స‌భ్యుడు, టీమిండియా మాజీ క్రికెట‌ర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాసిన లేఖ.. ఒక స్కూల్ దుస్థితినే మార్చేసింది. పశ్చిమబెంగాల్ పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని స్వర్ణమయి సస్మల్ శిక్షా నికేతన్ స్కూల్ పరిస్థితి అద్వానంగా మారింది. అయితే దీనిపై స్కూల్ యాజమాన్యం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం మాత్రం శూన్యం. దీంతో ఆఖరికి విద్యార్ధులు, ఉపాధ్యయులు  సచిన్ టెండూల్కర్ కి త‌మ స్కూలు దుస్థితిని వివ‌రిస్తూ ఓ లేఖ రాశారు. ఇక లేఖను అందుకున్న స‌చిన్ ఆ స్కూలుకి తన ఎంపీలాడ్‌ పథకం ద్వారా రూ. 76 లక్షల నిధుల‌ను ఇచ్చారు. దీంతో స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్కూల్లో ప్రస్తుతం 900 మంది విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు. స‌చిన్ స్పందించ‌డంతో త‌మ స్కూలు ఇక బాగుప‌డుతోంద‌ని విద్యార్థులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

పంజాబ్ డ్రగ్స్ పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు...

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లోని జ‌లంధ‌ర్ వ‌ద్ద ఈరోజు మ‌హా ధ‌ర్నా కార్య‌క్ర‌మం చేప‌ట్టగా.. ఆకార్యక్రమంలో పాల్గొన్న ఆయన డ్రగ్స్, లా అండ్ ఆర్డర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ దందాలు పేట్రేగిపోతున్నాయని.. తామకి కనుక విజయాన్ని అందించి.. అధికారం కట్టబెడితే డ్రగ్స్ లేకుండా చేస్తామని అన్నారు. పంజాబ్ లో డ్ర‌గ్స్ అత్యంత తేలికైన వ్యాపారంగా మారిపోయింద‌ని, వాటిని అరిక‌ట్ట‌డంలో పంజాబ్ లోని శిరోమణి అకాళీదళ్ ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న అన్నారు. మ‌త్తు ప‌దార్థాలు స‌ర‌ఫ‌రా చేసే వారి నుంచి పంజాబ్ ప్ర‌భుత్వం లాభం పొందుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌ధాన మంత్రి మోదీ కూడా ఈ అంశంపై నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. మరి రాహుల్ వ్యాఖ్యలపై మోడీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వంపై రచ్చ... భారత్‌ కన్నా పాకిస్థాన్‌కే ఎక్కువ అర్హత

ఎన్ఎస్జీ (న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్) లో భారత్ కు సభ్యత్వం లభిస్తుందా లేదా అన్న విషయంపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఎస్జీ కూటమిలో సభ్యత్వంపై చైనా తన నిరసనను తెలియజేసినట్టు వార్తలు వినిపించాయి. దాని వెంటే వియన్నా భేటీలో భారత దరఖాస్తుపై అసలు చర్చే జరగలేదని.. భారత దరఖాస్తుపై అసలు చర్చే జరగకుండా తానెలా అభ్యంతరం వ్యక్తం చేస్తానని చైనా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. వియన్నాలో జరిగిన భేటీలో భారత్ సహా ఏ ఒక్క దేశానికి కూటమిలో సభ్యత్వంపై చర్చ జరగలేదని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. భేటీలో భారత్ సభ్యత్వంపై చర్చ జరిగిందంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ఆ దేశం పేర్కొంది.   మరోవైపు దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. న్యూక్లియర్‌ సప్లయర్‌ గ్రూప్‌(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం సాధించేందుకు భారత్‌ కన్నా పాకిస్థాన్‌కే ఎక్కువ అర్హత ఉందని పాకిస్థాన్‌ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ పేర్కొన్నారు. ఎన్‌పీటీ(నాన్‌ ప్రొలిఫరేషన్‌ ట్రీటీ)పై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం ఇవ్వడానికి గ్రూప్‌ అంగీకరించి.. ఒకేతరహా విధానాన్ని ఏర్పాటుచేస్తే అందులో చేరేందుకు భారత్‌ కన్నా పాకిస్థాన్‌కి ఎక్కువ అర్హతలున్నాయని ఆయన అన్నారు.

"హే డొనాల్డ్ ట్రంప్.. ఐ లవ్ యూ".. వర్మ ట్వీట్

  కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్ ద్వారా ట్రంప్ పై ప్రశంసలు కురిపించాడు. అమెరికాలోని ఓర్లాండో గే నైట్ క్లబ్ పై దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ట్రంప్..  "మంచి వారికి చెడు జరిగితే, చెడ్డ వారిపై మరింత ఉక్కుపాదం మోపాలి" అని వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రామ్ గాపాల్ వర్మ గుర్తు చేస్తూ.. "హే డొనాల్డ్ ట్రంప్, ఇలా చెప్పినందుకు ఐ లవ్ యూ" అని ట్వీట్ చేశాడు. అంతేకాదు.. "అమెరికన్లకు ఇప్పుడు రెండే చాయిస్ లున్నాయి. వారిని ట్రంప్ ఆశీర్వదించాలి, లేదంటే అల్లా ఆశీర్వదించాలి" అని కూడా అన్నాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే ట్రంప్ బెటర్ ఆప్షన్ అన్నాడు

ఐదో రోజుకి ముద్రగడ దీక్ష.. క్షీణిస్తున్న ఆరోగ్యం..

  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, తుని అల్లర్ల కేసులో అరెస్ట్ చేసిన నిందితులను విడుదల చేయాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ముద్రగడ మాత్రం వైద్య పరీక్షలకు నిరాకరిస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు ముద్రగడ దీక్ష చేపట్టి ఈరోజుతో ఐదో రోజుకి చేరుకోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. వైద్య బృందాలు ఎంత ప్రయత్నించి నప్పటికీ ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నారని.. రాజమండ్రి సూపరింటెండెంట్  డా.రమేష్ కిషోర్ మీడియాకు తెలిపారు. ఆయన భార్య పద్మావతి, కోడలు సిరి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వారికి వైద్యసేవలందించేందుకు ముద్రగడ అనుమతించారు. దీంతో వారికి సెలైన్లు ఎక్కించామని కిషోర్ చెప్పారు. ముద్రగడ కుమారుడు గిరి మంచినీరు మాత్రమే తీసుకుంటున్నారని తెలిపారు.

కోదండరామ్ ను ఏమనొద్దు.. కేసీఆర్ ఆదేశం

  కేసీఆర్ పాలనను విమర్శించినందుకు గాను కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పలువురు నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కోదండరాంపై దుమ్మెత్తి పోశారు. ఈ నేపథ్యంలో కోదండరామ్ పై సానుభూతి తెలిపిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన కేసీఆర్ పార్టీ నేతలకు కొన్ని ఆదేశాలు జారీ చేశారంట. కోదండరామ్ పై విమర్శలకు దిగితే దానిని విపక్షాలు అనుకూలంగా తీసుకుంటాయని అందుకే కోదండరామ్ ను, జేఏసీ నేతలను విమర్శించవద్దని సూచించారంట. జేఏసీలో మిగిలిన నేతలంతా కోదండరామ్ వెనకే నడుస్తామని చెప్పడం, ఆయన్ను విమర్శిస్తే, ప్రభుత్వం పట్ల ప్రజల్లో అపనమ్మకం రావచ్చన్న అంచనాలు కూడా ఆయన తాజా ఆదేశాలకు కారణమని తెలుస్తోంది. మరి కేసీఆర్ మాటపై టీఆర్ఎస్ నేతలు ఎంత వరకూ నిలుస్తారో చూడాలి.