నిండు గర్భిణీ అయిన భార్యపై భర్త అమానుషం..కడుపులోనే

భార్యలపై భర్తల అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మిగతా రోజుల్లో ఎలాఉన్నా నిండు చూలాలైన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. అమానుషంగా ప్రవర్తించాడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఇడుపులపాడుకు చెందిన నాగలక్ష్మీకి, బల్లికురువ మండలం కొణిదెవకు చెందిన పల్లపు గోపితో నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లైంది. పని పాటా లేకుండా జల్సాలకు అలవాటు పడిన గోపి నాగలక్ష్మీని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. అడ్డుకోవాల్సిన ఆత్తమామలు కొడుక్కి సపోర్ట్‌గా నిలవడంతో ఆమె వేదన అరణ్య రోదనే అయ్యింది.   వీరికి ఇప్పటికే రెండేళ్ల పాప ఉంది. అయితే నాగలక్ష్మీ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. ఈ క్రమంలో ఒకరోజు గోపి నాగలక్ష్మీతో గొడవపడ్డాడు. అంగన్‌వాడిలో పనిచేస్తూ సంపాదిస్తున్న డబ్బులను ఇవ్వాలని ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఎంతకి ఆమె సరే అనకపోవడంతో నిద్రిస్తున్న తన రెండేళ్ల పాపను గోడకేసి కొట్టబోయాడు..అడ్డుకోబోయిన నాగలక్ష్మీని కిందకు తోసి కాలుతో తన్నాడు. మద్యం మత్తులో ఉండటంతో ఆమె పొత్తికడుపుపై పదేపదే తన్నాడు. దీంతో నాగలక్ష్మీకి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు నాగలక్ష్మీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఆపరేషన్ నిర్వహించి శిశువును బయటకు తీశారు. కానీ అప్పటికే శిశువు మరణించడంతో ఆ తల్లి  గుండెలు పగిలేలా రోదిస్తోంది. దీనికి కారణమైన భర్త గోపిని పోలీసులు గాలిస్తున్నారు.

ఇకనుండి ఫేస్‌బుక్‌లో 360 డిగ్రీ ఫొటోలు..

  సోషల్ మీడియా రంగంలోనే తన కంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ.. అన్ని సామాజిక మాద్యమాలను అధిగమించి.. ఫేస్ బుక్ మొదటి స్థానంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక ఫీచర్లతో అందరినీ ఆకట్టుకుంటున్న ఫేస్ బుక్ ఇప్పుడు మరో ఫీచర్ ను తీసుకొచ్చింది. 360 డిగ్రీ ఫొటోలు అప్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. 360 డిగ్రీ కెమెరాతో తీసిన ఫొటోలని అప్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు మొబైల్ ఫోన్లో తీసిన ఫొటోలను సైతం 360 డిగ్రీ వ్యూలో మార్చుకోవచ్చని వెల్లడించింది. ఈ ఫొటోలు వర్చువల్‌ రియాల్టీ కంపాటబుల్‌ డివైజెస్‌లో కూడా చూడొచ్చని ఫేస్‌బుక్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ వెర్షన్లు కూడా ఈ ఫీచర్‌తో వస్తాయని ఫేస్‌బుక్‌ తెలిపింది.

పాకిస్థాన్ కు అమెరికా వార్నింగ్..

  అగ్రరాజ్యమైన అమెరికా నుండి పాక్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని.. అంతేకాదు పఠాన్ కోట్ కు సంబంధించిన విచారణలో భారత్ కు సహకారం అందించాలని ఆదేశించింది. ఇప్పుడు మరోసారి అమెరికా పాక్ కు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. విదేశీ పర్యటనలో భాగంగా ఆయన.. తమ దేశం పొరుగు గడ్డ మీద ఉగ్రవాదం పురుడుపోసుకుంటోందని అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగం చేశారు. దీంతో ‘మీ దేశ గడ్డ మీద నుంచి భారత్ పై జరుగుతున్న దాడులకు తక్షణమే చెక్ పెట్టాలని పాక్ కు అమెరికా నిన్న వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో నిన్న పాక్ కు అమెరికా నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. మరి పాక్ దీనికి ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాబూల్ లో భారత మహిళ కిడ్నాప్..

  ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఆప్ఘనిస్థాన్లో మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో నిన్న భారత సంసతికి చెందిన ఓ మహిళను ఉగ్రవాదులు అపహరించారు. వివరాల ప్రకారం.. కోల్ కతాకు చెందిన జుదిత్ డిసౌజా అనే మహిళ స్వచ్ఛంద సంస్థ అగా ఖాన్ ఫౌండేషన్ లో పనిచేసేందుకు గాను కాబూల్ కు వెళ్లారు. అయితే అక్కడ కార్యాలయం నుండి తన సహోద్యోగులతో కలిసి బయటకు వస్తుండగా వారందరిని తాలిబన్లు అపహరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం అఫ్ఘన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. వీలయినంత త్వరలో డిసౌజాతో సహా కిడ్నాప్ నకు గురైన వారందరిని విడిపించేందుకు యత్నిస్తున్నట్లు అఫ్ఘన్ అధికారులు చెప్పారు.

చోటా రాజన్ హత్య.. నలుగురు కిల్లర్లు అరెస్ట్..

  మాఫియా డాన్ చోటా రాజన్ ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే నలుగురు కిల్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చోటా రాజన్ ను చంపడానికి ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాడు.. ఈనేపథ్యంలో అతని ప్రధాన అనుచరుడు చోటా షకిల్ ను ఏర్పాటు చేయగా.. ఆ ప్లాన్ ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఆ తరువాత చోటా షకీల్ ఆదేశాలతో రాబిన్సన్, జునైద్, యూనస్, మనీష్ అనే నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రంగంలోకి దిగారు.  షకీల్ ఆదేశాలతో ఇప్పటికే ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చేరుకున్న ఈ నలుగురు కిల్లర్లు అదను కోసం మాటు వేశారు.  ప్లాన్లో భాగంగానే వారు ఫోన్ సంభాషణలు చేసుకునేవారు. ఈ ఫోన్ సంభాషణలను పట్టేసిన పోలీసులు నలుగురు కాంట్రాక్టు కిల్లర్లను అరెస్ట్ చేశారు. ఓ పిస్టల్, కాట్రిడ్జ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఐదు రోజుల పాటు వారిని విచారించిన పోలీసులు ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించగా, వారిని చోటా రాజన్ ఉంటున్న తీహార్ జైలుకే తరలించారు.

పఠాన్ కోట్ లో భద్రత కట్టుదిట్టం.. 'షూట్ ఎట్ సైట్' హెచ్చరికలు..

  పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. జనవరి 2 న జరిగిన ఈ ఘటన తరువాత అక్కడ భారీ బందోబస్తే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్టు కనిపిస్తోంది. ఉగ్రవాదులు మరోసారి విమాన స్థావరంపై విరుచుకుపడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు.. అంతేకాక అనుమానితులెవరైనా కనిపిస్తే కాల్చేస్తామంటూ ‘షూట్ ఎట్ సైట్’ హెచ్చరికలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్లను ఎయిర్ బేస్ గోడలపై అతికించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఆర్మీ, బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఐదు గంటల పాటు పఠాన్ కోట్ సరిహద్దు గ్రామాల్లో కవాతు నిర్వహించారు.

రాజన్ పై మరోసారి విరుచుకుపడ్డ స్వామి... టైం బాంబు ఫిక్స్ చేశారు

  బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ రఘురామ రాజన్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆయనను ఆర్బీఐ గవర్నర్ పదవి నుండి తొలగించాలని గతంలో ఆరోపించారు. ఇప్పుడు మరోసారి రాజన్ పై ఆయన మండిపడ్డారు. 2013లోనే ఆర్బీఐ గవర్నర్ భారత ఆర్థిక వ్యవస్థలో టైంబాంబును పెట్టారని 2016 డిసెంబర్ లో పేలేలా టైమ్ ఫిక్స్ చేశారని విమర్శించారు. మార్చుకోవలసిన 240 అమెరికన్ డాలర్లను బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్య స్వామి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. మరి దీనిపై రాజన్ ఎలా స్పిందిస్తారో చూడాలి.   అయితే ఈసారి కూడా ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ నే ప్రధాని ఎన్నిక చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి ఎన్ని ఆరోపణలు చేసినా ప్రధాని మాత్రం సరిగ్గా స్పందిచని తీరు చూస్తుంటే.. అందునా నెటిజన్లు కూడా రాజన్నే మళ్లీ గవర్నర్ గా నియమించాలని కోరుతుండటంతో ఆయన్నే గవర్నర్ గా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసుపై 'సిట్'... నిగ్గుతేల్చేందుకే..

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి.. విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా కేసును  సీబీఐ.. ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు ఇంకా వేగవంతం చేయడానికి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ పలు కీలక సమాచారాలు సేకరించగా.. ఇప్పుడు సిట్ తో దర్యాప్తు ఇంకా తేలికవుతుందని భావిస్తున్నారు.     మరోవైపు కాంగ్రెస్ పార్టీని.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇరుకున పెట్టిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసుపై దర్యాప్తును కూడా సిట్ కు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగిని ఈడీ విచారించింది. మరి సిట్ దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

ఆస్పత్రిలో కూడా దీక్ష చేస్తున్న ముద్రగడ..

  కాపు నేత ముద్రగడ పద్మనాభం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తుని కేసులో పది మంది నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ముద్రగడ ఆ అరెస్టులను నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ముద్రగడను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో ఉన్నాగానీ ఆయన ఆమరణ దీక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంత మంది చెప్పినా దీక్షను మాత్రం విరమించేది లేదని అంటున్నారు. అంతేకాదు చికిత్స అందించేందుకు వైద్యులు చేస్తున్న యత్నాలను కూడా ఆయన అడ్డుకుంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

బాగ్దాద్‌లో జంట పేలుళ్లు.. 22 మంది మృతి

  బాగ్దాద్‌లో మరోసారి జంట పేలుళ్లు సంభంవించాయి. ఈ పేలుళ్లలో  22 మందికి పైగా మరణించగా.. 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. బాగ్దాద్‌లోని మార్కెట్‌ స్ట్రీట్‌లో ఒక పేలుడు సంభవించింది. ఇరాక్‌ భద్రతా దళాలు బాగ్దాద్‌కు పశ్చిమ దిశలో ఉన్న ఫల్లూజా ప్రాంతంనుంచి ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుడులో 15 మంది మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు.   మరోవైపు తాజిలోని ప్రధాన ఆర్మీ చెక్‌ పాయింట్‌ వద్ద ఆత్మాహుతి దళ సభ్యుడితో కూడిన కారుబాంబు పేలుడులో ఏడుగురు జవాన్లు మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు.

రాష్ట్రంలో కొత్తగా 349 బ్యాంకులు.. చంద్రబాబు

  విజయవాడలో బ్యాంకర్ల సదస్సు సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకర్లు వినూత్నంగా ఆలోచించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది రూ. 83 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గృహ నిర్మాణానికి 12 వేల కోట్ల రూపాయిలు ఇవ్వాలని, విద్య కోసం 2150 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధికి 5536 కోట్ల రూపాయిల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కోళ్ల పరిశ్రమకు రూ.1299 కోట్లు, మత్స్య శాఖకు రూ.1713 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 349 బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు అన్నారు. ముద్రా బ్యాంకు రుణ లక్ష్యంగా రూ.25 వేల కోట్లు నిర్ణయించారు. రుణ ప్రణాళిక లక్ష్యం 1,65,538 కోట్ల రూపాయిలని, ప్రాధాన్య రంగాలకు 1,25,538 కోట్ల రూపాయిలు ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు అన్నారు.

సన్నబడితేనే ఉద్యోగాలు.. లేదంటే తీసేస్తాం..

సాధారణంగా సినిమా హీరోయిన్లు నిరంతరం ఎక్సరసైజ్లు చేస్తూ తమ బాడీ మెయింటెన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు సన్నగా నాజుగ్గా ఉంటేనే ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు ఈప్రభావం ఉద్యోగాలపై కూడా పడినట్టుంది. సన్నబడితేనే ఉద్యోగంలో ఉంచుతాం.. లేదంటే తీసేస్తాం అంటూ  వార్నింగ్ ఇచ్చింది ఓ సంస్థ. ఇంతకీ ఆ సంస్థ ఏదనుకుంటున్నారా.. ఎయిర్ ఇండియా.. వివరాల ప్రకారం.. ఎయిర్‌ఇండియా సిబ్బందిలోని 2,800 మందిలో దాదాపు 150 మంది వూబకాయులు ఉన్నట్లు ఏఐ గుర్తించి ఆర్నెళ్లు సమయం ఇచ్చి ఆలోపు సన్నబడితే ఉద్యోగాలు ఉంటాయని.. లేకపోతే తీసేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు.. ఏఐ సీనియర్‌ మేనేజర్‌ జారీ చేశారు. మహిళలు బీఎంఐ 25 నుంచి 27లోపు, పురుషులు 27 నుంచి 30లోపు ఉండాలని.. అంతకంటే ఎక్కువ ఉన్న వారు తగ్గకపోతే విమానాల్లోకి అనుమతించమని తేల్చి చెప్పింది. కాగా గతంలో కూడా ఎయిర్ ఇండియా ఇలానే చేసింది. కానీ సిబ్బంది కొరత కారణంగా 15రోజుల్లో మళ్లీ వారిని తీసుకున్నారు.

'సూసైడ్ స్కీం' పెట్టమన్న తహశీల్దాద్.. షోకాజ్ నోటీసులు

  సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు స్కీంలు పెడుతుంటాయి. ఆ స్కీంలా మాదిరిగానే 'సూసైడ్ స్కీం' లాంటిది పెడితే.. వినడానికి చాలా ఆశ్చర్యంగా.. విచిత్రంగానూ ఉంది కదా. ఇలాంటి ప్రతిపాదనే చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని రాట్లం జిల్లా రావోటి మండలానికి చెందిన అమితా సింగ్ అనే వ్యక్తి తహశీల్దార్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన 'సూసైడ్ స్కీం' పెట్టాలని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి సలహా ఇస్తూ.. తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. అంతే ఆ పోస్ట్ పై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న రాట్లం జిల్లా ఇన్ చార్జీ కలెక్టర్ హర్జీందర్ సింగ్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.   మోడీ ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ లో కూడా పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీకి పెద్ద ఎత్తున మద్దతు లభించగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఓ సూసైడ్ స్కీం ఏర్పాటు చేయాలని.. దానికి ‘రాజీవ్ గాంధీ ఆత్మహత్య యోజన’ అని పేరు పెట్టాలని... మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు చెప్పుకుంటూ మాయగాళ్లుగా మారిన లౌకికవాదులకు ఈ స్కీంను వర్తింపజేయాలని కాస్తంత వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో దుమారం రేగింది.