కాకి వాలిందని కారునే మార్చిన సీఎం..

  కాకి వాలిందని కారునే మార్చేశారు ఓ ముఖ్యమంత్రిగారు. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.. ?నిరంతరం వివాదాలతో వార్తల్లో నిలిచే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. అసలు సంగతేంటంటే.. పది రోజుల క్రితం సిద్దరామయ్య ఇంట్లో ఆయన కారు పార్క్‌ చేసి ఉన్నపుడు దానిపై ఓ కాకి కూర్చుంది. విచిత్రం ఏంటంటే.. ఆకాకి కూడా ఎంత ఎగరగొట్టడానికి ప్రయత్నించినా.. పది నిముషాలపాటు కారుపైనే కూర్చుంది. కాకి అలా కూర్చోవడం శని అని, వెంటనే సీఎం కారును మార్చాలంటూ జోతిష్యులు టీవీ చర్చల్లో సూచనలు కూడా చేశారు. దీంతో సిద్దరామయ్య కొత్త కారును కొన్నారు. కొత్త కారు కోసం సీఎం దాదాపు రూ.35 లక్షలు వెచ్చించారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. తనను తాను నాస్తికుడిగా, మూఢ విశ్వాసాలను నమ్మనివాడిగా చెప్పుకునే సిద్దరామయ్య ఈ పని ఎలా చేశారని కొంత మంది అంటుంటే.. ప్రజల ధనం ఇలా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి మరికొంతమంది విమర్శిస్తున్నారు.

కాంగ్రెస్ కు భారీ షాక్.. కీలక నేతలు టీఆర్ఎస్ లోకి

తెలంగాణ రాష్ట్రంలో వలసలు ఇంకా జోరుగానే సాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు నేతలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి జంప్ అవ్వగా.. ఇప్పుడు మరో నలుగురు కాంగ్రేస్ నేతలు గులాబీ కండువా కప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎంపీ గుత్తా, మాజీ ఎంపీ వివేక్ మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ లు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈసందర్బంగా గుత్తా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను వీడటం బాధాకరంగా ఉందని..తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఆకర్షించాయి.. అందుకే కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో చేరుతున్నాం.. ప్రభుత్వానికి, కేసీఆర్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అని అన్నారు.   ఇంకా మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు కొన‌సాగించ‌డానికి తెలంగాణ‌ ప్ర‌భుత్వానికి సంపూర్ణ మ‌ద్ద‌తునిస్తామ‌ని, ఈనెల 15న టీఆర్ఎస్‌లోకి చేరుతున్నామ‌ని పేర్కొన్నారు. ము గ‌తంలో తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ నివేదిక ఇచ్చామ‌ని, ఆ నివేదిక‌లో ఉన్న ఆ అంశాలు ఇప్పుడు కేసీఆర్ చేసి చూపుతున్నారని వివేక్ వ్యాఖ్యానించారు.

అమెరికాలో కాల్పుల కలకలం.. 50 మంది మృతి

  అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. బర్లాండ్ లోని గే నైట్ క్లబ్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 50 మంది మృతి చెందారు. అయితే ఈ దాడులకు పాల్పడింది ఒమర్ మతీన్ గా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం..  ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలస వచ్చి ఫ్లోరిడాలో స్థిరపడ్డ దంపతుల కుమారుడు ఒమర్ మతీన్. అయితే ఒమర్ మతీన్ ఐఎస్ వైపు ఆకర్షితుడయ్యాడు. దీంతో గతంలోనే దీనిపై అతను అతడిని ఎఫ్ బీఐ అధికారులు ప్రశ్నించిన సందర్బాలు కూడా ఉన్నాయట. అయితే నిన్న  ఓర్లాండో నైట్ క్లబ్ లో కాల్పులకు దిగింది కూడా ఒమర్ మతీనే అని.. అంతేకాదు.. "అమక్" ఐఎస్ వార్తా సంస్థ... ఓర్లాండోలో బీభత్సం సృష్టించిన దుండగుడు ఐఎస్ కు చెందిన ఫైటరేనని ప్రకటించింది.

టీమిండియా కోచ్ క్రేజ్.. రవిశాస్త్రి సహా 57 మంది దరఖాస్తులు..

టీమిండియా కోచ్ పదవి చాలా కాలంగా ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పదవికి మాత్రం చాలా క్రేజ్ ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ పదవికి బాధ్యతలు చేపడతామంటూ పెద్ద సంఖ్యలోనే మాజీ క్రికెటర్లు బీసీసీఐ ముందు క్యూ కట్టారు. రవిశాస్త్రితో పాటు మరో మాజీ దిగ్గజం సందీప్ పాటిల్ సహా మొత్తం 57 మంది క్రికెటర్లు కోచ్ పదవి చేపడతామంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 10తో దరఖాస్తులకు గడువు ముగిసిన నేపథ్యంలో కోచ్ పదవికి ఎంతమంది దరఖాస్తు చేశారన్న విషయంపై బీసీసీఐ నిన్న ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం  దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే కోచ్ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేస్తామని బీసీసీఐ ఆ ప్రకటనలో తెలిపింది.

ఇంటర్ పోల్ కు ఈడీ పూర్తి సమాచారం.. మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు..!

  విజయ మాల్యాను అరెస్ట్ చేయడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయమని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌) ఇంటర్ పోల్ ను కోరిన సంగతి తెలిసిందే. దానికి ఇంటర్ పోల్ ను కూడా మాల్యా కేసు గురించిన ఇంకా సమగ్ర సమాచారం అందించమని ఆదేశించింది. అయితే ఇప్పుడు దానిపైమొత్తం సమాచారాన్ని పొందుపరుస్తూ నిన్న ప్రత్యుత్తరమిచ్చింది. దీంతో నేడో, రేపో మాల్యాపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే మాల్యాను  ‘ప్రొక్లెమ్ డ్ అబ్ స్కాండర్’ గా ప్రకటించాలని కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టులో నేడు విచారణ జరగననున్న నేపథ్యంలో దీనిపై కూడా సానుకూల ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మొత్తానికి 17 బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలు ఎగవేసి లండన్ చెక్కేసిన లిక్కిర్ కింగ్ విజయ్ మాల్యాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టిగానే ఉచ్చు బిగుస్తుంది.

కాపుల కోసం రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

ఆర్ధికంగా వెనుకబడిన కాపుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు పథకాలను ప్రవేశపెట్టిందని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ రామానుజయ్య తెలిపారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాపు యువకుల కోసం "విద్యోన్నతి" పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు.   ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడి, సివిల్స్ వంటి ఉన్నతోదోగ్యాల కోసం సన్నద్ధమవుతున్న యువకులు లబ్దిపొందుతారని ఆయన చెప్పారు. ఈ పథకం కింద ప్రతి ఏటా 500 మందికి ఉచిత శిక్షణ కల్పించనున్నామని రామానుజయ్య తెలిపారు. అలాగే "విదేశీ విద్యా దీవెన" పేరిట మరో పథకాన్ని కూడా కాపు యువత కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు. దీని ద్వారా విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లే 500 మంది విద్యార్థులకు సాయం అందజేయనున్నామన్నారు. అయితే ఈ రెండు పథకాలలో లబ్థిపోందాలంటే కాపు కార్పోరేషన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి ఉండాలని ఆయన సూచించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆస్ట్రేలియన్ మాస్టర్స్ విజేత సైనా నెహ్వాల్

ఆస్ట్రేలియన్ మాస్టర్స్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను..భారత బ్మాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గెలుచుకుంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా ఇవాళ సిడ్నీలో జరిగిన ఫైనల్‌ పోరులో సైనా చైనాకు చెందిన సున్ యు‌ను 11-21, 21-14, 21-19 తేడాతో చిత్తుచేసింది. తొలి గేమ్‌లో కాస్త తడబడిన సైనా ఆ గేమ్‌ను కోల్పోయింది. ఆ తరువాత వెంటనే పుంజుకుని ఆధిపత్యం కొనసాగించింది. సున్ యు నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదర్కొన్న సైనా ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ట్రోఫిని సొంతం చేసుకుంది. 2014లో తొలిసారి సైనా ఈ టోర్నీని గెలిచింది.

ఢిల్లీలో మరో "నిర్భయ" ఘటన

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై ఆత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతిని కిడ్నాప్ చేసి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక ఆత్యాచారానికి ఒడిగట్టారు. నిజాముద్దీన్ ప్రాంతంలో 23 ఏళ్ల యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం కదులుతున్న కారులో యువతిపై ఆత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి యువతిని ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలోని ఓ ఫ్లైఓవర్ వద్ద పడేసి వెళ్లిపోయారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై కిడ్నాప్, ఆత్యాచారం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ముద్రగడకు మద్దతుగా నిరసనలు

కాపు గర్జన సందర్భంగా తుని ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన అమాయకులను విడుదల చేయాలంటూ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆమరణ నిరాహారా దీక్ష చేస్తున్న కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భార్య, కోడలి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు నిరసన ప్రదర్శనలకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో నిరనస ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలో సెక్ష్ 144, సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా గరిటెలతో కంచాలను మోగిస్తూ రహదారిపై ఆందోళనలకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ దామోదర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

సిద్దూ ఎం చేసినా వెరైటియే..కాకి వాలిందని..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏం చేసినా పబ్లిసిటీ అయిపోతోంది. అదేంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎం చేసినా అది సంచలనమే కదా. మొన్నామధ్య ఖరీదైన వాచీ పెట్టుకోని విమర్శలు మూటకట్టుకున్న సిద్ధూ..ఆ వెంటనే ఏసీబీ ఏర్పాటు, కుమారుడికి లబ్ధి చేకూర్చడం ఇలా ఒకటేంటి సీఎం సార్‌ ఫుల్లుగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. మళ్లీ రీసెంట్‌గా ఆయన కొత్త కారు కొన్నారు. అదేంటి కారు కొంటే అందులో వింతేముంది అనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం..   సిద్ధరామయ్య కారుపై జూన్ 2న ఓ కాకి వాలింది. డ్రైవర్ తరిమికొట్టినా వెళ్లకుండా..దాదాపు 10 నిమిషాల పాటు కారుపై ఉండిపోయింది. ఈ విషయం మీడియా ద్వారా రాష్ట్రం మొత్తం వ్యాపించింది. సాధారణంగా కాకిని చెడు శకునంగా భావిస్తుంటారు. దీంతో సీఎం నిన్న రూ.35 లక్షలు ఖర్చు పెట్టి టొయోటా ఫార్చ్యూనర్ కారు కొనుగోలు చేశారు. అయితే కాకి వాలడం వల్లే ముఖ్యమంత్రి గారు కొత్త కారు కొనేశారంటూ వార్తలు వస్తుండటంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

ఇద్దరు వ్యక్తులు..బ్యాంక్ ఖాతా ఒక్కటే

వారిద్దరి పేర్లు లక్ష్మీలే..వారి భర్తల పేర్లూ నాగరాజ్‌లే..ఆఖరికి ఊరు కూడా ఒక్కటే..ఇలాంటి పరిస్థితుల్లో వారి ముక్కు, మొహం తెలిస్తే ఓకే. లేదంటే ఎవరైనా బొక్కబోర్లాపడతారు. ఇప్పుడు ఇదే పొరపాటు జరగడానికి కారణమైంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా హోస్పేట్‌  తాలుకాలోని కమలాపుర బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకే ఖాతా సంఖ్యను ఇద్దరు మహిళలకు కేటాయించారు. వీరిలో ఒకరు కన్నడ మాట్లాడే లక్ష్మీ కాగా..ఒకరు తెలుగు మాట్లాడే లక్ష్మీ. ఇద్దరూ అదే ఊరిలో జన్ దన్ పథకం కింద బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దరఖాస్తు చేసుకున్నారు.   ఇద్దరి పేర్లూ..భర్తల పేర్లూ ఒకటే కావడంతో..బ్యాంక్ సిబ్బంది పొరపాటున ఇద్దరికీ ఒకే ఖాతా సంఖ్య మంజూరు చేశారు. వీరిలో కన్నడ లక్ష్మీ తన సంపాదనలో కొంత పొదుపు చేసి బ్యాంకులో జమ చేస్తోంది అలా రూ.8 వేలు  డిపాజిట్ చేసింది. అయితే ఈ విషయం తెలియని తెలుగు లక్ష్మీ జన్‌ధన్ కింద ప్రభుత్వం ఇస్తుందేమోనని భావించి తెలుగు లక్ష్మీ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన ఖాతాలో డబ్బు లేకపోవడాన్ని కన్నడలక్ష్మీ గమనించింది. దీనిపై బ్యాంక్ వారిని ఆరా తీయగా అప్పటికి గాని సదరు సిబ్బందికి చేసిన పొరపాటు తెలిసొచ్చింది. తెలుగు లక్ష్మీ అందుబాటులో లేరని, ఆమె వచ్చాక జరిగిన పొరపాటును సరిచేస్తామని మేనేజర్ హామి ఇచ్చారు.

పవన్ కల్యాణ్ ఓ జోకర్.. హీరోలా వచ్చి జీరోలా వెళుతున్నారు.. నారాయణ

  ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు అన్న సామెత ప్రకారం.. ముద్రగడ పద్మనాభం దీక్షపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఒక పక్క కాపుల కోసం ముద్రగడ దీక్ష చేస్తుంటే.. వారికి అండగా ఉంటానన్న ఆయన ఇప్పుడు ఎక్కడ పడుకున్నారని అన్నాడు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఓ జోకర్ అని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ అప్పుడప్పుడు హీరోలా వచ్చి జీరోలా వెళుతున్నారని.. జిమ్మిక్కులు చేస్తున్న పవన్ చెప్పే నీతులు వినడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరని నారాయణ అన్నారు.   పనిలో పనిగా టీఆర్ఎస్ పార్టీపై నారాయణ విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్పై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కోదండరాం మీద దాడిచేస్తే టీఆర్ఎస్ తన పతనానికి పునాది వేసుకోవడమే అని అన్నారు. విమర్శ ఎందుకు చేశారో తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవటమే వివేకమన్నారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కోదండరామ్ను ఉపయోగించుకుని, ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

ముద్రగడ వద్దకు పయనమైన నేతలు అరెస్ట్..

కాపు నేత ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ఆస్పత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను సందర్శించడానికి వెళ్లిన వైసీపీ నేతలను కూడా పోలీసులు అడ్డగించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడి ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోరుకొండ పోలీస్ స్టేషన్‌కి త‌ర‌లించారు. దీంతో ముద్ర‌గ‌డ‌ను క‌ల‌వ‌నివ్వ‌కుండా త‌మ‌ను పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

ఆటోగ్రాఫ్‌ ఇస్తుండగా సింగర్ దారుణహత్య..

  యూట్యూబ్‌ స్టార్‌, అమెరికన్‌ పాపులర్‌ సింగర్‌ క్రిస్టినా గ్రిమ్మీ దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 22ఏళ్ల క్రిస్టినా ఓర్లాండోలోని ది ప్లాజా లైవ్‌లో నిన్న జరిగిన ఓ టీవీ టాలెంట్‌ షోలో పాల్గొన్నారు. షో ముగిసిన అనంతరం ఆమె అభిమానులకు ఆటోగ్రాఫ్‌ ఇస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆమెను కాల్చి చంపాడు. తీవ్రంగా గాయపడిన క్రిస్టినాను ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఆమెను హత్య చేసిన వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు అమెరికా మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే అసలు హత్య ఎందుకు చేశాడన్న విషయం తెలియదని.. దర్యాప్తు చేయాల్సిన ఉందని పోలీసులు తెలిపారు.

ఒబామా, హిల్లరీపై చెలరేగిన ట్రంప్..

  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హిల్లరీ క్లింటన్ కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నడొనాల్డ్ ట్రంప్ స్పందించి ఇరువురిపై విమర్శలు గుప్పించారు. రిచ్‌మాండ్‌ వర్జీనియాలో జరిగిన ప్రచార సభలో ట్రంప్‌ మాట్లాడుతూ నేర విచారణ ఎదుర్కొంటున్న మహిళకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మద్దతిస్తున్నారంటూ విమర్శించాడు. ఈమెయిల్‌ సర్వర్‌ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న హిల్లరీ క్లింటన్‌కు ఒబామా మద్దతిస్తున్నారు.. దేశం కోరుకునే మార్గమిదేనా అంటూ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా సరే నవంబరులో జరిగే అద్యక్ష ఎన్నికల్లో హిల్లరీని ఎదుర్కోవడానికి తాను సిద్దంగా ఉన్నానని ట్రంప్‌ వెల్లడించారు.  

పిల్లలు చదవడంలేదని కర్పూరంతో కాల్చిన టీచర్..

పిల్లలు సరిగ్గా చదవడంలేదనో.. అల్లరి చేస్తున్నారనో చెప్పి టీచర్లు వారిని అప్పుడప్పుడు కఠినంగా శిక్షిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటి దారుణమైన ఘటనే జరిగింది. తమిళనాడు, విల్లుపురం జిల్లాలోని ఓ స్కూల్లో పిల్లలు బుద్దిగా చదువుకోవడం లేదని వైజ‌యంతి మాల అనే ఉపాధ్యాయురాలు ఏకంగా క‌ర్పూరం పెట్టి కాల్చింది. స‌రిగ్గా చ‌ద‌వాల‌ని హెచ్చ‌రిస్తున్నా విన‌డం లేదంటూ నాలుగో త‌ర‌గతి చ‌దువుతోన్న15మంది పిల్ల‌ల‌పై ఉపాధ్యాయురాలు ఈ చ‌ర్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో విద్యాశాఖ స్పందించి వైజ‌యంతి మాలను, ఆ పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడిని స‌స్పెండ్ చేసింది.   అంతేకాదు చిన్నారులను అంత దారుణంగా శిక్షించినందుకుగాను ఆమెపై జువెనైల్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమెకు ఈనెల 24వ తేదీ వ‌ర‌కు స్థానిక కోర్టు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది.