ముద్రగడ అరెస్ట్ పై చిరంజీవి ఆగ్రహం..
తుని ఘటనపై కాంగ్రెస్ నేత చిరంజీవి స్పందించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తుని ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాపు, బలిజ, ఒంటరి కులాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ముద్రగడ అరెస్టు అమానుషమని, పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ముద్రగడపై వ్యవహరిస్తోన్న తీరు కక్ష సాధింపు చర్యలా ఉందని ఆయన అన్నారు.
కాగా ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరం ఆస్పత్రిలో తన ఆమరణ దీక్షను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకపక్క ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా వైద్య పరీక్షలు చేసుకునేందుకు మాత్రం ఆయన నిరాకరిస్తున్నారు. మరో వైపు ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా తూర్పుగోదావరి జిల్లాలో బంద్ కొనసాగుతోంది.