ముద్రగడ, చంద్రబాబు.. పంతం నీదా నాదా..?
posted on Jun 15, 2016 @ 11:09AM
చూడబోతే కాపు నేత ముద్రగడ పద్మనాభం... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ పట్టు వదిలేలా కనిపించడం లేదు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, తుని అల్లర్ల కేసులో అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్షకు పూనుకున్నారు. ఈరోజుతో ఆయన దీక్ష చేపట్టి ఏడో రోజుకి చేరుకుంది. దీంతో ఒకపక్క ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా.. వైద్య పరీక్షలకు మాత్రం ససేమిరా అంటున్నారు. అంతేకాదు తమ డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రకటన చేస్తేనే తాను దీక్ష విరమిస్తానని ముద్రగడ మొండికేస్తున్నారు. మరోవైపు ముద్రగడ దీక్ష నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నుండి కూడా అడుగు ముందుకుపడటంలేదు. ముద్రగడ దీక్షను విరమిస్తే డిమాండ్లు పరిష్కారం చేస్తామని.. ఇప్పటికే కాపుల సమస్యలపై పరిశీలిస్తున్నామని చెప్పాము. ముందుగా ముద్రగడ దీక్ష విరమిస్తే ఆ తర్వాత ఆయన డిమాండ్ల పరిష్కారంపై ఆలోచిస్తామని ప్రకటన చేశారు. మరి ముందుగా డిమాండ్ల పరిష్కారమంటూ ముద్రగడ... దీక్ష విరమణ తర్వాత డిమాండ్ల పరిష్కారమంటూ ప్రభుత్వం చెబుతుండటంతో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.