ఆగని ఉగ్రదాడులు: మొన్న టర్కీ..నిన్న కాబూల్..నేడు ఢాకా
posted on Jul 2, 2016 @ 10:17AM
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల మారణకాండ ఆగడం లేదు. మొన్న టర్కీలోని అటాటర్క్ విమానాశ్రయంపై దాడి చేసి 41 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ తెల్లవారుజామునే ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో పోలీస్ వాహనశ్రేణి లక్ష్యంగా ఆత్మహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 40 మంది పోలీసులు అమరులయ్యారు. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ముష్కరులు టెర్రర్ సృష్టించారు. నగరంలోని హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్‌లోకి ఉగ్రవాదులు చోరబడి అక్కడున్న వారిని బంధించారు.
సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టి బందీలను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టాయి. బందీల్లో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. భద్రతా దళాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పటి వరకు 12 మంది బందీలను విడిపించినట్టు సమాచారం. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెస్టారెంట్ ప్రాంతానికి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఢాకా ఉగ్రదాడి నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. అక్కడ భారతీయులంతా క్షేమంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలు వేరు వేరుగా ప్రకటించాయి.