హేట్సాఫ్ టూ ఎన్ఐఏ..పేలుళ్ళ కుట్ర ఎలా తెలిసింది..?
posted on Jul 1, 2016 @ 5:35PM
హైదరాబాద్‌లో వీకెండ్‌కు భారీ విధ్వంసానికి స్కెచ్ గీసిన ఇస్లామిక్ ఉగ్రవాదుల కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. దేశాన్ని పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కించిన ఎన్‌ఐఏపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు హైదరాబాద్ లో పేలుళ్లకు ఉగ్రవాద సానుభూతిపరులు కుట్ర పన్నారని ఢిల్లీ లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలా పసి గట్టింది..? భాగ్యనగరంలోని చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మీ ఆలయంతో సహా వివిధ దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ ను పేల్చి వేయాలని వారు పథకం వేసినట్టు ఎలా తెలుసుకుంది. దీని వెనుక ఎన్ఐఏ రెండేళ్ల కష్టం ఉంది.
ఐసిస్ గ్రూప్ మీద, దేశంలో ఉగ్రవాద సానుభూతిపరుల మీద నిఘా పెట్టింది. స్లీపర్‌సెల్స్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు..ఏం చేస్తున్నారు..ఎవరెవరిని కలుస్తున్నారు వంటి వాటిపై ఆరా తీస్తూ వచ్చింది ఎన్ఐఏ. వీరికి సిరియాలోని ఐసిస్‌తో లింకులున్నట్లు 2014లోనే ట్రేస్ చేశారు. ఉగ్రవాద సానుభూతిపరులపై గత నెల 22నే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఒకేసారి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించేందుకు కోర్టు నుంచి అనుమతి పొందింది.. ఓల్డ్‌సిటిలో సోదాలు జరిపి 11 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఐదుగురిని తప్ప మిగిలిన వారిని విడుదల చేసింది. అలా ఉగ్రవాదుల ఎత్తులను చిత్తు చేసింది.